Home ఎడిటోరియల్ చండీగఢ్ కీచక పర్వం

చండీగఢ్ కీచక పర్వం

Women-Harrase

రాజకీయంగా బలవంతుడైన పురుషుడు ఓ మహిళను వెంటబడి వేధిస్తే ఆ మహిళ తనకు న్యాయం జరగాలని గట్టిగా కోరుకొనకపోవడమే మంచిది. ఎందుకంటే అలా ఆమె కోరుకొంటే చట్టం అమలు యంత్రాంగం, అధికార రాజకీయ వ్యవస్థ అతడికి అండగా నిలిచి, ఆ మహిళను దోషిగా చూపెట్టే ప్రమాదం ఉంది. అంతేకాదు.. ఆ కేసు కోర్టుకు చేరడానికి చాలా ముందు సామాజిక మీడియా అతడు నిర్దోషి అంటూ రుజువులు చూపి కేసు తీరును మార్చేయవచ్చు. చండీగఢ్‌లో ఈ నెల 4వ తేదీ రాత్రి 29 ఏళ్ల వార్నికా కుందు అనే మహిళ తనను ఇద్దరు పురుషులు కారులో వెంబడించి, వేధిస్తున్నటు ఆందోళనగా పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. వారు తనను కిడ్నాప్ చేయడానికి కూడా ప్రయత్నించారని ఆరోపించింది.
చండీగఢ్‌నుంచి దగ్గరలోని పంచకులకు తాను కారు నడుపుకొంటూ వెళుతుండగా వారు వేధించారన్నది ఆమె ఫిర్యాదు సారాంశం. ఆ ఇద్దరు పురుషులలో ఒకరు 23 ఏళ్ల వికాస్ బారాలా. భారతీయ జనతా పార్టీ (బిజెపి) హర్యానా చీఫ్ సుభాష్ బారాలా కుమారుడు. ఆ సమయంలో తాగి ఉన్నట్లు తెలుస్తున్న ఆ ఇద్దరు మగాళ్లనూ మరునాడు అరెస్టు చేశారు. కాని కొన్ని గంటలలోనే బెయిల్‌పై వారు విడుదల అయ్యా రు. జరిగిన అకృత్యం ఆధారాలను సిసి కెమేరాలు చూపుతాయి. కానీ ఆ సమయంలో అవి పని చేయలేదట. నిందితులు ఓ మహిళను 7 కి.మీ వెంటాడితే ఆ దారి పొడవునా అయిదు ప్రదేశాలలో సిసి కెమేరాలు ఉన్నా ఏవీ పని చేయలేదని పోలీసులు చెప్పడం ఆశ్చర్యం. ఈ కేసులో నిందితులపై చాలా తీవ్రమైన ఆరోపణలను పోలీసులు ఉపసంహరించారు కూడా. బెయిలుకు ఆస్కారంగల చిన్న నేరారోపణలను మాత్రమే నమోదు చేశారు. ఇది జరిగిన రెండు రోజుల తరువాత రాజకీయ ఒత్తిళ్లకు తలవంచి పోలీసులు కేసును నీరుగార్పిస్తున్నట్లు గుప్పుమంది.
నిందితులకు రాజకీయ రక్షణ కవచం
తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున నిందితులకు రక్షణగా రాజకీయ శక్తులు ఆట్టే ఆలస్యం చేయకుండా చకచకా రంగంలోకి దిగిపోయాయి. బిజెపికే చెందిన హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖత్తార్ ఈ కేసులో సరైన చర్య తీసుకుంటామని ఇచ్చిన హామీ ఏమయిందో గాని వికాస్ తప్పుకుగాను ఆయన తండ్రి, పార్టీ సహచరుడైన సుభాష్‌ను బిజెపి ఏమీ అనలేదు. హర్యానా పార్టీ అధిపతి వెంట పార్టీ నాయకులు గట్టిగా నిలబడి ఆయన (సుభాష్) రాజీనామా ప్రసక్తి లేదని నొక్కి చెప్పారు. ఆ నాయకుల్లో ఒకరు బాధితురాలినే తప్పుపట్టారు. రాత్రిపూట ఆమె బయటకు వెళ్లాల్సింది కాదని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో బిజెపి సీనియర్ నేతలు ఈ ఉదంతంపై పెదవి కదపడంలేదు.
