Friday, March 24, 2023

సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందేలా చర్యలు

- Advertisement -

writeజిల్లా అధికారులను ఆదేశించిన కలెక్టర్ సయ్యద్ ఓమర్ జలీల్

మన తెలంగాణ/ వికారాబాద్ జిల్లా : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్దిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సయ్యద్ ఓమర్ జలీల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా అధికారులతో వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పనుల విషయంలో ఎలాంటి జాప్యం చేయకుండా అధికారులు ప్రత్యేక కార్యచరణ ప్రణాళికలు రూపొందించుకుని పని చేయాలని సూచించారు. జిల్లాలోని వివిధ వసతిగృహాల్లో పలు మౌలిక సదుపాయాల కల్పనకు అంచనాలు రూపొందించాలని ముఖ్యంగా బాలికల సంక్షేమ వసతిగృహాలలో సదుపాయాలతో పాటు మరుగుదొడ్ల నిర్మాణాలకు కావాల్సిన నిధులకై అంచనాలు రూపొందించి సమర్పించాలని ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినీ, విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించి వంద శాతం ఉత్తీర్ణతను సాధించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో నిరుపేద ఎస్‌సిలకు పంపిణీ చేసే భూమిని కొనుగోలు చేసేందుకు వీలుగా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో వివిధ ఇంజనీరింగ్ శాఖల ద్వారా చేపడుతున్న పనులు త్వరితగతిన పూర్తి చేసేలా సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు వీలుగా ప్రభుత్వం కెసిఆర్ కిట్టును అందజేస్తుందని, ఇట్టి విషయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల పెంచేందుకు కృషి చేయాలని డిఎంఅండ్‌హెచ్‌ఓను ఆదేశించారు. రైతులు పంట భీమా చేసుకున్న రైతులకు తప్పనిసరిగా రశీదు ఇచ్చి వారికి నష్ట పరిహారం అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించిన వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా తమ తమ శాఖల ద్వారా చేపట్టే పనుల ప్రగతి వివరాలను త్వరలో అందజేయాలని ఆయన ఆదేశించారు. జిల్లా ఎస్‌పి అన్నపూర్ణ జిల్లాలో అమలవుతున్న భరోసా కేంద్రం, లా అండ్ ఆర్డర్ తదితర అంశాలను కలెక్టర్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీవోలు విశ్వనాథం, వేణుమాధవరావు, డిఆర్‌డిఒ జాన్సన్‌తోపాటు పలు శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడానికి వచ్చిన సయ్యద్ ఓమర్ జలీల్‌ను జిల్లా అధికారులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. స్థానిక ఎమ్మెల్యే బి.సంజీవరావుతోపాటు నాయకులు కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News