Friday, March 29, 2024

మేకిన్ ఇండియా నిర్వాకం

- Advertisement -
- Advertisement -

What Make in India has achieved in seven years

 

అంతర్జాతీయంగా మన బరువు బలాలే కాకుండా దేశ ప్రజల బతుకు బాగును కూడా ప్రతిబింబించే ఎగుమతుల తీరు నానాటికీ దిగజారుతున్నదని పదేపదే రుజువవుతున్నది. ప్రపంచమంతటి మాదిరిగానే భారత దేశమూ కనీవినీ ఎరుగని రీతిలో కొవిడ్ బాధలు ఎదుర్కొంటున్నది. ఏడాదిన్నరగా కరోనా మన దేశాన్నీ పీడిస్తున్నది. గత ఏడాది అనుభవించిన సుదీర్ఘ లాక్‌డౌన్ దేశ ఆర్థిక వ్యవస్థను జన జీవనాన్ని ఎంతగా దెబ్బ తీసిందో తెలిసిందే. అయినప్పటికీ మనకున్న ఉత్పత్తి వనరులను ఉపయోగించుకొని ఆర్థిక వృద్ధిని సాధించే ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగం కరోనా అవాంతరాన్ని అధిగమించి అలరారుతున్నది. గతం సంగతి విడిచిపెడితే ప్రస్తుతం దేశంలో ఎక్కువ భాగంలో ఉత్పత్తి కార్యకలాపాలకు స్వేచ్ఛ లభించింది. కాని మన ఎగుమతులు ఆశించిన స్థాయిలో వృద్ధి చెందడం లే దు. ప్రధాని నరేంద్ర మోడీ అట్టహాసంగా ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా (మేకినిండియా) వంటి కార్యక్రమాలు ఏడేళ్లుగా సాధించినదేమిటి అనే ప్రశ్న తలెత్తుతున్నది.

ఆయన నాయకత్వంలో బిజెపి మొదటిసారి దేశాధిపత్యాన్ని చేపట్టిన 2014 సంవత్సరం సెప్టెంబర్‌లో మేక్ ఇన్ ఇండియా అవతరించింది. ప్రపంచాన్ని ఆకట్టుకునే స్థాయి వస్తు తయారీ కేంద్రంగా దేశాన్ని తీర్చిదిద్దే లక్షంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తయారీ రంగంలో సాలీనా 12 నుంచి 14 శాతం వృద్ధిని సాధించాలని లక్షంగా పెట్టుకున్నారు. 2022 నాటికి స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) లో తయారీ రంగం వాటాను 16 నుంచి 25 శాతానికి పెంచాలని, 10 కోట్ల అదనపు ఉద్యోగాలు సృష్టించాలని దృఢ సంకల్పం చెప్పుకున్నారు. ఈ లక్షాలను సాధించే వైపు పాలకులు చిత్తశుద్ధితో ప్రయత్నించి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది. దేశ ఆర్థిక రంగానికి వచ్చి చేరుతున్న స్థూల అదనపు విలువలో సగ భాగం సేవల రంగం నుంచి వస్తున్నదే. వ్యవసాయ రంగం వాటాను తీసేస్తే తయారీ రంగం భాగం ఇప్పటికీ తక్కువగానే ఉంది. శుద్ధి చేసిన పెట్రోలియం, ఇంజినీరింగ్, వజ్రాలు, నగల రంగాల పుణ్యమా అని ఈ ఏడాది జులైలో ఎగుమతులు 49.9 శాతం పెరిగినప్పటికీ దిగుమతులు కూడా 63 శాతానికి హై జెంప్ చేశాయి.

పర్యవసానంగా విదేశీ వాణిజ్యం లోటు 10.97 బిలియన్ డాలర్లు పెరిగింది. అంటే మన దేశం అంతర్జాతీయ రంగంలో ఆర్థికంగా ఎంత బలహీనంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఉద్యోగాలు, ఉపాధి కల్పనలో ఎంతగా దిగజారి ఉన్నామో స్పష్టపడుతుంది. పొరుగునున్న చైనా ఏనాడో తన జిడిపిలో ఎగుమతుల వాటాను 38.4 శాతానికి తీసుకుపోయింది. ఇందుకు దాని తయారీ రంగం విజృంభణే కారణం. పాలకులు చూపే శ్రద్ధ, నిబద్ధతలే దేశాన్ని ఏ రంగంలోనైనా ముందుకు తీసుకెళతాయి. మన పాలకులు మాత్రం ప్రజల్లో మతపరమైన విభజన విద్వేషాలను పెంచడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నందున ఆర్థిక రంగానికి వెన్నెముక అయిన తయారీ రంగం మూలపడిపోతున్నది. 15-64 ఏళ్ల వయసులోని జనం దేశ జనాభాలో 67.27 శాతంగా ఉన్నారంటే మన దేశంలో యువ శక్తి ఎంతగా ఉందో తెలుస్తున్నది. మరి వీరిని మనం పూర్తిగా ఉపయోగించుకుంటున్నామా? ప్రభుత్వ రంగంలోని లక్షల కోట్ల విలువైన పరిశ్రమలను, బ్యాంకులను, బీమా సంస్థలను ప్రైవేటు రంగానికి అప్పగించి చేతులు దులుపుకోడం మీదున్న శ్రద్ధ దేశంలోని యువశక్తిని సరైన మార్గంలో పెట్టి తయారీ రంగాన్ని బలపర్చడానికి వినియోగించుకునే లక్షం పట్ల పాలకులకు లేదని బోధపడుతున్నది.

2017-18లో దేశ నిరుద్యోగం పెరుగుదల రేటు గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత ఎత్తుకు చేరుకున్నదని ఒక సర్వే స్పష్టం చేసింది. దేశ జనాభాలో 67 శాతంగా ఉన్న పని చేసే వయసులోని ప్రజలను ఉపయోగించుకోలేకపోడమనే దురదృష్టకరమైన స్థితిని అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల సీనియర్ ఫెలో రాధికా కపూర్ ఎండగట్టారు. 2011-12తో పోలిస్తే 2017-18లో దేశ ఆర్థిక కార్యకలాపాల్లో కార్మిక శక్తి పాల్గొన్న రేటు బాగా పడిపోయింది. 2011-12లో ఇది 55.9 శాతంగా ఉండగా 2017-18 నాటికి 48.8 శాతానికి దిగజారిపోయింది. సంపద పెంపు వ్యాపకాల్లో మహిళల పాత్ర మరింత దిగజారిపోతున్నది.

వ్యవసాయ రంగం మీద ఆధారపడి బతుకుతున్న వారిని అక్కడి నుంచి తరలించడానికి కంకణం కట్టుకున్న పాలకులు ఆ రంగాన్ని పాడుబెడుతున్నారే గాని అక్కడి వారికి అనువుగా పారిశ్రామిక, తయారీ రంగాలను ఆశాజనకంగా వృద్ధి చేయలేకపోతున్నారు. ఫలితంగా వ్యవసాయ రంగాన్ని నమ్ముకున్న కోట్లాది మంది ప్రజలు ఆ నమ్మకం వమ్మయిపోయి పొట్ట చేతపట్టుకొని నగరాలకు, పట్టణాలకు తరలిపోతున్నారు. అక్కడ సరైన ఉపాధులు లేక చితికి పోతున్నారు. ఈ పరిస్థితి తొలగాలంటే తయారీ రంగం విశేషంగా మెరుగుపడాలి. ఈ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ అయినా దేశ పాలకులు ఈ వైపుగా ప్రతిజ్ఞ చేసి దృఢ సంకల్పం వహించాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News