Home ఎడిటోరియల్ బాబాల బెడద తీరేదెన్నడు?

బాబాల బెడద తీరేదెన్నడు?

Babas

ఈ మధ్య అఖిల భారత అఖారీ పరిషత్ అనే హిందూ పీఠం 14మంది బాబాలను నకిలీలుగా ప్రకటించింది. వారిపట్ల అప్ర మత్తంగా ఉండమని దేశ ప్రజలకు ఓ సందేశాన్ని ఇచ్చింది. బాబాల సంస్కృతి దేశం లో కొనసాగాలంటే దొరికినవారే దొంగబాబాలు మిగతావాళ్ళు నిజమైన బాబాలేనని ప్రచారం చేసుకోక తప్పదు. అయితే వేలాదిమంది బాధిత భక్తుల్లో కొందరు కళ్లు తెరిచి సాహసించి బాబాల బండారం బయటపెట్టడం ఒక మంచి పరిణామం.
డేరాబాబా కథ ముగిసిందనుకుంటుండగా రాజస్థాన్‌లో ఫలహారీ బాబా వృత్తాంతం తెరపైకి వచ్చింది. శిష్యుడి కూతురైన యువతిపై లైంగిక అత్యాచారానికి ఒడికట్టినాడనే ఆరోపణతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ బాబాలిద్దరికీ రాజకీయ నాయకుల అండ దండిగా ఉన్నట్లు సచిత్రంగా వార్తలు వచ్చాయి. పరిషత్ విడుదల చేసిన నకిలీ బాబాల్లో ఇప్పటికి నలుగురు జైలు జీవితం గడుపుతున్నారు. గుర్మీత్, ఆసారాంబాపు, ఇచ్ఛాధార్ భీమా నంద్, రాంపాల్ కటకటాల వెనుక ఉండగా ఆసారాం బాపు కొడుకు నారాయణ సాయి తండ్రి దుశ్చర్యల్లో పాలుపంచుకున్నా బెయిలుపై బయటికొచ్చాడు.
2002లో ఓ బాధిత మహిళ డేరాబాబాపై ప్రభుత్వాలకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై సిబిఐ విచారణ చేపట్టింది.15ఏళ్ల తర్వాత ఆయనకు 28.8.2017 నాడు సిబిఐ కోర్టు 20ఏళ్ల జైలు శిక్ష విధిం చింది. 2002 ముందు నుండే నేరాలకు పాల్పడుతున్న గుర్మీత్ సింగ్ 2017 దాకా తన ఇచ్ఛానుసారంగా చట్టానికి, రాజ్యాంగానికి అతీతం గా దేశం నడిబొడ్డున ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం జాతి యావత్తుకు సిగ్గుచేటు విషయమే.
ఆసారం బాపుకు లైంగిక దాడి, హత్యకేసులో శిక్షపడి 2013 నుండి ఆయన జైలుజీవితం గడుపుతున్నాడు. ఈయనపై కేసుకు సంబంధించిన ముగ్గురు సాక్షులు ఊహించని రీతిలో దుర్మరణం పొందారు. ఢిల్లీలోని ఒక హోటల్‌లో సెక్యూరిటీగార్డ్‌గా పనిచేసిన శివ మూరత్ ద్వివేది ఇచ్ఛాధార్ భీమానంద్‌గా అవతారమెత్తి కోట్లకు పడగెత్తాడు. బాబా వేషంలో ఆయన సాగించినది వ్యభిచార వ్యాపారం. ఈయన దేశంలోని ప్రధాన ఏడు నగరాల్లో ఈ పడుపుదందాను యదేచ్ఛగా సాగించాడు. ఏడు నగరాల్లో హైదరాబాద్ కూడా ఉంది. 10వేల నుండి 50వేలదాకా విటుల నుంచి వసూలు చేసి అందులోంచి 40% కమిషన్ వసూలు చేయడం ఆయన వృత్తి. బాధితుల ద్వారా ఈ వ్యవహారం బయటపడడంతో 2010నుండి జైలుశిక్ష అనుభిస్తున్నాడు.
తాను 15వ శతాబ్దంలోని సంత్ కబీర్ దాస్ పునర్జన్మగా చెప్పుకునే రాంపాల్ ఆశ్రమంలో 2014 లో 5 మృతదేహాలు లభించాయి. కోర్టు సమన్లను 42సార్లు బేఖాతరు చేసిన ఘనత ఈయనది. అఖారా పరిషత్ నిషిద్ధ బాబాలచిట్టాలో ఉన్న మిగతా బాబాలు, అమ్మలు కూడా రకరకాల అభియోగాలతో వార్తల్లోకి ఎక్కినవారే. 2007లో జరిగిన అజ్మీర్ పేలుడులో అరెస్టయిన స్వామి అసీమా నంద్ సందేహ ప్రయోజనం సందులోంచి శిక్షను తప్పించుకున్నాడు. స్వామి ఓంజీపై ఆయన తమ్ముడే దొంగతనం కేసుపెట్టాడు. తన ఇంట్లో జరిగిన దొంగతనానికి సొంత అన్నే బాధ్యుడని ఆయన అభియోగం. నకిలీ బాబాగా గుర్తింపబడిన నిర్మల్ బాబా ‘నిర్మల్ బాబా మూడో కన్ను’ పేరిట పలు టీవీ ఛానళ్లలో కనబడుతుంటాడు. ఝార్ఖండ్‌లోని ఆయన దర్బారు ప్రవేశం రుసుము రూ.2000/ మాత్రమే. రాధేమా బొంబాయిలో వేస్తున్న వింతవేషాలు మహిళా జగత్తుకే మచ్చతెచ్చేలా ఉన్నాయి.
