Friday, April 26, 2024

అందరికీ టీకా ఎప్పటికి?

- Advertisement -
- Advertisement -

When will everyone be vaccinated?

 

కొవిడ్ టీకాలు వేయడంలో దేశాల మధ్య తేడాను గమనిస్తుంటే పొడుగు పొట్టి చేతుల తారతమ్యం గుర్తొస్తుంది. ఈ నెల 12-13 తేదీల నాటికి ఇజ్రాయెల్‌లో 59.4 శాతం, బహ్రేన్‌లో 50.8 %, చిలీలో 47%, బ్రిటన్‌లో 43.9 %, అమెరికాలో 43% ప్రజలు రెండు విడతల టీకాలు వేసుకోగా, భారత్‌లో కేవలం 3.4 % జనాభాకు మాత్రమే పూర్తి (రెండు డోసులు) వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. వ్యాక్సినేషన్‌లో జనాభాలో 11.07 శాతంతో బ్రెజిల్, 9.7 శాతంతో రష్యా మన కంటే పైనున్నాయి. పొరుగునున్న బంగ్లాదేశ్‌లో 2.57 శాతం, పాకిస్థాన్‌లో 1.29 శాతం, శ్రీలంకలో 2.02 శాతం మందికి పూర్తిగా టీకాలు పడ్డాయి. పొరుగు చిన్న దేశాలతో పోల్చుకున్నప్పుడు మనం పిసరంత పైనున్నామన్నది గాని కేవలం 0.81 శాతం జనాభా మాత్రమే టీకాలు పొందిన దక్షిణాఫ్రికా కంటే ఎంతో మెరుగ్గా ఉన్నామన్నది గాని మనకు చెప్పుకోదగిన సంతృప్తి నిచ్చే అంశాలు కావు. ఇప్పటికి జనాభాలో 3.4 శాతం వద్దనే ఉన్న మన వ్యాక్సినేషన్ కార్యక్రమం 130 కోట్ల పై బడిన జనాభా గల దేశంలో అత్యధిక శాతం మందికి పూర్తిగా అందడానికి ఎంత కాలం పడుతుంది, అది ఎలా సాధ్యమవుతుంది అనేది జటిలమైన ప్రశ్న.

వ్యాక్సినేషన్ ఇప్పటి తాబేలు నడకలోనే కొనసాగితే ఈ సంవత్సరాంతానికి అందరికీ టీకాలు అనేది ఎండమావిగానే రుజువవుతుంది. రెండు రోజుల క్రితానికి అమెరికాలో (జనాభా 33 కోట్లు) 30.9 కోట్ల డోసులు ఇవ్వగా, 14.4 కోట్ల మందికి అంటే 43.8 శాతం మందికి రెండు డోసులూ అందాయి.భారత్‌లో (జనాభా 138 కోట్ల పైచిలుకు) మాత్రం టీకాలు వేయించుకున్న వారు 24.9 కోట్ల మంది కాగా, రెండు డోసులు పొందిన వారు 4.69 కోట్ల మందే. 143 కోట్లకు మించిన జన సంఖ్య గల చైనాలో మొత్తం 89.3 కోట్ల టీకా డోసులు పడ్డాయి. మన దేశంలో ఏ వయసు వారికి టీకా వేసే బాధ్యతను ఎవరు తీసుకోవాలి, ఏరోజుకారోజు పని చేసుకుంటేగాని పొట్ట నిండని సాధారణ ప్రజానీకానికి ఉచితంగా టీకా వేయాలా లేక అమ్మాలా అనే మీమాంసే ఇంత వరకు సాగింది. దేశానికి పూర్తిగా అవసరమయ్యే టీకా మందు ఉత్పత్తిపై కేంద్ర పాలకులు సకాలంలో దృష్టి పెట్టకపోడం వల్ల, ఆక్సిజన్ తదితర ప్రాణావసరాల అందుబాటుపై శ్రద్ధ వహించకపోడం వల్ల చెప్పనలవికాని నష్టం జరిగిపోయింది, జరుగుతున్నది.

