Home ఖమ్మం ఏం చెపుతారో.. ఏం మార్చుతారో..

ఏం చెపుతారో.. ఏం మార్చుతారో..

  • సిఎం కెసిఆర్‌తో టిఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధుల భేటీ
  • భేటీ వైపే అందరి చూపు
  • రెవెన్యూ డివిజన్‌పైనే భిన్నాభిప్రాయం
  • మిగిలినదంతా ఓకె

CM-Khammamజిల్లా విభజనకు సంబంధించి ఇదీ కీలక ఘట్టంగా భావిస్తున్నారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల భేటి తర్వాత జిల్లా విభజనకు సంబంధించి మార్పులు ఉండబోవని భావిస్తున్న తరుణంలో ప్రభుత్వం ప్రతిపాదనలపై ప్రజా నిరసనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. చిన్న, చిన్న విషయాలు మినహా భారీ మార్పులు,చేర్పులు ఆశించకపోవడంతో గొంతెమ్మ కోర్కెలు లేకపోవడం గమనర్హం. గార్ల, బయ్యారం, ఇల్లందు నియోజకవర్గ విభజనకే కీలకం కానుంది. రెవెన్యూ డివిజన్ విషయంలో కల్లూరు, వైరాపై టిఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధుల్లో భిన్న స్వరాలు వినిపించే అవకాశం ఉంది. 

ఖమ్మం : జిల్లాల పునర్విభజనకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజా ప్రతినిధులతో సోమవారం భేటీ కానున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలపై వారి అభిప్రాయాలను సేకరించనున్నారు. ఖమ్మం జిల్లా విభజనకు సంబంధించి ప్రభుత్వ ప్రతిపాదన అధిక భాగం ఆమోదయోగ్యమైందే. అయితే ప్రతిపాదనల్లో పేర్కొన్నట్లు గార్ల, బయ్యారం మహాబూబాబాద్‌లో కలపడాన్ని జిల్లా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇల్లందు నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేయడంపైన నిరసన వ్యక్తమవుతుంది. ఈ సమస్యకు సంబంధించి టిఆర్‌ఎస్‌లో ఏకాభిప్రాయమే వ్యక్తం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఏ మేరకు ప్రతిపాదనల్లో మార్పు చేస్తారో కాని ఆ కోరిక ఆమోదయోగ్యమైందన్న భావన వినవస్తుంది. జూలూరుపాడు, ఏన్కూరు, మండలాలను కొత్తగూడెంలో కలపాలనప్న డిమాండ్ పట్ల స్థానిక శాసన సభ్యుడు విముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే కొత్తగూడెంలో కలపాలన్న డిమాండ్‌కు టిఆర్‌ఎస్ శ్రేణుల నుండి సానుకూలత లభించక పోవచ్చు. ఏజెన్సీ జిల్లా ఏర్పాటు ప్రతిపాదన చర్చకు రాకపోవవచ్చు. ఇక కొత్త మండలాలకు సంబంధించిన డిమాండ్లు అన్ని ప్రతిపాదిత కొత్తగూడెం జిల్లాలోనే ఉన్నాయి. కరకగూడెం, ఆళ్లపల్లి, చుంచుపల్లి, లక్ష్మిదేవిపల్లి, పాల్వంచ రూరల్, మండలాలను ఏర్పాటు చేయాలని డిమాండ్లు విన వస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో మండలాల ఏర్పాటుపై ప్రజల నుండి ఎటువంటి వినతలు లేవు. టిఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధుల మధ్య రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై మాత్రం ఖచ్చితంగా భిన్నాభిప్రాయాలు వెలువడే అవకాశం ఉంది. వైరా రెవెన్యూ డివిజన్ ప్రతిపాదనను యధాతధంగా కొనసాగించాలని మదన్‌లాల్ పట్టుబడుతుండగా ఎంపి శ్రీనివాసరెడ్డి కల్లూరును రెవెన్యూ కేంద్రం చేయాలని కోరుతున్నారు. భేటిలో ముఖ్యమంత్రికి ఏం చెపుతారో ప్రజా వినతులకు అనుగుణంగా ప్రతిపాదనలలో ఎంత మార్పులు చేయించగలుగుతారన్నదే సర్వత్రా చర్చనీయాంశమైంది.