Home వార్తలు సినిమాగా ఎయిర్‌హోస్టెస్ నీర్జా

సినిమాగా ఎయిర్‌హోస్టెస్ నీర్జా

ఎయిర్‌హోస్టెస్‌లు అంటే ఒకప్పుడు గొప్ప అభిప్రాయం ఉండేది కాదు. ఖరీదైన ఆయాలని, గాల్లో ఎగిరే సుందరీమణులని రకరకాల పేర్లు పెట్టి ఎద్దేవా చేస్తుండేవారు. 70,80 ల కాలంలో కూడా ఎయిర్ హోస్టెస్‌లు సినిమా తారలంత అందంగా ఉండేవారు. ఏమాత్రం ఖర్చు లేకుండా దేశాలన్నీ చుట్టగలిగే అవకాశం కూడా వారిదే. ఆ ఎయిర్ హోస్టెస్‌లలో ఒకరు, 1986 లో నీర్జా భానోత్ అనే 23 ఏళ్ల అమ్మాయి. చదువుకున్న పంజాబీ కుటుంబం నుంచి వచ్చిన నీర్జాకు ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం ఒక కల. తన కలను సాకారం చేసుకుంది ఎయిర్ హోస్టెస్ ఉద్యోగంలో చేరి. ఆ అమ్మాయి వలన ఎయిర్ హోస్టెస్‌లకు హీరో క్రేజ్ వచ్చేసింది.
Air-hostesముంబయ్ నుంచి న్యూయార్క్‌కు విమానం బయలుదేరింది. అబూ నిడల్ ఆర్గనైజేషన్‌కి సంబంధించిన పాలస్తీనా మిలెటెంట్లు కరాచీ సమీపంలో ఆ విమానాన్ని పదిహేడు గంటల పాటు హైజాక్ చేశారు. ఆ సమయంలో పాసింజర్ల సంరక్షణబాధ్యత తాను తసుకున్నారు నీర్జా. అమెరికన్ పాసింజర్ల పాస్‌పోర్టులు దాచిపెట్టి చాలామంది ప్రాణాలు కాపాడారామె. అత్యవసర మార్గం ద్వారా కొంతమంది పారిపోయేలా సహాయం చేశారు. బుల్లెట్ల వర్షం కురిపిస్తున్న మిలిటెంట్‌ల నుంచి ముగ్గురు చిన్నారులను కాపాడారు. చివరకు మిలిటెంట్ల చేతిలో ఆమె హతమయ్యారు. చనిపోయిన తర్వాత అశోక చక్ర ధైర్యసాహసాల అవార్డు పొందిన వారిలో అతి పిన్న వయస్కురాలామె. ఇది జరిగి 30 సంవత్సరాలైంది.
ఇప్పుడు ఆమె కథను తెరకెక్కించారు
రామ్ మధ్వాని దర్శకత్వంలో నీర్జా భానోత్ కథను సినిమా తీశారు. నీర్జా భనోత్‌గా సోనమ్ కపూర్ నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి పందొమ్మిదిన విడుదల కానుంది. “1986 నుంచి ఇప్పటి వరకు విమాన యాన సిబ్బంది తమ విధులను ఎంతో బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తున్నారు. వారికి ఈ సినిమా అంకితం”అని అంటున్నారు మధ్వాని. 1974 లో ఎయిర్ హోస్టెస్‌గా చేరి 2009 లో రిటైర్ అయిన ఎల్ఫిన్ ఫెమాండ్ అనే మహిళ, “అప్పట్లో చాలా తక్కువ ఎయిర్‌లైన్స్ ఉండేవి. మాకప్పుడు ఎంత బాగా సేవలు అందించాలో శిక్షణ ఇచ్చేవారు కాని, సురక్ష గురించిన ఏ శిక్షణా ఉండేది కాదు. కేవలం పాసింజర్లకు కావలసిన సౌకర్యాలు సమకూర్చడం మాత్రమే మా విధి. అంతకు ముందు ఆంగ్లో ఇండియన్‌లు, కేథలిక్, పార్శీ కుటుంబాలకు చెందిన అమ్మాయిలు ఎక్కువ శాతం ఎయిర్ హోస్టెస్‌గా పని చేసేవారు. విమానంలో మగవారితో సమానంగా పని చేయడం, పాసింజర్లకు సేవలందించడం చిన్న చూపుగా ఉండేది. అందుకే ఈ వృత్తి చేపట్టడానికి కొద్దిమందే ముందుకు వచ్చేవారు. 1960 ల సమయంలో హిందూ అమ్మాయిలు తల్లిదండ్రులతో గొడవపడో, అబద్ధాలు చెప్పో ఎయిర్ హోస్టెస్‌గా పని చేయడానికి వచ్చేవారు. పెద్ద చదువు అవసరం ఈ వృత్తికి లేదు పైగా చాలా పెద్ద జీతం. ఇది ఎక్కువగా యువతులను ఆకర్షించేది.” అంటూ అప్పటి విశేషాలు తెలియచేశారు.