సచ్చిదానందగిరి ఢిల్లీలో బోలెడు స్థిరాస్థిని పోగుచేసుకున్నాడు. అలా ఆయన బిల్డర్‌బాబాగా గణతి కెక్కాడు. అయితే ఇదే చిట్టాలో ఉన్న ఆచార్య ఖుష్‌ముని అఖారా పరిషత్ లోనే నేరచరితులు ఎందరో ఉన్నారని ఎదురు ఆరోపణలు చేయడం ఆసక్తికరమైన విషయం. ఇలా ఒకరి బాగోతం ఒకరు చెప్పుకుంటూ పోతే అందరి బండారం బయటపడే అవకాశం ఉంది. బెంగుళూరుకు చెందిన నిత్యానంద ఎప్పుడూ వార్తల్లో కొస్తుం టాడు. ఆయన అనుచరుల్లో ఒకరైన ఆరతి తనను అయిదేళ్లుగా లైంగిక హింసలపాలు చేస్తున్నాడని, బయట పెడితే చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఓ తమిళనటితో నిత్యానంద రాసలీల వీడియోలో చిత్రీకరించి బయటపెట్టింది కూడా ఆరతినే. ఈ దెబ్బతో నిత్యానంద అసలు కథ బహిరంగమైంది.
ఇప్పటికీ గురువులుగా, స్వాములుగా జనం నుండి హారతులు అందుకుంటున్నవారు కూడా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అవి కోర్టుల్లో నిలబడకపోవడంతో మళ్లీ పాత అవతారాన్ని కొనసాగిస్తున్నారు. యోగా ద్వారా ఆరునెలల్లో క్యాన్సర్‌ను, ఎయిడ్స్‌ను నయంచేసి చూపిస్తానన్న రాందేవ్ బాబా ఫక్తువ్యాపారంలోకి దిగాడు. విదేశీ వస్తువులని చీదరించుకున్న వాటినే తాను తయారు చేసి అమ్ముతున్నాడు. ఇప్పుడు పతంజలి నుండి ముఖంపై ముడతలు మాయం అవుతాయనే రింకిల్ ఫ్రీ క్రీమ్ కూడా మార్కెట్లోకి వచ్చింది. మరో బాబా నేతృత్వంలో ‘నదులను రక్షిద్దాం’ అనే ప్రహసనం దేశంలో కొనసాగుతోంది. ఓమొబైల్ నెంబర్‌కు మిస్డ్‌కాల్ ఇస్తే ఆయన ఉద్యమానికి మద్దతు తెలిపినట్లేనట. ఇల్లు కదలకుండా, నదిలోంచి చిటికెడు చెత్త తీయకుండా స్వచ్ఛభారత్ సేవకులై పోవచ్చు.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ అధినేత శ్రీశ్రీ రవిశంకర్ మార్చి 2016లో ఢిల్లీ లోని యమునానది ఒడ్డున ఓ ఉత్సవం నిర్వహించాడు. దానివల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లిందని, దానికి జరిమానాగా రూ.5 కోట్లు పెనాల్టీ చెల్లించాలని కేంద్రప్రభుత్వ సంస్థ జాతీయ హరిత ట్రిబ్యునల్ రవిశంకర్‌కు నోటీసు పంపింది. పెనాల్టీ చెల్లించే ప్రసక్తే లేదని బాహాటంగా ప్రకటించిన ఆయనకు కేంద్రం ఆ ఉత్సవ నిర్వహణ కోసం రూ.2.50కోట్లు మంజూరు చేసింది. బడాబడా స్వాములు కాకుండా చిన్న చితక స్వాములు, బాబాలు కూడా తమ పరిధి మేరకు ప్రజలను మోసగిస్తూ ఉన్నారు. గుర్రం బాబా, బొట్టుబాబా, నిమ్మ బాబా, కొరడా బాబాలుగా అవతారమెత్తి రోగాలు నయం చేస్తామని నమ్మించి ప్రజల్ని దోచుకుం టున్నారు. పూజల ద్వారా మంత్రిపదవి దక్కేలా చేస్తానని నమ్మించి ఓ స్వామి, తెలంగాణ ఎమ్మెల్యేనుండి రూ.57లక్షలు దండుకున్నాడని వార్తల్లో వచ్చింది. బాబాలను, స్వాములను గౌరవించి, వారి నిర్దేశిత మార్గంలో జీవనం సాగించడం భారతీయ సంస్కృతిలో భాగంగా నిలిచింది. క్రమంగా ఆ వేషధారణవల్ల లబ్దిపొందవచ్చనే ఆలోచనతో అసలుకే మోసం వచ్చింది. విద్య, విజ్ఞానం, పరిశోధన పెరుగుతున్నాయి. రాజకీయ లబ్దికోసం కాకుండా ప్రజానాయకులు, పాలకులు నిజదృష్టితో వ్యవహరిస్తే ఈ పీడ విరగడవుతుంది. పాలకులు కళ్లుతెరిచే దాకా ప్రజలే సాహసించి న్యాయస్థానాలను శరణుగోరక తప్పదు.