Home లైఫ్ స్టైల్ ఆర్జనపై గర్జనలెందుకు?

ఆర్జనపై గర్జనలెందుకు?

secularsss

సాధారణ, మధ్యతరగతి కుటుంబాల్లో దంపతులిద్దరూ ఉద్యోగాలు చేస్తుంటారు. ఎవరు పనిచేయకపోయినా ఇల్లు గడవడం కష్టం. అయితే, భార్య ఎక్కువ సంపాదిస్తూ భర్త తక్కువ సంపాదిస్తే ఇద్దరి మద్య పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సైకలాజికల్ క్లాషెస్ వస్తాయి. ఇగో జొరబడుతుంది. ఫలితంగా మనస్పర్థలు..ఒకొక్కసారి ఇవి తారస్థాయికి చేరతాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనడమేకాదు విడాకుల దాకాపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రేమపెళ్ళిళ్ళు సైతం ఈ విధమైన భావాలవల్ల దెబ్బతిన్న సందర్భాలు ఇటీవల కాలంలో చాలా ఎక్కువవుతున్నాయి. భార్య సంపాదన కన్నా భర్త సంపాదన తక్కువయితే పురుషులు తలకొట్టేసినట్టుగా బాధపడతారు. ఎవరు ఎక్కువ సంపాదించారు? ఎవరు తక్కువ సంపాదించారన్నది కాదు ముఖ్యం. సంసారం సాఫీగా సాగుతోందాలేదా? రోజువారీ ఖర్చులకు కానీ, తలవని తలంపుగా వచ్చిపడే ఖర్చులకు కాని తట్టుకోగలిగిన రిజర్వు ఉందా లేదా అనేదే ముఖ్యం తప్ప నాదే పైచేయిగా ఉండాలి. నా మాటే చెలామణి కావాలి. ఆవిడ కిక్కురుమనకుండా చెప్పింది చేయాలి అనుకోకూడదు. భర్త ఆఫీసులో పనిచేసి అలిసిపోయి ఇంటికి వచ్చినట్లే ఆమె కూడా ఆఫీసులో పనిచేసి అలసిపోయి ఇంటికి వస్తుంది. ఇంటికి రాగానే పిల్లలకు, భర్తకు తినడానికి, తాగడానికి ఏదో ఒకటి చేయాలి. అలా చేయాలంటే ఆవిడకూ ఇబ్బందేకదా! ఆ విషయం గుర్తించి ఇంటిపనిలో ఒక చేయివేసి సహకరిస్తే పని తొందరగా అవుతుంది. ఆవిడా ఆనందిస్తుంది. భార్యాభర్తల మధ్య స్నేహసంబంధం ఉండాలే తప్ప ఆధిపత్యంకాదు. ఆవిడ ఎప్పుడూ నాకన్నా తక్కువగానే ఉండాలి అని భర్త అనుకోకూడదు. అలాగే భార్యస్థానంలో ఉన్నామె కూడా తన స్థాయి పెరిగిపోయిందని పై చూపులు చూడకూడదు. జీవితాన్ని తనతో పాటు పంచుకోడానికి వచ్చిన వాణ్ణి అలుసుచేసి ప్రవరించకూడదు. ఒకరికొకరుగా బతకాలే తప్ప ఒకరిపై ఒకరు పెత్తనం చేయాలని కోరుకోకూడదు. ప్రేమాభిమానాలకు, ఆత్మీయతా ఔదార్యాలకు భార్యభర్తలు పెట్టిందిపేరుగా ఉండాలి. సర్దుబాటు ధోరణి ఉండాలి.