ఎయిర్ హోస్టెస్‌లకు ఎన్నో ఆంక్షలు
విమానంలో పనిచేసే మగవారి గురించి ఎవరూ మాట్లాడేవారు కాదు కాని, ఎయిర్ హోస్టెస్‌ల అందం గురించి మాత్రం బాగా చర్చకొచ్చేది. లింగ వివక్ష కూడా ఎక్కువగానే ఉండేది. ఎయిర్ హోస్టెస్‌లు బరువు పెరగకూడదు, కళ్లద్దారులు పెట్టుకోకూడదు, మొటిమలు రాకూడదు. ఇలాటి ఆంక్షలేమీ మగవారికి ఉండేవి కావు. ముఖ్యంగా ఎయిర్ హోస్టెస్‌లకు పెళ్లి కాకూడదు. అలాగే విడాకులు పొందిన వారు కూడా పనికిరారు. 1979 లో ఇలాటి ఒక కేసు కోర్టుకు వెళ్లింది. అప్పుడు వచ్చిన తీర్పులో ఎయిర్ హోస్టెస్‌లు పెళ్లి చేసుకుంటే వారి ఉద్యోగం వదులుకోవలసిన అవసరం లేకుండా విమానం బయట విధులు నిర్వర్తించుకోవచ్చు. అప్పటికీ ఇప్పటికీ భారతీయ పాసింజర్లు ఫ్లైట్ అటెండెంట్‌లను పనివారి లాగా చూస్తారని విమాన సిబ్బంది చెప్తారు.
మహిళలన్న కారణంగా అన్నింట్లో వివక్ష
నీర్జా భానోత్ కూడా కేబిన్ అటెండెంట్ నుంచి కేబిన్ మేనేజర్ పోస్ట్ వరకు ఎదిగే అవకాశం ఉంది కాని కేవలం ఆమె ఒక మహిళ అన్న కారణంగానే ఆమెకు ఆ ప్రమోషన్ రాలేదు. 2000 సంవత్సరం మధ్య వరకు ఎయిర్ లైన్స్‌లో కేవలం మగవారు మాత్రమే మేనేజ్‌మెంట్, ఇంకా సూపర్‌విజన్ పోస్ట్‌లలో ఉండేవారు. 21 ఏళ్ల వయసులో ఉద్యోగంలో చేరిన మగ అటెండెంట్స్ తమ కన్నా ఎక్కువ అనుభవం ఉన్న మహిళల మీద సూపర్‌విజన్ చేసేవారు. ఈ విషయం మీద కూడా భారతీయ ఎయిర్ హోస్టెస్‌లు కోర్టుకు వెళ్లారు. విజయం సాధించారు. మహ్రూక్ చికివాలా అనే మహిళ 2006 లో మొదటిసారిగా ఫ్లైట్ ఇంచార్జిగా చార్జి తీసుకున్నారు. అలాగే రిటైర్మెంట్ వయసుకు సంబంధించి కూడా ఎయిర్‌హోస్టెస్‌లు కోర్టుకు వెళ్లారు. 1970,80 లలో మగవారి రిటైర్మెంట్ వయసు 58 ఉంటే, ఎయిర్ హోస్టెస్ వయసు 35 ఉండేది. 1990 లో ఎయిర్ ఇండియా ఎయిర్ హోస్టెస్‌ల రిటైర్మెంట్ వయసు 45 కి పెంచితే, 1993 లో 50 కి పెంచారు. 2003 లో 58 గా చేశారు. ఈ నిర్ణయం తీసుకోడానికి 14 ఏళ్లు పట్టింది. 1970,80 ల ప్రాంతంలో ఎయిర్ లైన్స్ చాలా ప్రమాదాలు ఎదుర్కుంది. మిడిల్ ఈస్ట్‌లో, క్యూబాలో రాజకీయంగా ఉన్న అస్థిరత వలన ఎయిర్ క్రాఫ్ట్ పేలుళ్లు, హైజాకింగ్‌లు ఎక్కువ జరుగుతుండేవి. ఖలిస్తాన్ ఉద్యమం నుంచి సిక్కు మిలిటెంట్‌లు ఆ రెండు దశాబ్దాలలో నాలుగు సార్లు హైజాక్ ప్రయత్నాలు చేశారు. పాలస్తీనియన్ హైజాకర్ల చేతిలో జరిగిన నీర్జా హత్యకు ముందు 1985 లో ఒక సిక్కు మిలిటెంట్ బృందం, కెనడా నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం మీద బాంబు దాడి చేసింది. అట్లాంటిక్ సముద్రానికి 31,000 అడుగుల ఎత్తులో కూలిపోయి 329 మంది ప్రయాణీకులు చనిపోయారు.