Home ఎడిటోరియల్ అటకెక్కిన ప్రగతి మంత్రం

అటకెక్కిన ప్రగతి మంత్రం

BJP

అచ్ఛేదిన్, సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఇవన్నీ ఉత్త మాటలుగానే మిగిలిపోయిన తర్వాత ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గట్టెక్కించేది కేవలం రామ మందిరమే అన్న నిర్ణయానికి బిజెపి వచ్చేసింది. డిమానిటైజేషన్‌తో నల్లకుబేరులను నాశనం చేసామని ప్రజల్ని నమ్మించాలను కున్నారు. ఎన్నికలకు ముందు ఏకపక్షంగా తీసుకున్న డిమానిటైజేషన్ నిర్ణయం బిజెపి మెడకు చుట్టుకుంది. దేశంలో అత్యంత ప్రాముఖ్య మున్న ఉత్తరప్రదేశ్‌తో సహా మరో నాలుగు రాష్ట్రా ల ఎన్నికల్లో డిమానిటైజేషన్ మంత్రంతో ఓట్లు రాలుతాయని, ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాదు 2019 సాధారణ ఎన్నికల్లో కూడా తిరుగుండదని అనుకున్నారు. డిమానిటైజేష న్ దారుణంగా విఫలమైంది. ఇప్పటి వరకు ఎంత డబ్బు బ్యాంకులకు వచ్చిందో, ఎంత కరెన్సీ మళ్ళీ బ్యాంకులకు పంపిణీ చేశారో లెక్కలు చెప్పడానికి కూడా సిద్ధంగా లేరు.

మోడీ, అమిత్ షాల పథకాలేవీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఫలించేలా కనబడడం లేదు. వికాస్, ప్రగతి అంటూ చెబుతున్న మాటలను ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలవాలంటే ఇప్పుడు ఒకే ఒక్క దారి, అదే మతతత్వపు రహదారని బిజెపి నిర్ణయించినట్లు కనబడుతోంది. మతపరంగా సమాజంలో చిచ్చుపెడితే ఓట్లవాన కురుస్తుందని బిజెపి ఆశిస్తోంది. ముజఫర్ నగర్ అల్లర్ల ద్వారా 2014 సాధారణ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో 73 పార్లమెంటు స్థానాలు గెలుచుకున్న ఉదాహరణ ఉండనే ఉంది.

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి మానిఫెస్టో చూస్తే ఈ వాస్తవం స్పష్టంగా అర్ధమవుతోంది. ఈ మానిఫెస్టోలో చాలా విషయాలకు ప్రగతి వికాసాలకు సంబంధం లేదు. సగటు ప్రజల సమస్యలకు మానిఫెస్టోలో అంశాలకు సంబంధం లేదు. కాని మతతత్వ రాజకీయాలు నడపడా నికి బాగా ఉపయోగపడే అంశాలన్నీ మానిఫెస్టో లో ఉన్నాయి. ఉదాహరణకు అమిత్ షా ఈ మానిఫెస్టోలో “యాంటి రోమియో స్క్వాడ్‌“ ఏర్పాటు చేస్తామన్నాడు. ఈ స్వ్కాడ్ ఏమిటి? ఈవ్ టీజింగ్ ఆపడానికా? పోలీసులు ఆ పని చేయాలి కదా. బిజెపి కొత్తగా యాంటీ రోమియో స్క్వాడ్ ఏర్పాటు చేయడమేమిటి? ఈ ప్రశ్నలకు చాలా సులువైన జవాబేమిటంటే, లవ్ జిహాద్ అంటూ సమాజంలో చిచ్చు పెట్టడానికి ఇప్పుడు కోర్టు తీర్పు అడ్డు వస్తుంది కాబట్టి, దానికి యాంటి రోమియో స్క్వాడ్ అన్న పేరుపెట్టి అవే మాటలను ప్రచారం చేస్తారు.

