Home ఖమ్మం ఖమ్మం ఎవరి కోట ?

ఖమ్మం ఎవరి కోట ?

Khammam

మన తెలంగాణ/ఖమ్మం : ఖమ్మం అనగానే కమ్యూనిస్టులకు కంచుకోట అనే పేరుండేది. అది ఒక నాడు ఇప్పుడు అది తీపి జ్ఞాపకంగానే మిగిలిపోయింది. ఖమ్మం అంటేనే కాంగ్రెస్‌కు గుమ్మం అనే వారు. అది ఇప్పుడు మధురస్మృతిగానే మిగిలిపోనుంది. రాజకీయ చైతన్యానికి మారుపేరుగా, ఉద్యమాలకు పురిటిగడ్డగా పేరుగాంచిన ఖమ్మం జిల్లా మొదటి నుంచి కమ్యూనిస్టులకు కంచుకోటగా, కాంగ్రెస్‌కు పెట్టని కోటగా విరాజిల్లుతూ వచ్చేది. కానీ ఇప్పుడు ఆ కోటలకు బీటలు బారాయి. కాంగ్రెస్ పార్టీ సంప్రాదాయక ఓటు బ్యాంక్, కమ్యూనిస్టుల నిబద్ధత ఓట్లన్నీ ఇప్పుడు చెల్లాచెదురయ్యాయి. టిడిపి దుకాణమే మూత పడే దశకు వచ్చింది. ఈ పరిస్థితిలో ఏప్రిల్‌లో జరిగే ఎన్నిల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి ఎవ్వరూ సాహసించడం లేదు.

పిలిచి టికెట్ ఇస్తామన్నా నిరాకరించే పరిస్థితి ఏర్పడింది. టిడిపి నుంచి పోటీ చేయాలా వద్దా అనే మీమాంసలో పడింది. ఇక వామపక్షాలు మాత్రం ఉనికి కోసం తాము ఉన్నామని తెలియజేయడానికి పోటీ చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ స్వరూపమే మారిపోయింది. బలమైన రాజకీయపార్టీలన్నీ బలహీనం అయిపోయా యి. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయకుండా పొత్తులో బాగంగా సిపిఐకి టికెట్ కేటాయించడంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు చిల్లులు పడినట్లయింది. దీనికి తోడు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానాన్ని పొత్తులో భాగంగా టిడిపికి కేటాయించడం, కాంగ్రెస్ పోటీ నుంచి తప్పుకోవడంతో అసలు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గుర్తును జనం మరిచిపోయేటట్లు చేసింది.
నియోజకవర్గం ఏర్పాటు : ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరుగగా 11 సార్లు కాంగ్రెస్, రెండు సార్లు పీడిఎఫ్ అభ్యర్థులు గెలుపొందగా, సిపిఎం, టిడిపి, వైఎస్‌ఆర్‌సిపిలో చేరోసారి గెలుపొందాయి. ఖమ్మం జిల్లా ఏర్పాటుకు ముందే అంటే 1952లో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటైంది. అప్పట్లో వరంగల్ జిల్లాలోనే ఖమ్మం ప్రాంతం ఉండేది. ఖమ్మం పార్లమెంట్ స్థానంలో తొలుత వరంగల్ జిల్లాలోని డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గం ఉండేది. అనంతర కాలంలో డోర్నకల్ స్థానంలో పాలేరు, సూజాతనగర్ నియోజకవర్గాలు వచ్చి చేరాయి. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో సూజాతనగర్ నియోజకవర్గ స్థానంలో ఏర్పాటైన వైరా నియోజకవర్గం, కొత్తగా ఏర్పాటైన అశ్వారావుపేట నియోజకవర్గాలు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో అంతర్భాగమయ్యాయి.

ప్రస్తుతం ఖమ్మం పార్లమెంట్ నియోకవర్గంలో ఖమ్మం జిల్లాలోని అయిదు అసెంబ్లీ సెగ్మెంట్లైన ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, మధిర, వైరాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాలు కొనసాగుతున్నాయి. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం 15,04, 878 ఓటర్లు ఉండగా అందులో పురుషులు 7,36,222 మంది, మహిళలు 7,68,626 మంది ఉన్నారు.
తొలి సారిగా టిడిపి విజయం : 2009 ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసిన నామా నాగేశ్వర్‌రావు తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి రేణుకచౌదరిపై 1,24,448 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి ఇక్కడ కూడా టిడిపికి బలం ఉందని నిరూపించారు. ఈ ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన జలగం హేమమాలినికి 1,87,653 ఓట్లు లభించాయి. ఇక 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సిపిఐతో పొత్తు పెట్టుకొని ఈ సీటును సిపిఐకి వదిలివేయగా ఆ పార్టీ నుంచి జాతీయ నాయకుడు డాక్టర్ కె.నారాయణ పోటీ చేసి ఓడిపోయారు.అయితే ఈ స్థానం నుంచి వైఎస్‌ఆర్‌సిపి నుంచి పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సమీప టిడిపి అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై 12,204 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో సిపిఎం పార్టీ వైసిపికి మద్దదు ఇచ్చింది. అటు కమ్యూనిస్టులకు, ఇటూ కాంగ్రెస్‌కు పెట్టని కోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌సిపికి కూడా స్థానం ఉందని నిరూపించారు. అయితే అదిఅంతా కేవలం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కృషి వల్లనే సాధ్యమైంది. ఇప్పుడు ఆ పార్టీ కూడా ఇక్కడ కనుమరుగైంది.

