*చెత్త నిషేధిత ప్రాంతంలోనే
పారేస్తున్న వైనం
*ప్లాస్టిక్ వ్యర్థాలతో మూగ జీవాలు బలి
*పట్టించుకోని సంబంధిత అధికారులు
మనతెలంగాణ/షాద్‌నగర్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలితిన్ కవర్లను నిషేధించినప్పటికీ, వ్యాపారస్తులు మాత్రం వారి లాభార్జన నిమిత్తం యథేచ్ఛగా పాలితిన్ కవర్లను విక్రయించి వారి వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కిరాణ దుకాణాలకు సరుకుల నిమిత్తం వెళ్లగా కిరాణ షాపులలో వినియోగదారులుకు పాలితిన్ కవర్లలోనే సరుకులను ఇవ్వడంతో ప్రజలు ఇంటి ఆవరణలోనే వాటిని పారవెయ్యడంతో మూగజీవాలు సైతం వాటిని తింటూ అనారోగ్యాల పాలవుతున్నా.. సంబంధిత అధికారులు మాత్రం నామమాత్రంగా పట్టణంలో పలు రోడ్ల పై బోర్డులను పెట్టి మాకెందుకులే అన్నా విధంగా వదిలేస్తున్నారు.
ఇంటికి ఒక్కటే చెత్త బుట్ట
మున్సిపాలిటిలో వున్నా 23 వార్డులలో గత సంవత్సరం ఇంటింటికీ తిరిగి మున్సిపాలిటీ సిబ్బంది తడి, పొడి చెత్తల కోసమని రెండు బుట్టలను ఇంటింటికి పంపిణీ చేశారు. ఇందులో భాగంగా కేవలం స్థానిక ఆధార్ కార్డులు ఉన్నవారికి మాత్రమే ఈ బుట్టలను పంపిణీ చెయ్యడంతో ఆ ఇళ్లలో వుండే కిరాయిదారు సంగతేంటని కిరాయి దారులు ముక్కున వేలేసుకుంటున్నారు.
అంతంత మాత్రంగానే పంపిణీ…
మున్సిపాలిటీ శాఖలో ప్రతి ఇంటికి చెత్త బుట్టలను పంపిణీ చెయ్యాలని ఆదేశాలున్నప్పటికీ షాద్‌నగర్ పట్టణ మున్సిపాలిటి అధికారులు మాత్రం దీనికి విరుద్దంగా వ్యవహరిస్తూ కాలనీలలోని బడా నాయకుల ఇంటి ముందు, అంగన్ వాడీ కేంద్రాల వద్ద ఈ బుట్టలను పంపిణీ చెయ్యడంతో తెలిసిన వారు తప్పా తెలియని వారికి బుట్టలు అసలే దొరకవు. కానీ తడిచెత్త, పొడి చెత్తను వేరు చేసి ఇచ్చేదెలా అని కాలనీ వాసులు తలపట్టుకుంటున్నారు. ఈ బుట్టల పంపిణీ విషయంలో ఎంతవరకు పంచారో అన్న విషయం ఇప్పటికీ అధికారులకే లెక్క తెలియదని కొందరు కాలనీల ప్రజలు గుసగుసలాడుతున్నారు.
ఇదిలా వుండగా..
షాద్‌నగర్ మున్సిపాలిటీ స్వచ్ఛ మున్సిపాలిటీ.. చెత్త రహిత మున్సిపాలిటీ అంటూ మున్సిపాలిటీ అదికారులు చెపుతున్నప్పటికీ మున్సిపాలిటీలో మాత్రం ఎక్కడి చెత్త అక్కడే అన్న విధంగా ఏ కాలనీలో చూసినా చెత్తకుప్పలు మాత్రం దర్శనమిస్తున్నాయి.. దీంతో పట్టణంలోని పలు కాలనీలలో దోమలు, ఈగలలే కాకుండా పందులు స్వైర విహారం చేయడంతో ప్రజలు పలు రోగాల బారిన పడుతున్నారు. ఇదేకాకుండా మూగ జీవాలు సైతం ఈ చెత్తకుప్ప దగ్గర చేరుకొని వాటిని తినడంతో రోగాల బారిన పడి చనిపోతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నామమాత్రంగా బోర్డులు…
మున్సిపాలిటీలోని చెత్తను సంబంధిత అధికారులు, సిబ్బంది తొలగించాల్సి వున్నప్పటికీ దానిని తొలగించడంలో నిర్లక్షం వహిస్తూ నామమాత్రంగా రోడ్లపై హెచ్చరిక బోర్డులను అమర్చి బహిరంగంగా ఎవరైనా చెత్త వేస్తే రూ. 500 రూపాయల జరిమానా విధించబడునని చెప్పడం గమనార్హం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చెత్తపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.