Home తాజా వార్తలు ‘హౌస్ హస్బెండ్’ సరికొత్త ఉద్యోగం

‘హౌస్ హస్బెండ్’ సరికొత్త ఉద్యోగం

Wife husbands

 

ఇప్పటి భార్యాభర్తలకు బోధ పడింది ఇద్దరం సమానమే అని. ఎవరెంత సంపాదించినా, కుటుంబ బాధ్యతలు సవ్యంగా మోయకపోతే, ఏ ఆశయం కోసం కష్టపడుతున్నామో అది కాస్తా ఆవిరై, మొదటికే మోసం వస్తుందని తెలుసుకున్న భార్యాభర్తలు ఆలోచనల తీరు మార్చుకుంటున్నారు. ప్రాధాన్యాలను బట్టి ఎవరేం చేస్తే కుటుంబానికి ఉపయోగపడుతుందో తెలుసుకున్నారు. ఇలా భర్త బంధానికి ఒక కొత్త అర్థం వచ్చింది అదే హౌస్ హస్బెండ్. భవిష్యత్తులో దీనికి ఏ పేరు సెటిలవుతుందో తెలియదు కానీ ఇప్పటికి మాత్రం సరైన అర్థం చెప్పే పదం ఇదే.

ఇద్దరూ సమానం:
ఇప్పుడు అన్ని రంగాల్లో మహిళలు సమానంగా నిరూపించుకుంటున్నారు. ఇందులో మగవాళ్లు ఆడవాళ్లు ఎక్కువ తక్కువలు లేవు. హౌస్ హస్బెండ్ విధానం విదేశాల్లో ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడే మనదేశానికి వచ్చింది. భార్య చేస్తున్న ఉద్యోగం కీలకమైనది, ఎక్కువ సమయం తీసుకునేది, కెరీర్ పరంగా వృద్ధిలోకిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నది అయితే ఆమె స్థానం పదిల పరిచేందుకు భర్త తన ఉద్యోగాన్ని పక్కన పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు.
ఆడవాళ్లు మాత్రమే ఇప్పటివరకు చేస్తున్న వంటపని ముఖ్యంగా పిల్లల పనులు చేసేందుకు భర్తలు సిద్ధం అవుతున్నారు. ఇందుకోసం తమ ఉద్యోగ జీవితం త్యాగం చేసేస్తున్నారు. భార్య సంపాదిస్తుంటే తిని కూర్చుని ఇంటి పనులు చేయటం నామోషీగా మాట్లాడే రోజులు పోయాయి.

చులకన చేస్తారు: ఇప్పటి వరకు ఉన్న కాన్సెప్ట్ ప్రకారం భార్య సంపాదన పైన భర్త ఆధారపడి బతకటం సమాజం దృష్టిలో హీనమే. అభివృద్ధి చెందిన దేశాలలో ఇందుకు వ్యతిరేకంగా ఉంటుంది. అన్ని పనులు అందరూ చేసుకోవాలి చేస్తారు కూడా. ఇంటి పనుల్లో భార్యకి సాయం చేయని భర్తనే చులకనగా చూస్తారు. కానీ మనదేశంలో పిల్లలు పుట్టిన దగ్గర నుంచే పెంపకంలో ఒక తేడా ఉంటుంది. ఆడపిల్లలను ఇంటి పనులు చేసేవాళ్లుగా, మగపిల్లవాడిని ఇంటికి యజమానిగా పెంచుతారు. ఇప్పటికీ అదే పద్ధతి అమల్లో ఉంది కూడా. కానీ ఈ యువతరం పూర్తిగా మారిపోయింది. మారిన పరిస్థితులను ఇద్దరూ అర్థం చేసుకుంటారు.

ఇద్దరూ ఒకే డిగ్రీ సాధించిన వాళ్లే. ప్యాకేజీల్లో, ఉద్యోగం చేసే కంపెనీల్లో తేడా ఉంటుంది. ఒకవేళ భార్య స్థానంలో ఉండే అమ్మాయికి కెరీర్ పరంగా తొందరగా ముందుకుపోయే అవకాశం ఉంటే దాన్ని భర్త ఆమోదిస్తున్నాడు. ఇంటి పనులు, పిల్లల పనులకు అలవాటు పడుతున్నాడు. సమాజం దృష్టిని అవతల పెట్టి ముందు భార్యాభర్తలు సంతోషంగా ఉండటం సంగతి చూసుకుంటున్నారు.

అబ్బాయికీ నేర్పాలి: ఇవ్వాల్టి రోజులను బట్టి యువత వంటపని, ఇంటిపని నేర్చుకుంటేనే జీవితం సౌకర్యంగా జరుగుతుంది. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలి అంటే ఆర్థికంగా నిలబడాలి. భార్యాభర్తలు ఇద్దరూ సంపాదించుకోవాల్సిందే. ఎప్పటిలాగే ఇద్దరూ ఉద్యోగం చేస్తూ ఇంటికి రాగానే భర్త సేదతీరటం, భార్య వంటింట్లోకి నడవటం కుదరదు. దంపతుల మధ్య ఎలాంటి మనస్పర్థలు రాకుండా ఉండాలంటే మగవాళ్లు ఇంటి పనుల్లో సాయం చేయక తప్పదు.