ఆ నేరం జరిగిందా అన్న దానిని త్వరత్వరగా సందేహాస్పదం చేసేశారు. బాధితురాలు కుందు పైనే ఆరోపణలను గురిపెట్టారు. నైతిక పోలీసింగ్ వీరులు ఎంతో సమర్థంగా ఈ వ్యవహారంలో బిజెపిని కాపాడారు. ఈ నేపథ్యంలోనే నిందితులతో కలిసి కుందు సంతోషంగా గడుపుతున్నట్లు ఒక ఫోటో సామాజిక మీడియాలో దర్శనమిచ్చింది. సుప్రీంకోర్టు అడ్వకేట్ ఒకరు ఆమెను ‘బాధితురాలు కాదు’ అన్న తరహాలో ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. నిందితులు ఆమెకు తెలిసినవారే అయినప్పుడు ఆమెను వారు కిడ్నాప్ చేసే ప్రశ్న ఉదయించదని కూడా ఆ పోస్టులో రాశారు.
రాత్రిపూట స్వేచ్ఛగా పురుషులతో కలసి విహరించే మహిళగా ఆమెను సామాజిక మీడియాలో చిత్రించేశారు. అయితే ఆ తర్వాత కుందు ఆ ఫోటో గురించి వివరణ ఇచ్చారు. అది చాలా పాతదని చెప్పారు. అందులో ఉన్నది నిందితులైన పురుషులు కాదని కూడా చెప్పారు. మహారాష్ట్ర బిజెపి ఆధికార ప్రతినిధి సానియా ట్విట్టర్‌లో ఆ ఫోటోను పోస్టు చేసినట్లు తెలుస్తోంది. తాను పోస్టులో ఇచ్చిన వివరణ హ్యాక్ అయినట్లు కనిపిస్తోందని ఆమె అన్నారు. సోమవారం సాయంత్రం టివి చానెళ్లతో కుందు మాట్లాడారు. ఆ తర్వాత చండీగఢ్ పోలీసులు రహస్య సిసి టివి ఫుటేజ్‌ని సంపాదించామని ప్రకటన చేశారు. కుందు హర్యానా ప్రభుత్వంలో ఒక సీనియర్ ఐఎఎస్ అధికారి కుమార్తె. న్యాయ వ్యవస్థ అండను కోరుతూ ఆమె ధైర్యంగా నిలబడ్డారు. రాజకీయ ఒత్తిళ్లకుగాని, తనను సిగ్గుపడాలని చేసే ప్రచారాలకుగాని ఆమె లొంగలేదు.
సామాన్యుని కూతురైతే..
సామాన్య వ్యక్తి కూతురు కాకపోవడం తన అదృష్టమని ఆమె చేసిన వ్యాఖ్య సరియైనది. సామాన్యుడి కూతురై ఉంటే తమ్మినిబమ్మి చేసే మన రాజకీయ, పోలీసు వ్యవస్థ ఆమెను ధైర్యంగా నిలబడనిచ్చేది కాదు. ఈ కేసులో బడా వ్యక్తులయిన నిందితులపై ఆరోపణలను పోలీసులు నీరుగార్పించడం గురించి దేశవ్యాప్తంగా విమర్శలు వెల్ల్లువెత్తుతున్నాయి. ఆమె సామాన్యురాలు అయితే కేసును ఈ పాటికి మాయచేసి మూసేసేవారని కూడా గట్టిగా వినిపిస్తోంది. మా ప్రభుత్వం భిన్నమైనది అని పదేపదే చాటుకునే బిజెపి నేతలు తలదించుకోవలసిన ఘటన ఇది. ‘ఏ పార్టీ అయినా ఆ తానులోని ముక్కే’ అని అనుకోక సామాన్యులకు వేరే గత్యంతరం కనపడడం లేదు.
పోలీసులు ఈ కేసులో భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి)354డి సెక్షన్ కింద మాత్రమే అభియోగాలు దాఖలు చేశారు. దానితో కేవలం ఇది వేధింపు కేసు కాకుండా ‘వెంటాడిన’ కేసుగా మారింది. బెయిలుకు అర్హమైనదైపోయింది. దీనిని బట్టి కుందు ఫిర్యాదు చేసినది అధికార పార్టీ వారిపై అని తెలిసిన వెంటనే కేసును నీరుగార్పించే పని మొదలయిపోయినట్లు అర్థమవుతోంది.

– ఇప్సిత చక్రవర్తి