Thursday, April 25, 2024

దీదీ, స్టాలిన్‌లను పికె గెలిపిస్తాడా?

- Advertisement -
- Advertisement -

Will Prashant Kishore make win of Mamata Banerjee and Stalin?

 

దేశంలోని నాలుగు రాష్ట్రాల శాసన సభలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల నగారా మోగటంతో వివిధ రాజకీయ పార్టీల మధ్య ఎత్తులు పై ఎత్తులతో రాజకీయాలు వేడెక్కాయి. మార్చి 27న ఎన్నికలు ప్రారంభమై, ఏప్రిల్ 29న ఎనిమిదో దశతో ఎన్నికలు ముగిసి మే రెండో తేదీన ఎన్నికల ఫలితాలు రానున్నాయి. గత కొన్నాళ్లుగా పశ్చిమబెంగాల్ కేంద్రంగా బిజెపి ప్రోత్సహిస్తున్న పార్టీ ఫిరాయింపులు, తమిళనాడులో తెరవెనక నుండి కాషాయదళం నడిపిస్తున్న నాటకాలతో ఆ రెండు రాష్ట్రాల ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎఐఎడిఎంకె పై ఉన్న ప్రజావ్యతిరేకతను అధిగమించడానికి తమిళ రాజకీయాలలో రజినీకాంత్ ద్వారా చక్రం తిప్పాలని భావించిన బిజెపి చివరి క్షణంలో రజనీ రాజకీయ వైరాగ్యంతో బొక్క బోర్లా పడింది.

రజనీకాంత్ ప్రయోగం విఫలంకావడంతో కమలనాథులు ఆగమేఘాలపై అత్యంత వేగంతో శశికళను జైలు జీవితం నుండి రాజకీయ జీవితంలో పునః ప్రవేశానికి అట్టహాసంగా తీసుకురావటం, ఎఐఎడిఎంకెలో శశికళ పునరాగమనం కోసం కాషాయ దళం చేసిన ప్రయత్నాలకు ముఖ్యమంత్రి పళని స్వామి అడ్డుపడడం, విధిలేని పరిస్థితుల్లో రాజకీయాల నుండి వైదొలిగే ప్రకటన శశికళ చేత చేయించడం లాంటివి సినిమా సన్నివేశాలను తలపింపచేశాయి. జయలలిత, కరుణానిధిలాంటి ఉద్దండు ల మరణాంతరం జరుగుతున్న ఈ ఎన్నికలలో ఇరు పార్టీల గెలుపోటములపై ప్రజలలో పలు ఊహాగానాలు నెలకొంటున్నాయి.

పశ్చిమబెంగాల్‌లో మూడోసారి అధికారాన్ని హస్తగతం చేసుకొని హ్యాట్రిక్ కొట్టాలని దీదీ, రెండు పర్యాయాలు అధికారానికి దూరమై మూడో సారైనా తమిళనాడులో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి స్టాలిన్‌లు తమ ఎన్నికల వ్యూహకర్తగా పికెను నియమించుకోవడంతో రాజకీయ పరిశీలకులు, విశ్లేషకుల మధ్య ఫలితాలపై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. రాజకీయ వ్యూహకర్తగా ఎన్నో పార్టీలను అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత పికె సొంతం. 2014 పార్లమెంట్ సాధారణ ఎన్నికల్లో తన వ్యూహాలతో మోడీ ప్రధానమంత్రి కావడంతో ప్రశాంత్ కిషోర్ పేరు వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత 2015లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి వ్యతిరేకంగా జెడియు ఆర్‌జెడి కూటమి వ్యూహకర్తగా పనిచేసి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కావడంలో అతనిచ్చిన సలహాలు, 2017లో పంజాబ్‌లో అమరేందర్ సింగ్ గెలుపులో పికె సూచనలు, ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి అద్వితీయమైన విజయం, 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కేజ్రీవాల్ సాధించిన అఖండ విజయాలతో ప్రశాంత్ కిషోర్ కృషి, నైపుణ్యం, వ్యూహ చతురతపై రాజకీయ పార్టీలకు విశ్వసనీయత పెరిగింది.

పశ్చిమబెంగాల్‌లో 34 ఏళ్ల పాటు అప్రతిహతంగా అధికారంలో ఉన్న లెఫ్ట్ ప్రభుత్వాన్ని మట్టికరిపించి 2011లో 184 స్థానాలతో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్, 2016లో 211 స్థానాలు సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చింది. 2011లో ఒక్క స్థానం కూడా గెలవలేని బిజెపి 2016లో మూడు స్థానాలు గెలుచుకుని, ఈసారి రెండు వందలకు పైగా స్థానాలు గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం మూడు స్థానాలకు పరిమితమై 10.16 శాతం ఓట్లు సాధించిన బిజెపి 2019 పార్లమెంట్ ఎన్నికలలో 42 స్థానాలకుగాను 18 చోట్ల విజయం సాధించి 40.64 శాతం ఓట్లను పెంచుకోవడంతో నేడు అధికారంపై బలమైన ఆశలు పెట్టుకుంది. ఆరు నూరైనా బెంగాల్ ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకోవాలని కాషాయ పెద్దలు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.