లవ్ జిహాద్ వంటి దేమీ లేదని విచారణల్లో తేలినా, పుకార్లు ప్రచారంలో పెట్టి ప్రజల్లో చిచ్చుపెట్టి, మంటలు రేపి ఓట్లు దండుకోవాలన్నదే ప్రయత్నం. యాంటి రోమియో స్క్వాడ్ పేరుతో ఇప్పుడు కొత్తగా గ్యాంగులు పుట్టుకువస్తాయి. గోరక్షక్‌ల మాదిరిగా గుండాగిరీ చెలాయించే ముఠాలు ఉనికిలోకి వస్తాయి. పశువధ శాలలను మూయించేస్తామని కూడా చెప్పారు. అన్నింటికి మించి రామ మందిరాన్ని మళ్ళీ ప్రముఖంగా మానిఫెస్టోలో పెట్టారు. ఉత్తరప్రదేశ్‌లో హిందూ ఓట్లను ఆకర్షించడానికే ఈ మందిరాన్ని ప్రముఖంగా ప్రస్తావిం చారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బిజెపి ఈసారి మానిఫెస్టోలో మందిరాన్ని ప్రముఖంగా ప్రస్తావించడం చూసి కొందరు టిక్కట్లు దొరకని బిజెపి నేతలే పరిహాసంగా “మందిర్ వహీం బనా యేంగే, తారీక్ నహీం బతాయేంగే” (మందిరం అక్కడే కడతాం కాని తేదీ మాత్రం చెప్పం) అంటూ వ్యాఖ్యానిస్తు న్నారు. మందిర సమస్యతో పాటు కైరానాలో హిందువులు వలస పోతున్నారని ఇంతకు ముందు ప్రచారం చేసి చిచ్చుపెట్టడానికి చేసిన ప్రయత్నాలను కూడా మరోసారి బిజెపి మొదలు పెట్టింది. కైరానాలో చాలా మంది వలస పోతున్నారన్నది నిజమే కాని దానికి మతపరమైన కారణాలు లేవని స్వయంగా హుకుమ్ సింగే చెప్పాడు. అయినా ఆ విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది.

బిజెపి మళ్ళీ మతతత్వ రాజకీయాలకే వచ్చింది. నిజానికి బిజెపి మతతత్వ రాజకీయాలను ఎన్నడూ వదల్లేదు. 2014లోను సబ్ కా వికాస్ అంటూ ప్రచారం చేసినా, బిజెపిలోని కిందిస్థాయి నాయకులు కొందరు మతతత్వ ఎజెండాను యథాతథంగానే కొనసాగించారు. ఇప్పుడు వికాస్ అని బిజెపి చెప్పినా ప్రజలు వినే పరిస్థితి లేదు కాబట్టి ఇక మతతత్వమే ప్రధానంగా మార్చుకున్నారు. దీనికి రెండు కారణాలు కనబడుతున్నాయి. మొదటి కారణం ఉత్తరప్రదేశ్ లో సమాజవాది పార్టీ, కాంగ్రెసు పార్టీల కూటమి ఏర్పడడం. ఉత్తరప్రదేశ్‌లోని 19 శాతం ముస్లిమ్ ఓట్లు ఈ కూటమికి పడే అవకాశాలున్నాయి. ఈ కూటమి ఏర్పడ కుండా అమిత్ షా చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశాడు. తన మిత్రుడు అమర్ సింగ్ ద్వారా సమాజ వాదిలో చిచ్చు వచ్చేలా చేసాడు. కాని అఖిలేష్ చాలా చాకచక్యంగా వాటన్నంటిని అధిగమించాడు. అమర్ సింగ్ విషయంలో అఖిలేష్ ఎలాంటి శషబిషలు లేకుండా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడాడు. మరోవైపు మాయావతి పార్టీ ముస్లిములకు రికార్డు సంఖ్యలో అంటే 99 మంది అభ్యర్థు లకు టిక్కట్లు ఇచ్చింది. దీనివల్ల ముస్లిమ్ ఓట్లు చీలిపోతాయని బిజెపికి కాస్త ఆశ ఉంది.

