Home అంతర్జాతీయ వార్తలు రెండు వారాల్లో ప్రయోగ ఫలితాలు

రెండు వారాల్లో ప్రయోగ ఫలితాలు

WHO

 

ఇప్పటికైతే కరోనాకు ఏ మందూ లేదు
డబ్లుహెచ్‌ఒ అధినేత వెల్లడి

జెనీవా/లండన్ : కరోనా నివారణ ఔషధాల పనితీరు, వాటి సమర్థత తేలేందుకు కనీసం మరో రెండు వారాలు పడుతుంది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) శనివారం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎక్కడ కూడా ఇప్పటికీ కరోనా వైరస్ ఆటకట్టుకు ఎటువంటి సమగ్రమైన వ్యాక్సిన్ కానీ ఇతరత్రా మందు కానీ అందుబాటులోకి రాలేదు. చాలా వరకూ వ్యాక్సిన్‌లు ఇప్పుడు పలు రకాల ప్రయోగదశలలో ఉన్నాయి. ఈ ప్రయోగాల ఫలితాలు తమకు రెండు వారాల వ్యవధిలో అందుబాటులోకి వస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వైరస్ చికిత్సకు వాడే డ్రగ్స్‌కు సంబంధించి క్లినికల్ పరీక్షలు అత్యంత కీలకమైనవి. ఇవి తొలుత జంతువులలో తరువాతి క్రమంలో మనుష్యులలో చేపడుతారు.

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సాగుతోన్న డ్రగ్స్ పరిశోధనల వివరాలు, వాటి పనితీరు గురించి తమకు రెండు వారాలలో తెలుస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధ్హానమ్ గెబ్రెయెసస్ తెలిపారు. కోవిడ్ మహమ్మారి అడ్డూ అదుపు లేని దశలో దీనిపై ఏర్పాటు అయిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐరాస వార్తా ప్రతినిధుల జెనీవా సంస్థ ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. అనేక ప్రాంతాలలో వైరస్ నివారణకు వ్యాక్సిన్‌ల గురించి వస్తున్న వార్తలలోని నిజానిజాలు , వాటి పనితీరుపై కరస్పాండెంట్లు సంధించిన ప్రశ్నలకు టెడ్రోస్ సమాధానం ఇచ్చారు. డ్రగ్స్ సమర్థత ఎటువంటిది అనేది తేలాల్సి ఉందన్నారు. అప్పుడే వాటిని సమగ్రరీతిలో అధికారికంగా వాడుకునేందుకు వీలుంటుందన్నారు. వచ్చే రెండు వారాలలో దీనిపై స్పష్టత వస్తుందన్నారు. తమకు అందే ప్రయోగ పరీక్షల ఫలితాలతో వ్యాక్సిన్‌లు ఇతరత్రా మందుల సమర్థతను తేల్చుకుంటామని తెలిపారు.

39 దేశాలలో ట్రయల్స్
39 దేశాలలోని దాదాపు 6వేల మంది వరకూ ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్‌కు ముందుకు వచ్చారు. వీరిని స్వచ్ఛంద కార్యకర్తలుగా గుర్తించి వ్యాక్సిన్‌లు ఇతరత్రా డ్రగ్స్ పరీక్షలకు వినియోగించుకుంటున్నారని, వైరస్ నివారణ మందు ఆవిష్కరణలో ఇప్పుడు సాగుతున్నది సంఘీభావ ట్రయల్ అని వెల్లడించారు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తుతం వివిధ రకాల మందుల పనితీరుపై క్లినికల్ అధ్యయనం నిర్వహిస్తోంది. ముందుగా ప్రాధమిక ఫలితాలు అందుతాయని ఆయన వివరించారు. కోవిడ్ 19కు సంబంధించి తమ సంస్థ పరిధిలో ఐదు ప్రాంతాలలో చేపట్టిన సాలిడారిటి ట్రయల్స్‌ను జాగ్రత్తగా గమనిస్తున్నామని వివరించారు.

ఇప్పటికైతే రెమ్‌డెసివిర్, హైడ్రోక్సిక్లోరోక్విన్, హెచ్‌ఐవి డ్రగ్స్ అయిన లోపినవిర్ /రిటోనవిర్ వంటి డ్రగ్స్‌సమర్థతపై పరీక్షలు తుది దశలో ఉన్నాయని అన్నారు. అమెరికా అధ్యక్షులు ట్రంప్ పదేపదే క్లోరోక్విన్ వాడకం గురించి చెపుతూ వచ్చారు. భారత్‌లో మలేరియా నివారణకు ఇది అత్యద్భుతంగా పనిచేసిందని, దీనిని కరోనా వైరస్ కట్టడికి భారీగా వాడుకోవచ్చునని ప్రచారం చేశారు. అయితే ఈ మందుతో ప్రతికూల ఫలితాలు లేకపోయినా ఇది పెద్దగా నివారణకు పనిచేయడం లేదని ఇటీవలే తేల్చారు. అయితే దీని పనితీరు గురించి మరికొన్ని పరిశోధనలు సాగుతున్నాయని వెల్లడించారు.

వ్యాక్సిన్‌పై ఇప్పుడే చెప్పలేమంతే
ప్రస్తుత దశలో ఎప్పటికి వ్యాక్సిన్ వస్తుందనేది చెప్పడం చాలా కష్టమని డబ్లుహెచ్‌ఒ అత్యయిక విభాగం అధినేత మైక్ ర్యాన్ స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌లు వచ్చినట్లు చెప్పడం కేవలం ప్రచారానికే అవుతుందని తెలిపారు. ఇప్పటికైతే ఎటువంటి వ్యాక్సిన్ రాలేదన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఔషధ సంస్థలకు చెందిన దాదాపు 18 వ్యాక్సిన్‌లకు సంబంధించి పరీక్షలు కీలక దశకు చేరుకున్నాయి. ఇవి ఇప్పుడు మనుష్యులలో పరీక్షించి చూసే దశలో ఉన్నాయి.

WHO says Vaccine against Covid-19 not certain