*సమరోత్సాహంతో సఫారీ
* సిరీస్ కోసం భారత్
* నేడు ఐదో వన్డే
పోర్ట్ ఎలిజబెత్: నాలుగో వన్డేలో సౌతాఫ్రికా అద్భుతంగా పుంజుకొని విజయం సాధించడంతో మంగళవారం జరిగే ఐదో వన్డేపై ఆసక్తి నెలకొంది. వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియాను కంగుతినిపించిన సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సమం చేసే అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని తహతహలాడుతోంది. మరోవైపు కిందటి మ్యాచ్‌లో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకొని మరో మ్యాచ్ మిగిలివుండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో భారత్ పోరుకు సిద్ధమైంది. రెండు జట్లు కూడా విజయమే లక్షంగా పెట్టుకోవడం పోరు నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయం.
ప్రతీకారం కోసం..
వరుస విజయాలతో జోరుమీదున్న తమను నాలుగో వన్డేలో ఓడించిన సౌతాఫ్రికాపై ఎలాగైన ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ సిద్ధమైంది. కిందటి మ్యాచ్‌లో జరిగిన పొరపాట్లకు ఈసారి తావివ్వకూడదనే ఆలోచనతో కోహ్లి సేన పోరుకు సిద్ధమైంది. ఒక మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన స్పిన్ ద్వయం కుల్దీప్ యాదవ్, చాహల్‌లను చిన్నచూపు చూడచూడ కూడదని, ఈసారి కూడా వారినే కీలక అస్త్రాలుగా వాడుకోవాలని కోహ్లి భావిస్తున్నాడు. ఇక, నాలుగు మ్యాచుల్లోనూ విఫలమైన రోహిత్ శర్మ ఈసారైనా తన బ్యాట్‌కు పని చెప్పాలని భావిస్తున్నాడు. ఇందులో రాణించడం ద్వారా తనపై వస్తున్న విమర్శలకు గట్టి సమాధానం చెప్పాలనే లక్షంతో ఉన్నాడు. మరోవైపు కిందటి మ్యాచ్‌లో రికార్డు శతకం సాధించిన ఓపెనర్ శిఖర్ ధావన్ మరోసారి చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. అద్భుత ఫాంలో ఉన్న ధావన్ ఈ మ్యాచ్‌లో కూడా జట్టుకు కీలకంగా మారాడు. అతను చెలరేగితే భారీ స్కోరును సాధించడం భారత్‌కు కష్టం కాక పోవచ్చు. కాగా, కెప్టెన్ విరాట్ కోహ్లి సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. భారీ ఇన్నింగ్స్‌లతో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా కలిగిన కోహ్లి విజృంభిస్తే సఫారీ బౌలర్లకు కష్టాలు తప్పక పోవచ్చు. మరోవైపు అజింక్య రహానెకు కూడా మ్యాచ్ కీలకంంగా మారింది. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లోనే రహానె బ్యాట్‌ను ఝులిపించాడు. రెండు వన్డేల్లో తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. కీలకమైన ఈ మ్యాచ్‌లో జట్టుకు అండగా నిలువాలనే పట్టుదలతో ఉన్నాడు. ధోని కూడా ఫాంలోకి రావడం భారత్‌కు ఊరటనిచ్చే అంశమే. అయితే హార్దిక్ పాండ్య వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. బ్యాట్‌తో, బంతితో అతను ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైన స్థాయికి తగ్గ ఆటను కనబరిచేందుకు సిద్ధమయ్యాడు. యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కూడా సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నాడు. మరోవైపు బౌలర్లు చాహల్, కుల్దీప్‌లకు మ్యాచ్ సవాలుగా మారింది. కిందటి మ్యాచ్‌లో ఇద్దరు సౌతాఫ్రికా బౌలర్ల చేతిలో దారుణంగా దెబ్బతిన్నారు. అయితే ఈ మ్యాచ్‌లో సఫారీ బ్యాట్స్‌మెన్‌ను దెబ్బ కొట్టేందుకు తహతహలాడుతున్నారు. ఇద్దరు చెలరేగితే జరిగే సఫారీ బ్యాట్స్‌మెన్‌కు కష్టాలు ఖాయం. జోరుమీదున్నారు…
మరోవైపు పింక్ మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని సాధించిన సఫారీలు సమరోత్సాహంతో పోరుకు సిద్ధమయ్యారు. వికెట్ కీపర్ హెన్రిక్ క్లాసెన్ రూపంలో వారికి కొత్త అస్త్రం లభించింది. కిందటి మ్యాచ్‌లో భారీ షాట్లతో చెలరేగిన క్లాసెస్ ఈసారి కూడా అదే జోరును కొనసాగించేందుకు తహతహలాడుతున్నాడు. ఇక, ప్రమాదకర ఆటగాడు డివిలియర్స్‌తో కూడా భారత్‌కు పెను ప్రమాదం పొంచి ఉంది. వాండరర్స్‌లో ఆడింది కొద్ది సేపే అయినా డివిలియర్స్ భారత బౌలర్లకు ముచ్చెమటలు పట్టించిన విషయం తెలిసిందే. డేవిడ్ మిల్లర్ కూడా మరోసారి విధ్వంసక ఇన్నింగ్స్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. కెప్టెన్ మార్‌క్రామ్ కూడా భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. వరుస వైఫల్యాలు చవిచూస్తున్న సీనియర్ ఆటగాడు డుమినీ కూడా సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఫెలుక్‌వాయో, మోరిస్‌ల రూపంలో అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లు ఉండనే ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా భారీ ఆశలతో బరిలోకి దిగుతోంది.