రెండవ కారణం గొడ్డుమాంసంపై బిజెపి రాజకీయాల వల్ల, చట్టాల వల్ల రాష్ట్రంలో దళితులు, ముస్లిములు చాలా నష్టపోయారు. అనేక ట్యానరీలు మూతపడ్డాయి. ఉపాధి అవ కాశాలు దెబ్బతిన్నాయి. అనేకమంది నిరుద్యోగులయ్యా రు. ముస్లిం, దళిత వర్గాల్లో బిజెపి పట్ల తీవ్రమైన నిరసన ఉంది. ముస్లిముల్లో ఒక్కరికి కూడా బిజెపి టిక్కెట్ ఇవ్వలేదు. ఉనాలో దళితులపై హింసాకాండ, గుజరాత్‌లో నిరసన ప్రదర్శనలు, రోహిత్ వేముల కేసులో బిజెపి వ్యవహారశైలి ఇవన్నీ బిజెపిని నిలదీస్తున్నాయి. బిజెపికి గుణపాఠం చెప్పాలని దళిత, ముస్లిమ్ వర్గాలు కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది.

బీహారులో జరిగిందే పునరావృతం అవుతుందన్న భయం బిజెపికి పట్టుకుంది. బీహారులో కూటమి వల్ల బిజెపి కి చావుదెబ్బ తగిలింది. అలాగే ఢిల్లీలోను బిజెపి కోలుకోలే నంతగా పతనమైంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలుపు కోసం మొదట పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రయిక్స్ ప్రచారాయుధంగా మార్చుకోవాలనుకున్నారు. ఆ ఎత్తుగడ అంత బలంగా పని చేసే అవకాశాలు కనిపించలేదు. సైన్యం చేసిన సాహసాన్ని తమ గొప్పగా చెప్పుకుంటే ప్రజలు నమ్ముతారా? పైగా సైనికుల వన్‌ర్యాంక్ వన్‌పెన్షన్ వ్యవహారంలో బిజెపి చివరకు మాజీ సైనికులపై లాఠీచార్జి జరిపించిన విషయం తెలిసిందే. సైనికుల పెన్షన్ల విషయంలోనూ అనేక వార్తలు దానికి పచ్చి వెలక్కాయలా గొంతులో అడ్డుపడే వార్తలే.

ఆ తర్వాత డిమానిటైజేషన్ పెద్ద ఆయుధంగా ఉపయోగ పడుతుందను కున్నారు కాని కరంటు సరఫరాయే సరిగా ఉండని ఉత్తర ప్రదేశ్‌లో డిజిటల్ చెల్లింపుల గురించి మాట్లాడడం హాస్యా స్పదంగా మారింది. మరోవైపు టిక్కట్ల పంపిణీలోనూ వారసులే కనబడుతున్నారు. రాజ్‌నాథ్ సింగ్ కుమారుడికి టిక్కట్టు. కళ్యాణ్‌సింగ్ మనుమడికి టెక్కట్టు. హుకుమ్ సింగ్ కూతురికి టిక్కెట్టు. బిజెపి కార్యకర్తల్లోను తీవ్రమైన అసంతృప్తి కనబడుతోంది. అమిత్ షా కార్యాల యాన్ని చుట్టుముట్టి మరీ నిరసన తెలిపారు. మరోవైపు ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు కూడా బిజెపిని దెబ్బ తీసేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మతతత్వ రాజకీయాలు తప్ప మరోదారి లేదన్న నిర్ణయానికి బిజెపి వచ్చినట్లు కనబడుతోంది.