ఇటీవలనే సండ్ర వెంకటవీరయ్య, నామా నాగేశ్వరరావులు టిడిపిని వీడటంతో ఇప్పుడు ఆ పార్టీ కూడా జిల్లాలో ఖాళీ అయ్యింది. తెలంగాణ ఆవిర్భావం తరువాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ ప్రభంజనంతో ఇప్పుడు ఎంపి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు జంకుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ప్రజాకూటమి ఆధిక్యత నిలుపుకున్నప్పటికీ, కేవలం 60 రోజుల వ్యవధిలోనే ఫలితాలన్నీ తారుమారు కావడం, ఇప్పుడు మెజార్టీ ఎమ్మెల్యేలంతా గులాబీ నీడలో చేరడంతో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు నాయకులు ఎవ్వరూ పెద్దగా ముందుకు రావడం లేదు. ఇక్కడి నుంచి రెండు పర్యాయాలు గెలుపొందిన రేణుకాచౌదరి, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు ఎంపిగా పోటీ చేసేందుకు సుముఖంగా లేరు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు సీట్లు రాకున్నప్పటికీ ఘననీయమైన ఓట్లు లభించాయి. 2014 ఎన్నికలతో పోల్చితే టిఆర్‌ఎస్ ఓటు బ్యాంక్‌ను భారీగా పెంచుకుంది.

మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ గ్రామాల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. తొలిసారిగా ఖమ్మం ఖిల్లాపై గులాబీ జెండాను ఎగురవేసేందుకు ఆ పార్టీ ఇప్పటి నుంచే పావులు కదుపుతుంది. అందుకు ఇక్కడి నుంచి ఒక పర్యాయం ఎంపిగా గెలుపొందినా టిడిపి పోలీట్ బ్యూరో సభ్యులు, ప్రముఖ పారిశ్రామిక వేత్త నామా నాగేశ్వరరావును టిఆర్‌ఎస్ వ్యూహాత్మకంగానే బరిలోకి దించింది. ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక ఓట్లు అధికంగా ఉండటం కూడా ఒక కారణం. అందుకే సిట్టింగ్ ఎంపి పొంగులేటిని కాదని నామాకు అవకాశం ఇచ్చారు. ఇక కాంగ్రెస్ నుంచి మాజీ కేంద్ర మంత్రి ఫైర్ బ్రాండ్ రేణుకాచౌదరి పోటీ చేయబోతున్నారు. వీరిద్దరు పాత ప్రత్యర్థులే. వీరిద్దరూ రెండు పర్యాయాలు ఖమ్మం వేధికపై తలపడ్డారు. ఒక సారి రేణుకా చౌదవరి గెలువగా, మరోసారి నామా విజయం సాధించారు.

ఇప్పుడు ముచ్చటగా మూడోసారి బరిలోకి దిగుతున్నారు.అయితే ఈసారి నామా టిఆర్‌ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే రేణుకాచౌదరి ఇక్కడ పోటీ చేయడం ఇది నాల్గోసారి. 1999 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి మద్దినేని బేబి స్వర్ణకుమారిపై 8,398 ఓట్ల మెజార్టీతో రేణుకాచౌదరి విజయం సాధించింది. ఆ తరువాత 2004 ఎన్నికల్లో నామా నాగేశ్వరరావుపై 1,08,888 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తరువాత 2009లో జరిగిన ఎన్నికల్లో ఇదే నామ రేణుకచౌదరిని 1,24,448 ఓట్ల తేడాతో ఓడించారు. ఇప్పుడు మరోసారి నువ్వా.. నేనా అంటూ ఢీ కొనబోతున్నారు. ఈ ఎన్నికల్లో సిపిఎం నుంచి బి.వెంకట్ పోటీ చేస్తుండగా, బిజెపి నుంచి దేవకి వాసుదేవ్ పోటీ పడుతున్నారు.

ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి
గెలుపొందిన ఎంపిల వివరాలు
సం॥ గెలిచిన అభ్యర్థి పేరు పార్టీ మెజార్టీ
1952 టిబి.విఠల్‌రావు పి.డి.ఎఫ్ 72632
1957 టిబి.విఠల్ రావు పిడిఎఫ్ 5537
1962 తేళ్ళ.లక్ష్మికాంతమ్మ కాంగ్రెస్ 12060
1967 తేళ్ల.లక్ష్మికాంతమ్మ కాంగ్రెస్ 111338
1971 తేళ్ళ.లక్ష్మికాంతమ్మ కాంగ్రెస్ 49212
1977 జలగం కొండల్‌రావు కాంగ్రెస్ 85989
1980 జలగంకొండల్‌రావు కాంగ్రెస్(ఐ) 95483
1984 జలగం వెంగళరావు కాంగ్రెస్ 91499
1989 జలగం వెంగళరావు కాంగ్రెస్ 59252
1991 పి.వి.రంగయ్యనాయుడు కాంగ్రెస్ 5918
1996 తమ్మినేని వీరభద్రం సిపిఎం 63291
1998 నాదెండ్ల భాస్కర్‌రావు కాంగ్రెస్ 11664
1999 గారపాటి రేణుకాచౌదరి కాంగ్రెస్ 8398
2004 గారపాటి రేణుకచౌదరి కాంగ్రెస్ 108888
2009 నామా నాగేశ్వరరావు టిడిపి 124448
2014 పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వైఎస్‌ఆర్‌సిపి 12204

Who Won In Khammam Lok Sabha Elections 2019