ఈ నెల 14 సోమవారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా 17 కోట్ల 67 లక్షల 93 వేల 171 మందికి కరోనా సోకగా, 38 లక్షల 20 వేల 983 మంది చనిపోయారు. తొలి విడత కరోనా భారత్‌ను భారీ స్థాయిలో నష్టపరచకపోయినా రెండో కెరటం మాత్రం ఊహించనంత ఉత్పాతాన్ని సృష్టిస్తోంది. తెరిపి ఇస్తున్న జాడలు ఇప్పుడిప్పుడే అంతంత మాత్రంగా కనిపిస్తున్నప్పటికీ పూర్తిగా కోలుకోడానికి మరి కొంత కాలం పడుతుంది. చిన్నారులను లక్షంగా చేసుకునే మూడో కెరటం కరోనా గురించి వస్తున్న వార్తలు భయపెడుతున్నాయి. జూన్ 13 ఆదివారం నాడు దేశంలో 67 వేల 699 కొత్త కేసులు, 3863 కొత్త మరణాలు నమోదయ్యాయి. మార్చి 1 నుంచి విజృంభించిన రెండవ అల కరోనాకి మన దేశంలో ఇప్పటి వరకు 2 లక్షల 5 వేల మంది మరణించారు. మొత్తం రెండు దశల కరోనా వల్ల 3 లక్షల 63 వేల 29 మంది మృతి చెందారు. 2 లక్షల 24 వేల 773 మరణాలతో సెకండ్ వేవ్ మృతుల సంఖ్యలో బ్రెజిల్ మన కంటే స్వల్పంగా పై స్థాయిలో ఉంది.

అధికారిక లెక్కల ప్రకారం అమెరికాలో కరోనా రెండు దశల్లోనూ ఇంత వరకు 6 లక్షల మంది మరణించారు. అయితే మొదటి వేవ్ ఉధృతికి తీవ్ర ప్రాణ నష్టాన్ని ఎదుర్కొన్న అమెరికా రెండో వేవ్ నాటికి అన్ని విధాల సమాయత్తమై దానిని చాలా వరకు పరిమితం చేయగలిగింది. తక్కువ మంది గుమిగూడే చోట మాస్కులు అవసరం లేకుండా తిరగగలిగే ధైర్యాన్ని తన ప్రజలకు కలిగించగలిగింది. దేశంలో రెండో వేవ్ మరణాల అధికారిక సంఖ్యపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో దేశ రాజధాని ఢిల్లీ సహా యుపి తదితర అనేక రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ మృతుల సంఖ్య అపారంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. శ్మశానాలు ఖాళీ లేని పరిస్థితి చాలా చోట్ల కనిపించింది. జనాభాలో అత్యధిక శాతం మందికి రెండు డోసుల టీకా పంపిణీ పూర్తి చేయడం ఒక్కటే దేశంలో కొవిడ్‌ను అంతమొందించే మార్గమని అంతటా భావిస్తున్నారు. అన్ని దేశాలు ఈ లక్ష సాధనకే పరుగులు పెడుతున్నాయి. ఈ పరుగు పందెంలో ధనిక దేశాలు చాలా ముందు ఉండడం, పేద దేశాలు బాగా వెనుకబడిపోడం స్పష్టంగా కనిపిస్తున్నది. రెండవ అత్యధిక జనాభా గల దేశం మనది.

అలాగే ప్రజల్లో అత్యధికులు రవాణా సదుపాయాలు సరిగ్గా ఉండని మారుమూల గ్రామీణులు, నిరుపేదలు, నిరక్షరాస్యులు. ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని మరింత చిత్తశుద్ధితో వేగంగా వ్యాపార దృష్టి లేకుండా పూర్తి చేయవలసి ఉంది. వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థం, ముడి సరకు లభ్యతలో మనకున్న పరిమితులు కూడా తక్కువ కాదు. వీటన్నింటినీ అధిగమించి త్వరగా లక్షాన్ని చేరుకోవలసి ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News