Home లైఫ్ స్టైల్ మారని అభివృద్ధి నమూనా

మారని అభివృద్ధి నమూనా

మన పారిశ్రామిక విధానం ఎవరికి ప్రయోజనం?

Industriala

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ నాలుగు నెలలలోనే ప్రభుత్వం పారిశ్రామిక విధానాన్ని ప్రకటించి, అదే సంవత్సరం నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఇందుకు సంబంధించిన ఒక బిల్లును కూడా ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇండస్ట్రియల్ పాలసీ ఫ్రేంవర్క్ ఫర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ -2014అనే పేరుతో ఇరవై ఒక్క పేజీల పారిశ్రామిక విధాన ప్రకటనను కూడా విడుదల చేసింది. కొత్త రాష్ట్రంలో ఉద్యోగ కల్పన చాలా ముఖ్యమైన అంశం కాబట్టి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించడానికి పారిశ్రామిక వేత్తలకు, వ్యాపారస్తులకు అన్ని అనుమతులు సులభంగా ఒక్క చోటనే 30 రోజుల్లో ఇవ్వాలని, అందుకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా రూపొందించారు.

రాష్ట్రంలో వ్యవసాయానికి అనుకూలంగా లేని ఇరవయి లక్షల ఎకరాల భూమిని గుర్తించామని పరిశ్రమలకు అవసరమైన భూమి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా అందజేయబడుతుందని ప్రకటించారు. పారిశ్రామిక వేత్తలకు బ్రాండ్ తెలంగాణ ఉత్పత్తులు మార్కెటింగ్ చేసి పెట్టే బాధ్యత, భూమి, మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు, నీరు, విద్యుచ్ఛక్తి అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని విధాన ప్రకటనలో పేర్కొన్నారు. పారిశ్రామిక విధానంలో భాగంగా అంతర్జాతీయ బహుళ జాతి సంస్థలను కూడా ప్రభుత్వం చేతులు చాచి ఆహ్వానం పలికింది. స్వీడిష్ ఫర్నీచర్ సంస్థ ‘ఐకియా’ 600 కోట్ల పెట్టుబడితో దేశంలో మొదటి మెగా దుకాణాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. తెలంగాణ ప్రభుత్వం భూమిని కూడా ఈ కంపెనీకి ఈ మధ్యనే కేటాయించింది.

తమ చేతి వృత్తులు నాశనం అయిపోతాయని వడ్రంగులు, కమ్మరులు నిరసన తెలిపినా, వాటిని పునరుద్ధరిస్తామని ఎన్నికల మానిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రభుత్వం, వృత్తి సంఘాల నిరసనలను అభిప్రాయాలను పట్టించుకోలేదు. ఐ.టి.సి రూ. 3,500 కోట్లతో కాగితపు పరిశ్రమను ఏర్పాటు చేస్తానని ప్రకటించింది. ఖాయిలా పడ్డ కాగితపు పరిశ్రమలను తెరిపించే సంగతి ప్రభుత్వం మరచిపోయింది. ‘వేవ్‌రాక్ టెక్’ పార్క్ అనే అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ సంస్థ, దేశంలోని ధనిక వర్గాలకు విలాసవంతమైన గృహాలు, విల్లాలు ఇప్పటికే నిర్మిస్తూ ఉంది. ఆ సంస్థ హైదరాబాద్‌లో కూడా తన కార్యక్రమాలు ప్రారంభిస్తానని ప్రకటించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆటుపోట్లకు గురైన తెలంగాణకు చెందిన చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొంత ఊరట లభిస్తుందనుకున్నారు. విదేశీ రియల్ ఎస్టేట్ దిగ్గజాలు తెలంగాణ రాష్ట్రానికి కూడా వస్తుండటంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ రంగానికి గత ప్రభుత్వాల లాగే ప్రాధాన్యత లభిస్తున్నది. ఈ రంగంలో ఎక్కువగా ధనిక వర్గాలు, ఇతర ప్రాంతాల వాళ్లు ఉద్యోగులుగా స్థిరప డ్డారు. తెలంగాణకు చెందిన కొన్ని బలహీన వర్గాలు కనపడతాయి. ప్రైవేటు రంగంలో ఉన్న ఈ పరిశ్రమలో రిజర్వేషన్లు లేవు, ఇతర ప్రాంతాల వారిని నివారించి, తెలంగాణ విద్యాధి కులకు ఉద్యోగాలు ఇచ్చే నిబంధనలు లేవు. ఐ.టి. మంత్రిగారు ఈ రంగానికి పెద్దపీట వేసి ప్రపంచ దేశాలన్నీ తిరుగు తూ హడావిడి చేస్తున్నారు. అమెరికాలో వచ్చిన రాజకీయ మార్పుల వల్ల, ఇది వరకే ఉన్న పరిశ్రమ సంక్షోభంలోకి పోతున్నది. ఇంకా ఈ రంగం కొత్త యూనిట్‌లు పెట్టి తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పిస్తుందనే భరోసా లేకుండా పోయింది.