ఇంటికి యజమాని ఎవరు? అని ప్రశ్నిస్తే డాడ్ ఈజ్ ది ఓనర్ ఆఫ్ ది హౌస్ సమాధానమిచ్చే రోజులకు చెల్లుచీటి రాయాలి. నిండుకుటుంబం నిలకడగా సాగాలంటే భార్యాభర్తలిద్దరూ జోడు చక్రాల్లా పనిచేయాలి. మన దేశంలో మగాడు సంపాదించి పెట్టాలి. ఆడది ఇంటిపట్టున ఉండి అన్నీ సవరించాలి అనే ఒక భావన బలంగా నాటుకుపోయింది. నిన్నమొన్నటి వరకు ఇదే తరహా ఉండడం వల్ల మగాడు అంటే ఇలాగే ఉండాలి. ఆడదంటే ఇలాగే ఉండాలనే ఆలోచన ఫిక్స్ అయిపోయింది. మారిన రోజులననుసరించి మన ఆలోచనలు, భావాలు మారాలి. సామర్థ్యానికి సంపాదన కొలమానం కాదు. జీతానికి శక్తి సామర్థాలకు ముడిపెట్టుకుని భర్తా బాధపడిపోకూడదు.. భార్యా నిష్ఠూరాలాడకూడదు.
సంపదే గౌరవానికి కొలమానమైతే సంసారం నడవదు. ప్రేమాభిమానాలే కాపురానికి పునాదికావాలి. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉంటాయి. దాని మీద దెబ్బతీసేలా ఎవ్వరూ వ్యవహరించకూడదు. సంపాదన దాచిపెట్టి, లేదా వేరే రకంగా తగులబెట్టి బాధ్యతలేకుండా భర్త వ్యవహరిస్తే మందలించడం భార్య బాధ్యత. అలాగే భార్య లేనిపోని ఆర్భాటాలకు, ఫాల్స్ ప్రిస్టేజీకి పోయి డబ్బును దుబారా చేస్తే ఆమెకు వాస్తవం తెలిసివచ్చేలా చెప్పడం భర్త బాధ్యత. వయసులో భర్త ఎలాగూ పెద్దవాడే అవుతాడు కనుక ఆమెను లాలించి చెప్పడం వల్ల పెద్దరికం నిలబడుతుందే తప్ప జోరూకా గులాం అయిపోడు.
గృహ నిర్వాహణకు అవసరమైనంత డబ్బు సర్దుబాటు చేయలేకపోతే సాధించడాలు, సతాయించడాలు చేయకూడదు. ఖర్చులకు కళ్ళెంవేసి జరుగుబాటు మార్గం వెతుక్కోవాలి. పక్కింటి వాళ్ళను చూసి పై ఇంటి వాళ్ళను చూసి పోలికలకు దిగితే ఎవ్వరూ మనశ్శాంతిగా ఉండలేరు. పైకి ఆహా ఓహో అన్నట్టుగా ఉండేవారు లోపల లోపల ఎంత కుమ్ములాడుకుంటారో ఎవరికి తెలియదు. కనుక మన జీవితాన్ని మనం దిద్దుకునే ప్రయత్నం చేయాలేతప్ప అనవసరపోలికలకుపోయి మాటలు అనుకుని మనశ్శాంతికి దూరం కావద్దు. సంపాదనలో ఎక్కువతక్కువల గురించి పదేపదే మాట్లాడుకోవడం వల్ల మనస్సుకి ముల్లులా గుచ్చుకుని గాయపడడం తప్ప ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదు.
ఎవరి సంపాదన ఎంతో ఇద్దరికీ తెలుసు. దాన్ని పనిగట్టుకుని అదేపనిగా అనడం, మాటలు అనుకోవడం అనవసరం. సంపాదన చాలడంలేదనుకుంటే అదనంగా సంపాదించే అవకాశాలు అన్వేషించడం, మరింత మంచి ఉద్యోగం కోసం ప్రయత్నించడం వంటివి చేయవచ్చు. మనిషిని మనీతో మాత్రమే చూడవద్దు. మానాభిమానాలతో చూడాలి. హాయిగా బతకడానికి, సఖ్యంగా ఉండడానికి సంపాదన ఒక సాధనం మాత్రమే..అదే సర్వంకాదు.