Home జగిత్యాల ప్రత్యేక నిధి ఏది?

ప్రత్యేక నిధి ఏది?

jgl

గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక నిధి ఏది?

 తెలంగాణ వస్తే బతుకు బాగుపడతదని ఆశించిన వలసజీవులు
 ఆరు వందల మంది మృతి చెందితే ఆదుకునే వారేరి?
 సిఎల్‌పి ఉపనేత, జగిత్యాల ఎంఎల్‌సి జీవన్‌రెడ్డి

మన తెలంగాణ/రాయికల్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గల్ఫ్ కార్మికుల పట్ల వివక్షను కనబరుస్తున్నాయని ప్రత్యేక నిధి ఏర్పాటు ఎండమావిగానే మారిందని సిఎల్‌పి ఉపనేత, జగిత్యాల ఎంఎల్‌ఎ తాటిపర్తి జీవన్‌రెడ్డి విమర్శించారు. రాయికల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయని గల్ఫ్ కార్మికులు ఆశించి పోరాటానికి మద్దతు తెలిపారని గుర్తు చేసారు. తెలంగాణ ఏర్పడిన తర్వాతనే గల్ఫ్‌లోని తెలంగాణ కార్మికులు 600 మంది మృతి చెందారని ఇది నేను చెప్పుతున్న లెక్కలు కాదన్నారు. శంషాబాద్ ఏయిర్ ఫోర్టు పోలీసు రికార్డులు తెలుపుతున్న లెక్కలని చెప్పుతూ మృతి చెందిన కార్మికుల శవాలను తమ స్వగ్రామాలకు తరలించేందుకు అంబులెన్స్‌లను ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారని అసంతృప్తి వ్యక్తం చేసారు. ఎన్నో ఆశలతో గల్ఫ్‌కు వెళ్లి అప్పులు తీరక పని సరిగా లేక ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు, ఆనారోగ్యాలతో మృతి చెందిన కార్మికులకు పాలకులు బాసటగా నిలవకపోవడం శోచనీయమన్నారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి రూ.10లక్షలు, అనారోగ్యంతో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియో అందించాలని డిమాండ్ చేసారు. మృతి చెందిన కార్మికుల పిల్లలకు ఉచిత విద్య, వైద్యం అందించాలన్నారు. దేశవ్యాప్తంగా 10 లక్షల మంది గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్నారని ప్రతి నెల దేశానికి రూ.1వేయ్యికోట్ల విదేశి మారక ద్రవ్యం వస్తుందని తెలిపారు. గల్ఫ్ కార్మికుల వల్ల తెలంగాణ ప్రభుత్వానికి నెలకు రూ. వంద కోట్లు విదేశీ మారక ద్రవ్యం వస్తుందని ఈ లెక్కన ఏడాదికి రూ.12వందల కోట్లు ఉంటుందని తెలిపారు. ఇంతా ఆదాయం వస్తున్నపుడు గల్ఫ్ కార్మికులకు అండగా ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. చనిపోయిన కార్మిక కుటుంబాలకు రూ.30 కోట్లు కెటాయిస్తే తప్పేంటన్నారు. గల్ఫ్ కార్మికులు మృతి చెంది ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై లేదా? అని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ఎన్‌ఆర్‌ఐ పాలసీని అమలు చేయాలని ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి గల్ఫ్ కార్మికులకు అండగా ఉండాలని సూచించారు. గల్ఫ్ కార్మికుల సక్షేమం కోసం సమీపంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాన్ రెసిడెన్సీ కార్పోరేషన్ ఏర్పాటు చేసిందని గుర్తు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎన్‌ఆర్‌సిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు.