Saturday, April 20, 2024

ఉస్మానియాకు పునరుజ్జీవం ఎప్పుడో!

- Advertisement -
- Advertisement -

when Osmania hospital Renaissance ever

100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రి ఈ రోజు వివాదాలకు కేంద్ర బిందువయ్యింది. ఎంతో మంది గొప్ప గొప్ప వైద్యులను ప్రపంచానికి అందించిన ఈ వైద్యశాల నేడు విమర్శల పాలవ్వడం బాధాకరమైన విషయం. ఇలాంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ ఆసుపత్రి నేడు శిథిలమై పెచ్చులూడి పడుతూ పేషెంట్లకూ, ఆసుపత్రిలో పని చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి కూడా ప్రమాదకరంగా పరిణమించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆసుపత్రిని సందర్శించి శిథిలమైన ఈ ఆసుపత్రిని కూల్చివేసి ఆ స్థానంలో కొత్త ఆసుపత్రి భవనాలు నిర్మిస్తామని ప్రకటించిన సందర్భంగా వారసత్వ కట్టడమైన ఉస్మానియా ఆసుపత్రిని కూల్చవద్దని ప్రతిపక్షాలు, ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్, వారసత్వ కట్టడాల పరిరక్షణ కమిటీలు ఆందోళనలు చేపట్టడం మనందరికీ విదితమే.

అసలు వారసత్వ కట్టడాలు అంటే ఏమిటి? మామూలుగా మనకు ఇండ్లు, ఆస్తులు, ఇతర వస్తువులు వారసత్వంగా వస్తుంటాయి. అదే విధంగా సమాజ వారసత్వం, జాతి వారసత్వం కూడా వుంటాయి. అంటే పురాతన కాలంలో అప్పటి ప్రజల జీవన విధానం ఎలా వుండేదో, ఎలాంటి సంస్కృతి, సాంప్రదాయాలు పాటించేవారో ముందు తరాలకు తెలియ చెప్పడానికి ఆనాటి సంస్కృతిని ప్రతిబింబించే పురాతన కాలం నాటి గొప్ప నిర్మాణాలనే వారసత్వ కట్టడాలు అంటారు. పురాతన కాల సంస్కృతిని తెలుసుకోవడం ద్వారా మనిషి తన భవిష్యత్తును ఇంకా సమర్థవంతంగా ఏర్పాటు చేసుకోగలుగుతాడు అని, అందుకే వాటిని కాపాడి భవిష్యత్ తరాలకు అందించాలి అనేది ఉద్దేశం.

అయితే పురాతన కట్టడాలు అన్నీ కూడా వారసత్వ కట్టడాలు కావు. హైదరాబాద్‌లో దాదాపుగా 160 భవనాల వరకు వారసత్వ కట్టడాలుగా గుర్తించబడినాయి. ఇవన్నీ కూడా హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ అజమాయిషీలో ఉన్నాయి. హైకోర్టు, చౌమల్ల పాలస్, సిటీ కాలేజీ, సికింద్రాబాద్, సుల్తాన్ బజార్‌లోని క్ల్లాక్ టవర్స్, ఎఱుమ్ మంజిల్, ఫలక్‌నుమా పాలస్, జూబిలీ హాల్, కింగ్ కోఠి హాస్పిటల్, నిజామ్ క్లబ్, విక్టోరియా మెమోరియల్ స్కూల్, దిల్ కుషా గెస్ట్ హౌస్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, బషీర్‌బాగ్‌లోని పాత గాంధీ మెడికల్ కాలేజీతో పాటు మరెన్నో ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన నిర్మాణాలు కూడా వారసత్వ కట్టడాల కింద ఉన్నాయి. దాదాపుగా 70 శాతం నిర్మాణాలు ప్రైవేట్ వ్యక్తులకు చెందినవే.

ఇప్పుడు సమస్య అంతా ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేసి ఆ స్థానంలో కొత్త ఆసుపత్రి నిర్మాణం గురించి. నూతన ఆసుపత్రిని నిర్మించాలంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు లోబడి, పేషెంట్ ట్రీట్‌మెంట్ సరిపోయే విధంగా, పూర్తి స్థాయిలో అవసరాలకు అనుగుణంగా బహుళ అంతస్థుల భవనాలు నిర్మించాల్సి వుంటుంది. పాత భవనం విడిచిపెట్టి మిగిలిన ప్రదేశంలో కొత్త భవనం నిర్మిస్తే అది అవసరాలకు సరిపోదు.. మిగిలిన స్థలంలోనే బహుళ అంతస్థుల భవనాలు నిర్మిద్దామంటే వారసత్వ కట్టడాలు ఉన్నచోట 4 అంతస్థుల కన్నా ఎక్కువగా కట్టవద్దని నిబంధనలు…. పోనీ సిటీకి దూరంగా విశాలమైన స్థలంలో నిర్మిద్దామంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఒప్పుకోవు.. వెరసి ఇప్పుడొక పెద్ద చిక్కుముడి సమస్యగా మారింది.

ఇప్పుడు ఈ చిక్కుముడిని విప్పాలంటే మనం ఒక ప్రశ్నకు సరియైన సమాధానం వెతకాల్సి వుంది. ఉస్మానియా ఆసుపత్రి వారసత్వ కట్టడం కాబట్టి దాన్ని కూల్చకుండా మిగిలిన కొద్ది స్థలంలోనే, నిబంధనలకు లోబడి అరకొర వసతులతో కొత్త భవనం ఏర్పాటు చేసుకోవడం, ప్రత్యామ్నాయాలు దొరకక సమయం వృథా చేస్తూ పేటెంట్స్, వైద్యులు, వైద్య సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టడమా… లేక ఇప్పుడున్న శిథిలమైన భవనాన్ని కూల్చివేసి దాని స్థానంలో అన్ని అవసరాలకు సరిపోయే విధంగా అధునాతనమైన భవనాలు నిర్మించుకోవడమా…. ఏది విజ్ఞతతో కూడిన నిర్ణయం. శిథిలమైన పాత భవనమా… అదే స్థలంలో అన్ని హంగులతో కూడిన నూతన భవనమా…

ఒక విషయాన్ని మనం నిర్మొహమాటంగా చర్చిద్దాం. మన తాత, ముత్తాతలు ఎంతో మక్కువతో కష్టపడి ఆ పాత కాలంలో కట్టుకున్న ఇండ్లను ఎంతమంది అలాగే వుంచి వాటిలో నివాసముంటున్నారో ఆలోచించండి. వర్తమాన భవిష్యత్ కాల అవసరాలకు అనుగుణంగా వాటిని కూల్చి వేసి కొత్త నిర్మాణాలు చేసుకోలేదా.. అంతమాత్రాన ఇప్పుడున్న వాళ్ళకి వాళ్ల పూర్వీకుల మీద ప్రేమ, గౌరవం లేనట్టా.. వారి సాంప్రదాయాలను అగౌరవ పరచినట్టా.. మనిషి తన అవసరాల కోసం తయారు చేసుకున్న వస్తువులను కానీ, ఏర్పరచుకున్న నివాసాలు కానీ ఎప్పటికప్పుడు కాలానుగుణంగా వాటిలో మార్పులు చేర్పులు చేసుకుంటున్నాడు.

అంతెందుకు నర్సయ్య మనవడు నరేందర్‌గా, దేవయ్య మనవడు దేవేందర్‌గా, రామయ్య మనవడు రమేష్‌గా మారలేదా… పూర్వీకుల మీద ప్రేమతో వారి పేర్లనే వాడట్లేదు కదా. చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్లే మానవుడు ఈ రోజు మోటార్ సైకిల్ మీద, కార్లలో తిరుగుతున్నాడు.. పూరిగుడిసెలో నివసించిన మానవుడు అదే స్థానంలో బిల్డింగులు కట్టుకొని నివసిస్తున్నాడు.. ధోవతి కట్టుకునే మానవుడు ఈ రోజున స్టయిల్‌గా ప్యాంటు, చొక్కా వేసుకుంటున్నాడు. ఇలా అన్ని విషయాల్లో కాలంతో పాటు మార్పులు చేసుకుంటున్న మానవుడు తన ఆరోగ్య అవసరాల కొరకు ఏర్పాటు చేసుకున్న ఆసుపత్రి ఇప్పుడు శిథిలావస్థకు చేరుకొని పేషెంట్ల ప్రాణాలకే ప్రమాదకారిగా మారిన వేళ దాన్ని తీసి వేసి కొత్త భవనం కట్టుకుంటే తప్పేంటి? ఏ ప్రభుత్వమైనా ప్రజల బాగు కొరకు, ప్రజా శ్రేయస్సు కోరి వారి అవసరాలను తీరుస్తూ వారి అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తుంది.. పని చేయాలి కూడా.. దేశానికే తలమానికమై ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టిన ఉస్మానియా ఆసుపత్రి ఈ రోజున వయో భారంతో చివరి దశకు చేరుకుంది. మొన్నటి వర్షాలకు ఆసుపత్రి ప్రాంగణమంతా జలమయమయ్యింది కూడా.

ఎప్పుడు ఏ కప్పు కూలుతుందో ఎప్పుడు ఎవరి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో అంటూ దినమొక గండంగా పని చేయాల్సి వస్తుంది వైద్యులకు, వైద్య సిబ్బందికి. ఇప్పటికే చాలా ఆలస్యమయింది కాబట్టి వీలైనంత తొందరగా ప్రభుత్వం దీని మీద నిర్ణయం తీసుకొని సకల హంగులతో కూడిన ఒక అధునాతన ఆసుపత్రిని నిర్మిస్తే పెరుగుతున్న ప్రజల ఆరోగ్య అవసరాలు తీరడంతో పాటు ఎంతో కాలంగా రగులుతున్న సమస్య పరిష్కారం అవుతుంది.

డా. వి. రవి శంకర్ ప్రజాపతి, (ఇఎన్‌టి స్పెషలిస్టు, కోఠి)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News