తెలంగాణ ప్రభుత్వం బాగా గొప్పలు చెప్తూ, ఔషధాల పరిశ్రమను ఏర్పాటు చేసుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించింది. రంగారెడ్డి జిల్లాలో ముచ్చెర్ల దగ్గర దేశంలోనే అతిపెద్ద మందుల పరిశ్రమల కేంద్రం ప్రారంభిం చడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. 1250 ఎకరాలలో 350 మైక్రో డ్రగ్ యూనిట్లు, 120 అతిపెద్ద యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి భూసేకరణ మొదలు పెట్టింది. యు.పి.ఎ. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్రతిష్టపాలైన సెజ్ పారిశ్రామిక విధానానికి ప్రత్యామ్నా యంగా నిమ్జ్ (నేషనల్ ఇన్వెష్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ జోన్) పారిశ్రామిక కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్ంయతో ప్రారంభించాలని తలంచింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు, మెదక్ జిల్లాలను ఎంపిక కూడా చేసింది. మన ప్రభుత్వం మెదక్ జిల్లాలోని న్యాలకల్, ఝరాసంగం మండలాలలో 25,000 ఎకరాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వ అనుమతి పొందింది. దాదాపు అతిపురాతనమైన 31 గ్రామాలు ఈ పారిశ్రామిక కేంద్రం వల్ల నష్టపోతున్నాయి. ప్రజలు వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం బెదిరించి భూసేకరణ ప్రక్రియ ప్రారంభించింది. ఈ ప్రాంతంలో కూడా ఫార్మా కంపెనీలకే ప్రాధాన్యత ఉంటుందని ప్రభుత్వం చెప్పుతున్నది. తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర ప్రణాళిక విభాగం ‘సోఫో ఎకనామిక్ అవుట్ లుక్’ నివేదిక -2017 ఈ మధ్యనే ప్రచురించింది. అందులో పారిశ్రామిక అభివృద్ధి గురించి వివరమైన నివేదిక పొందుపరచబడింది. ఇప్పటి వరకు 3327 పరిశ్రమలకు అనుమతి జారీ అయిందని, దాదాపు 51 వేల కోట్ల పెట్టుబడులు ఈ కంపెనీలు పెడ్తున్నా యని, 2 లక్షల 12 వేల మందికి ఉద్యో గాలు లభిస్తాయని పేర్కొంది. ఒక్క మేడ్చల్ జిల్లాలోనే అత్యధికంగా 727 యూనిట్లకు అనుమ తి లభించిందని, తర్వాత క్రమంలో రంగారెడ్డి, సంగారెడ్డి , కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాలున్నాయని పేర్కొంది. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక రాష్ట్రంలో 8618 ఖాయిలాపడ్డ మధ్య, చిన్న పరిశ్రమలున్నాయని, అందులో 7% మాత్రమే అంటే 632 యూనిట్లకు మాత్రమే ఉత్పత్తి చేసే సామర్థముందని, తక్కినవన్నీ పనికిరానివని చెప్పింది.

నిజానికి ఒక హైదరాబాద్ శివార్లలోనే 20 వేల దాకా చిన్న, చితక పరిశ్రమలుండేవి. కొన్ని పబ్లిక్ రంగ సంస్థలకు అనుబంధ పరిశ్రమలుగా ఉండేవి. పబ్లిక్ రంగ సంస్థల మూసివేత, ప్రపంచ బ్యాంకు, నూతన ఆర్థిక విధానాల నేపథ్యంలో చాలా చిన్న పరిశ్రమలు మూతప డ్డాయి. కొన్ని వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. రాష్ట్రం ఏర్పడగానే మూతపడ్డ ఈ పరిశ్రమల విషయంలో సమీక్ష చేసి వాటికి జీవం పోయవలసి ఉండె విషయాన్ని బ్యాంకర్లకు మాత్రమే వదిలేస్తే, వాళ్లు కంపెనీలు బాకీ తీర్చే సామర్థం నుండి మాత్రమే పరిశీలిస్తారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం కూడా పాత అభివృద్ధి నమూనానే పూర్తిగా అంగీక రించిందని చెప్పకతప్పదు. తెలంగాణ ఉద్యమం సమ యంలో చాలా అంశాలు చర్చలోకి వచ్చాయి. మూత పడ్డ పరిశ్రమలు, చేతి వృత్తులు, జిల్లాలలో కానరాకుండా పోయిన అతిచిన్న యూనిట్ల విషయాలు అజెండా మీదికి వచ్చి, ఈ ఆకాంక్షలకు ప్రాధాన్యత ఉంటుందనే హామీ కూడా ఇవ్వడం జరిగింది.

రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నూతన రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలపై చర్చ జరుగుతుండగానే, దేశంలోని బహుళ జాతి సంస్థలకు, బడా దళారీ పెట్టుబడిదారీ సంస్థలకు ఎర్రతివాచీ పరచి ఆహ్వానం పలకడం జరిగింది. ఇదే సమయంలో రాష్ట్రంలోని రెండు ప్రధానమైన పరిశ్రమలు మూతపడ్డాయి. వరంగల్ జిల్లాలోని కమలాపూర్‌లో ఉన్న బల్లపూర్ ( పాత ఎపి, రేయాన్స్), రెండవది ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని సిర్పూరు పేపర్ మిల్స్. వరంగల్ పట్టణంలోని ఆజంజాహి బట్టల మిల్లు మూతపడి దాదాపు 30 సంవత్సరాలైంది. కమలాపూర్‌లోని రేయన్స్ ఫ్యాక్టరీని ప్రస్తుతం ధాపర్ గ్రూపు, బల్లాపూర్ ఇండస్ట్రీస్ అనే పేరుతో నడిపిస్తుంది. దాదాపు 3000 మంది కార్మికులు ఇందులో పని చేస్తున్నారు. పది వేల మంది దాకా ఫ్యాక్టరీ బయట ఉపా ధి పొందుతున్నారు. ప్రతికూల వాతావరణంవల్ల యాజ మాన్యం కంపెనీని మూసివేసింది. ఇది చట్ట వ్యతిరేక చర్య అయినప్పటికీ ప్రభుత్వం మేనేజ్‌మెంట్‌ను కూర్చోబెట్టి మాట్లాడి ఫ్యాక్టరీ తెరిపించే ప్రయత్నం చేయడం లేదు.

పైగా సంవత్సరం క్రితం ఆ కార్మికులు తమకు న్యాయంగా రావలసిన ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ బకాయిల గురించి కార్మిక మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలవడానికి వస్తుండగా వారిని వ్యానును జనగాంలో పోలీసులు ఆపి కార్మికులను వెనక్కి పంపి, నాయకులను రోజంతా పోలీసు స్టేషన్‌లో కూర్చోబెట్టారు. 1942 నుండి కాగితం ఉత్పత్తిలో ఉన్న సిర్పూర్ కాగజ్‌మిల్లు, బిర్లాల యాజమాన్యంలో ఉండే ది. తర్వాత పొద్దార్ వాళ్లు ఖరీదు చేసి కొంతకాలం నడిపించి, చట్ట వ్యతిరేకంగా మూసివేశారు. దాదాపు 3,200 కార్మికులు అంతకు రెట్టింపు పరోక్షంగా ఉపాధి పొందు తున్న వారు వీధిన పడ్డారు. పారిశ్రామిక విధానానికి సామాజిక ప్రయోజనాలు ఉండాలి. జి.డి.పి పెరుగుదల మాత్రమే అభివృద్ధి కాదు. పారిశ్రామి క విధానం స్థానిక వనరులను స్థానిక ప్రజల ప్రయోజనాల కోసం వినియోగిం చ గలిగే దిగా ఉండాలి. స్థానిక ఆర్థిక వ్యవ స్థను బలోపేతం చేసి, మొత్తంగా జీవితా లను మెరుగుపరచే దిశగా విధానాల రూప కల్పన జరగాలి. ఏది అభివృద్ధి అనే విష యంలో ఇప్పటికైనా తెలంగాణ ప్రభు త్వం చర్చ జరపవలసిన అవస రం ఉంది. ప్రతి మనిషి కనీస స్థాయి నేర్పులు గల దశకు చేరుకునే స్థితిని కల్పించడం, సహజ వనరులను సద్విని యోగం చేసి బహుళ ప్రజలకు ప్రయోజనం చేయడం ప్రధానంగా ఉండే విధానం అవసరాన్ని ప్రభుత్వం గుర్తించాలి.

యస్. జీవన్ కుమార్,
మానవ హక్కుల వేదిక,
9848986286