Home ఎడిటోరియల్ అన్నాహజారే ఏమి చేస్తారు?

అన్నాహజారే ఏమి చేస్తారు?

edit

అన్నా హజారే మరోసారి ముందుకు వచ్చారు. భారీస్థాయిలో అవినీతిపై యుద్ధం చేస్తారని అందరూ ఆశించిన అన్నా హజారే ఆ తర్వాత మీడియాలో ఎక్కడా కనబడలేదు. పౌరసమాజం ఎన్నో ఆశలు పెట్టుకుంది. కాని ఆయన ఏమయ్యారు, ఆయన పోరాటంలో ఏం సాధించారన్నది ఆ తర్వాత ఎవరు ఆలోచించనేలేదు. సాధారణ ఎన్నికలకు ముందు వినిపించిన అవినీతి వ్యతిరేక యుద్ధనినాదాలు ఇప్పుడు ఎక్కడా వినిపించడం లేదు. చాలా రోజుల తర్వాత మరోసారి అన్నా హజారే గాంధీ
జయంతి రోజున రాజ్‌ఘాట్ వద్ద దర్శనమిచ్చారు. బహుశా మీడియాకు ఫోటోలు ఇవ్వడానికి కావచ్చు. ప్రస్తుత పరిస్థితుల పట్ల తీవ్రనిరాశ వ్యక్తం చేశారు. ముఖ్యంగా గత మూడు సం॥లుగా చోటుచేసుకున్న పరిస్థితుల పట్ల నిస్పృహ ప్రకటించారు. ఆయన కోరిన లోక్ పాల్ జాడ నేడెక్కడా లేదు. లోక్ పాల్ వస్తే చాలు దేశంలో అవినీతి అంతరించిపోతుందని ఇండియా ఎగనిస్ట్ కరప్షన్ ఉద్యమంలో పౌరసమాజం భావించింది. లోక్‌పాల్ మంత్రదండంలా పనిచేస్తుందనుకున్నారు. కాని ఆ మంత్రదండం కూడా ఇప్పుడు ఎక్కడా కనబడ్డం లేదు. ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యతలు మారిపోయాయి. ఇప్పుడు మీడియా ప్రాధాన్యతలు కూడా మారిపోయాయి. అన్నా హజారేకు సాధారణ ఎన్నికల ముందు బ్రహ్మరథం పట్టిన పత్రికలు ఇప్పుడు ఆయన చెప్పిన మాటలను లోపలి పేజిల్లో మామూలుగా వేశాయి. గాంధీవాదిగా అన్నాహజారే ఇప్పుడు మీడియాకు అవసరం ఉన్నట్లు కనిపించడం లేదు. ఆయన మరోసారి అవినీతి వ్యతిరేకయుద్ధం గురించి మాట్లాడారు. కాని ఆయన మరోసారి అవినీతి వ్యతిరేక యుద్ధం ప్రారంభించే పరిస్థితిలో ఉన్నారా? మీడియా ఆయనకు ఇప్పుడు గతంలో మాదిరి ప్రాముఖ్యం ఇస్తుందా? బహుశా అన్నాహజారే చాలా తెలివిగా ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసి ఉండవచ్చు. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టారాజ్యంగా తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజల్లో చోటు చేసుకుంటున్న అసంతృప్తి, ఆగ్రహలను ఆయన అంచనా వేసి ఉండవచ్చు. మరోసారి ప్రజల్లోకి వస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పౌరసమాజాన్ని నిలబెట్టవచ్చన్న అభిప్రాయం ఆయనకు ఉండి ఉండవచ్చు.