బిజెపి గెలుపు కోసం కష్టపడాలని ఆర్‌ఎస్‌ఎస్ తన కేడర్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో అగ్ర వర్ణాల ఓట్లన్నీ తమకే పడేలా బిజెపి ప్రయత్నిస్తోంది. అందుకే బిజెపి పార్టీ నుంచి బహిష్కరించిన నాయకుడు దయా శంకర్ సింగ్ భార్యకు టిక్కట్టు ఇచ్చింది. దయా శంకర్ సింగ్‌ను పార్టీ ఎందుకు బహిష్కరించిందో కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి. మాజీ ముఖ్యమంత్రి, బహుజన సమాజ్ నాయకురాలు మాయావతిని వేశ్య అని తూలనాడిన నాయకుడు. తీవ్రమైన నిరసనలు రావడంతో గత్యంతరం లేక అతడ్ని పార్టీ నుంచి బహిష్కరించారు. ఇప్పుడు అతని భార్యకు టిక్కెట్టు ఇచ్చారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో జాట్ కులస్తులు ముఖ్యంగా రైతులు మోడీ పట్ల చాలా కోపంగా ఉన్నారు.

డిమానిటైజేషన్ వారి జీవితా లను మరింత అలజడికి గురిచేసింది. ఇప్పుడు విశాల హిందూ సమాజం అంటూ వారందరినీ ఆకట్టుకునే ప్రయ త్నాలు చేస్తున్నారు. ఇప్పడు బిజెపి కేవలం మతతత్వా న్నే నమ్ముకుంది. అగ్రస్థాయి నాయకులు ర్యాలీల్లో నామకార్థం ప్రగతి వికాసాల గురించి మాట్లాడుతున్నప్పటికీ, క్షేత్రస్థాయి లో నేత లు మతతత్వ వ్యాఖ్యలే చేస్తున్నారు. పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్న సురేష్ రాణా ఒక సభలో మాట్లాడు తూ ముస్లిములు అధికంగా ఉన్న కైరానా, దేవ్‌బంద్ పట్టణాల్లో కర్ఫ్యూ విధిస్తానని చెప్పాడు. ఈ వ్యాఖ్యపై బిజెపి అగ్ర నాయకత్వం పైకి ఏమీ మాట్లాడడం లేదు. లోలోన సంతోషిస్తూ ఉండవచ్చు. ఈ విధంగా సమాజంలో వచ్చే చీలిక తమకు మంచిదని ఆశిస్తూ ఉండవచ్చు. సంగీత్ సోమ్, సంజీవ్ బలియాన్, ఆదిత్యనాథ్ వంటి నాయకులు సమాజం లో మతతత్వ మంటలు రేపడానికి చేయవలసిన ప్రయత్నా లన్నీ చేస్తున్నారు. ముజఫర్ నగర్ అల్లర్ల సీ.డీ.లు సంగీత్ సోమ్ కారులో దొరికాయి. సంజీవ్ బాలియాన్ మరింత కుసంస్కారాన్ని చూపిస్తూ, ములాయం సింగ్ యాదవ్ వయసిప్పుడు కాటికి కాలుచాచిన వయసని అన్నాడు.

బిజెపిలో కొందరు నేతల పని కేవలం ఇలాంటి విద్వేష వ్యాఖ్యలు చేయడమే అనిపిస్తోంది. ఈ పని వారికి పార్టీ తరఫున అప్పగించబడిన బాధ్యత అన్న అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. వారి వ్యక్తి గత అభిప్రాయాలని తప్పించుకుంటుంది. 2014 ఎన్నికల్లో ఈ ఎత్తుగడలు, ముజఫర్ నగర్ అల్లర్లే బిజెపికి భారీ విజయం లభించేలా చేశాయి. చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతుందా లేక ప్రజలు మతతత్వ నాయకులకు బుద్ధి చెబుతారా అన్నది వేచి చూడవలసిందే.

వాహెద్ అబ్దుల్

7093788843