ఇప్పుడు మగవాళ్లూ దాన్ని కాదనటం లేదు. అన్ని పనుల్లోనూ తోచిన సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు నిజానికి బెస్ట్ కేరీర్స్‌లో అత్యంత లాభం ఇచ్చేది వంటపనే. స్టార్ హోటల్ చెఫ్స్ శాలరీ మనదేశంలో ఫైవ్‌స్టార్ హోటల్స్‌లో మూడు లక్షలకు తక్కువ ఉండదు. కిచెన్ మానేజ్‌మెంట్ చెఫ్స్‌కు కూడా లక్షలోపు శాలరీ ఉంటుంది. ఇదంతా అనుభవంపైన శ్రద్ధపైన ఆధారపడి ఉంటుంది.

ఈ లెక్కన హోటల్‌లో కుక్ ఉద్యోగం చేసేందకు లేని బిడియం ఇంట్లోనే సొంత బిడ్డలకు, భార్యకు ఇంట్లో సభ్యులకు వండిపెడితే మాత్రం ఎందుకు? వంటచేయటం అగౌరవం కాదని అబ్బాయిలూ తెలుసుకుంటున్నారు. వారాంతాల్లో వంటచేయటం చాలా మంది జాబ్ చేసే యువకులకు హాబీ అని బోలెడన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అన్ని పనుల్లో భార్యకు చేదోడు వాదోడుగా ఉంటూ ఆమె సమానప్రాధాన్యం ఇచ్చేందుకు ఇవ్వాల్టి కొత్త జనరేషన్ సంతోషంగా ముందుకొస్తోంది. అలా వచ్చిందే ఈ హౌస్ హస్బెండ్.

కొత్తతరం దంపతుల కోసం శిక్షణ ఇచ్చే కాలేజీలు కూడా ఉన్నాయి. స్త్రీ పురుషులకు ప్రత్యేకంగా కోర్సులు నిర్వహిస్తున్నారు. శిక్షణ ఇస్తే, ఇంటిపని పిల్లలను పెంచే విధానం వంటపని మగవాళ్లకు ఇచ్చే శిక్షణభాగంగా ఉంటుంది. ఈ కోర్స్ వివరాల కోసం ఇంటర్‌నెట్‌లో వెతికితే ఎంతో సమాచారం లభిస్తుంది కూడా.

కోర్స్‌లో పురుషులు స్త్రీలు పట్ల ఎంత ప్రేమతో వ్యవహరించారు, తమ ఉద్వేగాలు ఎప్పుడు ఎలా ఏ స్థాయిలో ప్రదర్శించాలో కూడా నేర్పుతారు. నేను మగవాడిననే అహంకారంతో ఇప్పటి వరకు అలవాటైన పద్ధతిలో పురుషులు ఎలా ప్రవర్తిస్తారు దాన్ని మార్పుకుంటే జీవితాలు బాగుంటాయని చెప్పే కోర్స్ ఇది. భార్యాభర్తల్లో ఒకళ్లు తక్కువ ఒకళ్లు ఎక్కువ అన్న భావన రానీయకూడదు. జండర్ విషయంలో అభిప్రాయాలు పూర్తిగా మారాలి.

ఇది నా కుటుంబం, నా జీవితంలో అడుగుపెట్టిన నా మిత్రురాలు నా భార్య. వీళ్లు మా ఇద్దరి అన్యోన్య దాంపత్యం ఫలితంగా పుట్టిన బిడ్డలు వీళ్లని సాకటంలో నాకు కూడా బాధ్యత ఉంది. ఈ కుటుంబం కోసం నా భార్య ఎలా కష్టపడి ఇంటి చాకిరి చేస్తుందో, ఇంట్లో పెద్దవాళ్ల పట్ల దయగా మెలుగుతుందో అదంతా నేను చేయగలను, చేస్తాను అనే దృక్పథం పెంపొందించేలా ఈ కోర్స్‌లో నాటకాలు, కౌన్సిలింగ్ క్లాసులు ఉంటాయి. అలాగే ఈ కోర్సులో ఆదర్శకోడళ్లు తయారవుతారు. గర్వం, అహంకారం లేకుండా కుటుంబం విషయంలో వాళ్ల బాధ్యత ఏమిటో వాళ్లు తెలుసుకుంటారు.

ప్రేమకు నిదర్శనం: భార్యాభర్తలు ఇద్దరూ ఒకటే అని తెలుసుకోవటం, వాళ్ల మధ్యని ఉండవలసిన ప్రేమకు నిదర్శనం తన కెరీర్ సాఫీగా సాగేందుకు భర్త ఉద్యోగం వదిలేసి ఇంటి పనులు చేసేందుకు ముందుకు వచ్చాడనే త్యాగం ఆమె విస్మరించకూడదు. ఎంత మంది ఎగతాళి చేసినా తాను చేస్తున్న హౌస్ హస్బెండ్ జాబ్ తన కుటుంబం కోసమేనని భర్త ఎప్పుడూ మరిచి పోకూడదు. జీవితం భార్యాభర్తలది.

ఇద్దరిలో తేడా లేదు. ఈ కాన్సెప్ట్‌లో భర్త త్యాగాన్ని భార్య, భార్య తెలివితేటలు, ఆమె కుటుంబం కోసం నిరంతరం శ్రమించటం భర్త అర్థం చేసుకుంటే ఈ జాబ్ నూటికి నూరు పాళ్లూ విజయవంతం. ఇది భార్యభర్తల బంధానికి సరికొత్త అర్థం చెపుతోంది. నేను హౌస్ హస్బెండ్‌ని అని చెప్పుకునేందుకు భర్త గర్వంగా సిద్ధపడేలా ఈ కొత్త జీవిత కథని భార్యాభర్తలు కలిసి రాయాలి. నిజమే ఇది కొత్త కథ. అవసరమైన కథ కూడా.

                                                                                                 చేబ్రోలు శ్యామ్ సుందర్

Wife husbands are changing their way of thinking