అన్నాహజారే 2011లో నడిపింది అవినీతి వ్యతిరేకయుద్ధం. కాని నిజం గా ఆయనే ఆ యుద్ధాన్ని నడిపాడా? ఎన్ని రాజకీయ శక్తులు ఈ అవినీతి వ్యతిరేక యుద్ధాన్ని తమ స్వార్థానికి వాడుకున్నాయి. ఆయన ఉద్యమం నిజంగానే నిజాయితీపరులైన సగటు పౌరులందరినీ ఆకర్షించింది. రామ్ లీలా మైదానం జనసముద్రంతో పోటెత్తింది. మార్పు సాధ్యమేనని చాలా మంది నమ్మారు. నిజమే… మార్పు వచ్చింది. కాని ఎలాంటి మార్పు? అన్నా హజారే ఉద్యమం కేంద్రప్రభుత్వాన్ని మార్చడానికి తప్ప మరి దేనికీ ఉపయోగపడలేదు. అధికారం చేజిక్కించుకోవాలనుకునే పార్టీలు ఆయన ఉద్యమాన్ని తమకు అనుకూలంగా వాడుకునే ప్రయత్నాలు చేయడం వల్లనే ఆ ఉద్యమం ఆ స్థాయికి చేరుకుంది. పార్టీలు కోరుకున్న మార్పు వచ్చింది. కాని సగటు పౌరుడు కోరుకున్న మార్పు రాలేదు. ఆ మార్పు రాలేదన్న వాస్తవం అన్నాహజారేకు కూడా తెలుసు. ఆయన మరోసారి ప్రజలను సమీకరించి పౌరసమాజాన్ని ఇంకా అవినీతికి వ్యతిరేకంగా నిలబెట్టాలనుకుంటే అది ఎలా సాధ్యం?
గాంధీవాదులు సాధారణంగా చేసే పొరబాటిదే. తాము తలచుకున్నప్పుడల్లా ప్రజలను సమీకరించగలమని అనుకుంటారు. మోహన్ దాస్ గాంధీకి అలా సమీకరించే శక్తి సామర్థ్యాలుండేవి. కాని నేడు గాంధీ టోపీ తొడిగే చాలామందికి అలాంటి శక్తిసామర్థ్యాలు లేవు. నిజానికి గాంధీజీ ఎన్నడూ గాంధీ టోపీ తొడగలేదు. అన్నాహజారే కూడా అలాంటి గాంధీవాదుల్లో ఒకరు. తన ఉద్యమంలో తనకు వెంట ఉంటారనుకున్న అనుచరులు మధ్యలో వదిలి వెళ్ళిపోయారన్న అసంతృప్తి ఆయనలో ఉంది. కిరణ్ బేడీ బిజెపిలో వెళ్ళారు. అరవింద్ కేజ్రీవాల్ సొంత పార్టీ పెట్టుకున్నారు. కాని విచిత్రమేమంటే అన్నాహజారే తాను ప్రారంభించిన అవినీతి వ్యతిరేక యుద్ధం మౌలిక స్వభావం గురించి కూడా అవగాహన లేకుండా మిగిలిపోయారు. ఎందుకంటే ఇండియా ఎగనిస్ట్ కరప్షన్ వేదిక చాలామందికి చాలా రకాలుగా ఉపయోగపడింది. రాజకీయ ఉద్దేశ్యాలున్న బాబాలు, కార్పోరేట్ సామ్రాజ్యాలు నిర్మించాలనుకున్న స్వాములు, స్వార్థప్రయోజనాలతో పనిచేసే స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలను పడగొట్టగలమనుకునే మీడియా మహరాజులు ఇలా చాలా మంది ఆ వేదికపై ఒక్కటికాగలిగారు. కార్పోరేట్ సహాయసహకారాలు కూడా పుష్కలంగా లభించాయి. ప్లానింగ్ కోసం, ప్రచారం కోసం పనిచేసే నిపుణులు దొరికారు.అన్నా హజారే ఒకసారి ఈ మొత్తం పరిణామాలను సమీక్షించుకుంటే ఆయనకు వాస్తవాలు బోధపడతాయి. ఆయన ఉద్యమంలో పాలుపంచుకున్న అనేకమంది 2014 తర్వాతి నుంచి రాజకీయాల్లో మెరిసిపోతున్నారు. కొందరి రాజకీయ ఉద్దేశాలకు ఉద్యమం బాగా ఉపయోగపడింది. అంతేకాదు, బాబాలు గొప్ప పారిశ్రామికవేత్తలై పోయారు. 