Thursday, April 25, 2024

ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటే ఉరి తీస్తాం: ఢిల్లీ హైకోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కరోనా రోగులకు చికిత్స అందచేసే ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరాను కేంద్ర, రాష్ట్ర లేదా స్థానిక పాలనా యంత్రాంగానికి చెందిన ఎవరైనా అడ్డుకుంటే ఆ అధికారిని ఉరి తీస్తామని ఢిల్లీ హైకోర్టు తీవ్ర స్వరంతో హెచ్చరించింది. విషమ స్థితిలో ఉన్న కరోనా రోగులకు అవసరమైన ఆక్సిజన్ సరఫరాలో కొరత ఏర్పడుతోందని మహౠరాజా అగ్రసేన్ ఆసుపత్రి దాఖలు చేసిన పిటిషన్‌పై శనివారం విచారణ సందర్భంగా జస్టిస్ విపిన్ సంఘి, రేఖా పాటిల్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఆక్సిజన్ సరఫరాను ఎవరు అడ్డుకుంటున్నారో ఒక్క ఉదంతం తమకు తెలియచేస్తే ఆ వ్యక్తిని ఉరి తీస్తామని ఢిల్లీ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఎవరినీ వదలిపెట్టే ప్రసక్తి లేదని కోర్టు స్పష్టం చేసింది. స్థానిక పాలనా యంత్రాంగానికి చెందిన అధికారులెవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని, వారిపై కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని ఢిల్లీ ప్రభుత్వానికి కోర్టు సూచించింది.
గత కొద్ది రోజులుగా ఢిల్లీ రోజుకు కేవలం 380 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే లభిస్తోందని, శుక్రవారం నాడు సుమారు 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే అందిందని ఢిల్లీ ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకురావడంతో కోర్టు మండిపడింది. ఢిల్లీకి కేటాయించిన రోజుకు 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా ఎప్పుడు అమలులోకి వస్తుందో చెప్పాలని కేంద్రాన్ని కోర్టు ప్రశ్నించింది. ఢిల్లీకి రోజుకు 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందుతుందని ఏప్రిల్ 21న కేంద్రం కోర్టుకు హామీ ఇచ్చిందని, ఇప్పటివరకు అది జరగలేదని, ఎప్పుడు జరుగుతుందో చెప్పాలని కేంద్రాన్ని నిలదీసింది.

Will hang anyone blocking Oxygen: Delhi HC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News