2011లో అన్నాహజారే యుపిఎ సర్కారుపై విమర్శలతో తీవ్రమైన దాడి చేయడానికి ప్రయత్నించారు. ఆ దాడికి అవసరమైన ఆయుధాలు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అందించాయి. అప్పుడు అధికారంలో ఉన్న మన్ మోహన్ సింగ్ ప్రభుత్వం చాలా మృదువుగా వ్యవహరించేది. కాని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం చెప్పే న్యూ ఇండియాలో దానికి అయిష్టమైన ఒక్క మాట చెప్పినా చాలు అధికారయంత్రాంగం నిర్దాక్షిణ్యంగా ఎలా వ్యవహరిస్తున్నదో బహుశా అన్నా హజారే ఇంకా గమనించలేదు. మొన్నటికి మొన్న ప్రకాష్ రాజ్ పై కేసు విషయమే తీసుకున్నా ఈ వాస్తవాలు తెలుస్తాయి. పైగా అంతర్జాతీయంగా కూడా పరిస్థితులు మారిపోయాయి. అరబ్ స్ప్రింగ్ అంతరించింది. అమెరికాలో ట్రంప్ విజయం తర్వాత అంతర్జాతీయంగా పరిస్థితులు తీవ్రగతిన మారుతున్నాయి.
ఏ ఉద్యమానికైనా వెన్నెముక మధ్యతరగతి. కాని ఇప్పుడున్న మధ్యతరగతి భద్రజీవితాన్ని కోరుకుంటోంది. అరబ్ స్ప్రింగ్ సమయంలో తలెత్తిన ప్రజాస్వామిక శక్తులు నేడు కనబడడం లేదు. అన్నాహజరే ఉద్యమ కాలంలో అంతర్జాతీయంగా కూడా అరబ్ స్ప్రింగ్ ప్రభావం ఉందన్నది గమనించాలి. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ వాతావరణంలో అన్నాహజారే మరో ఉద్యమం చేపడితే చేయూతలభిస్తుందా? పైగా, చాలా వ్యాపారసంస్థలు కూడా నోట్లరద్దు దెబ్బకు తేరుకోలేకున్నాయి. అన్నాహజారే అవినీతి వ్యతిరేక యుద్ధం ప్రారంభించినప్పుడు మీడియా కూడా ఆయనకు పూర్తి మద్దతు ఇచ్చింది. అప్పట్లో మన్మోహన్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి మీడియాకు సంకోచం కాని భయం కానీ లేవు. కాని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. నేడు ప్రభుత్వాన్న విమర్శించి లాభాలను కోల్పోవడానికి గాని, వేధింపు చర్యలను భరించడానికి కాని మీడియా సిద్ధం గా లేదు. అన్నింటికి మించి ఇప్పుడు మధ్యతరగతి పాకిస్తాన్‌ను విమర్శించడం, చైనాను తెగనాడ్డం వంటివి వీరావేశంతో చేయడంలోనే బిజిగా ఉన్నది. యాంత్రిక జీవనం సామాన్యమైపోయింది. నెమ్మదిగా మేధోపరమైన పతనం చోటు చేసుకుంటోంది. ఎవరు దేశభక్తులో, ఎవరు దేశద్రోహులో చెప్పేవారు చెబుతున్నారు. నమ్మేవాళ్ళు నమ్మేస్తున్నారు. ప్రధాని స్వయంగా తనను నమ్మమన్నారు, 50 రోజుల సమయమివ్వండి అన్నారు. యాభై రోజులు ఎప్పుడో గడిచిపోయాయి. కాని సాధించింది ఏమిటో ఆయన చెప్పలేదు. అడిగే తీరిక కూడా మనకు లేదు. మోసపోయామన్నది కూడా గుర్తించలేని ఒక స్తబ్ధత చోటు చేసుకుంది.