అధికారమే లక్ష్యంగా కాచుకుని కూర్చున్న కమలనాథులు గత రెండు సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని పలు నియంత్రణ సంస్థల ద్వారా అనేక మంది మంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్‌ఎలను, ఎంపిలను, నాయకులను నయానో, భయానో బెదిరించి కాషాయ కండువా కప్పుతున్నారు. తృణమూల్, బిజెపి నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొని ఇరు పార్టీల మధ్య పోటాపోటీ ప్రదర్శనలు, కార్యకర్తల మధ్య నిత్య ఘర్షణలు, దాడులు, ఢీ అంటే ఢీ అనే స్థాయిలో తలపడుతున్నారు. బెంగాల్ బరిలో దీదీ తన అధికారాన్ని నిలుపుకుంటుందా? బిజెపి ప్రభుత్వం ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోనుందా? వామపక్షాలు కాంగ్రెస్ తమ బలాన్ని పెంచుకుంటాయా? అనే ప్రశ్నలు విశ్లేషకులలో తలెత్తుతున్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనుండగా పశ్చిమబెంగాల్‌లో బిజెపి ప్రయోజనానికై ఎలక్షన్ కమిషన్ ఎనిమిది విడతల్లో పోలింగ్ నిర్వహిస్తోందని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు.

బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ నుంచి రోజురోజుకు ఎదురవుతున్న సవాళ్లను, ఫిరాయింపు రాజకీయాలను దీటుగా ఎదుర్కొనేందుకు గతేడాది మమతా బెనర్జీ ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల సమన్వయకర్తగా నియమించుకొంది. మమతా బెనర్జీతో పలు సమావేశాలు ఏర్పాటు చేసుకున్న పికె తన వ్యూహాలకు పదును పెట్టారు. ప్రజల ఆలోచనలను తెలుసుకోవడం, దీదీని ప్రజలకు మరింత చేరువగా చేయడం, పార్టీ కార్యకర్తలు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం, ఎన్నికల ప్రణాళిక రూపకల్పన తదితర అంశాలలో అతని సంస్థ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ ప్యాక్) బెంగాల్ రాజకీయాలలో క్రియాశీలకంగా పని చేస్తోంది. ట్విట్టర్ వేదికగా ప్రశాంత్ కిషోర్ బిజెపికి వ్యతిరేకంగా చేస్తోన్న పలు ట్వీట్లు ప్రజలలోకి చొచ్చుకుని పోతున్నాయి. మమతా బెనర్జీని ‘బెంగాల్ బేటీ (బెంగాల్ బిడ్డ)’ గా చిత్రీకరిస్తూ ‘బెంగాల్ కో ఆపనీ బేటీ చాహియే (బెంగాల్ కు తన బిడ్డే కావాలి)’ అనే ప్రచారాన్ని సామాజిక మాధ్యమాలలో, ప్రచార సభలలో, నిత్యం జనాల నోళ్ళలో చర్చ జరిగే విధంగా ప్రశాంత్ కిషోర్ కృషి చేస్తున్నారు.

ఢిల్లీ బిజెపి పార్టీ నుంచి మన ‘బేటీ’ (మమతా బెనర్జీ) ని కాపాడుకోవాలనే స్థానికతను బెంగాలీ ప్రజల్లో రగిలించాడు. దేశంలో ప్రజాస్వామ్యం కోసం బెంగాల్‌లో యుద్ధం జరుగుతోందని, ప్రజలు సరైన సందేశంతో, సరైన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని పికె చేస్తున్న ట్వీట్లు, చేయిస్తోన్న ప్రచారం ప్రజలను ఆలోచనలో పడేస్తున్నాయి. బెంగాల్‌లో బిజెపి రెండు అంకెలకు పైగా సీట్లు సాధిస్తే ఇకముందు రాజకీయ వ్యూహకర్తగా పనిచేయనని, తన ఐప్యాక్ సంస్థను మూసివేస్తానని బిజెపికి పికె సవాల్ విసురుతున్నారు. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో ఎఐఎడిఎంకెతో బిజెపి జతకట్టగా, డిఎంకెతో కాంగ్రెస్ వామపక్షాలు జట్టు కడుతున్నాయి. కమలహాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీ ఈ ఎన్నికలలో అరంగేట్రం చేస్తూ మొత్తం స్థానాల్లో పోటీ చేయనున్నట్లు కమల్ హాసన్ ప్రకటించారు. వరుసగా రెండు పర్యాయాలు అధికారం చేపట్టిన ఎఐఎడిఎంకె మూడోసారి విజయకేతనం ఎగర వేయడం ద్వారా హ్యాట్రిక్ కొట్టాలని తహతహలాడుతోంది.

పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న డిఎంకె ఎలాగైనా ఎఐఎడిఎంకెని అడ్డుకుని అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతోంది. 2011, 2016లో వరుసగా రెండుసార్లు జయలలిత నాయకత్వంలో అధికారం సాధించిన ఎఐఎడిడీఎంకె పార్టీ నేడు జయలలిత మరణంతో ఏర్పడిన పరిణామాలతో గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటోంది. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఎఐఎడిఎంకె 40.88 ఓట్ల శాతంతో 134 స్థానాలు సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంటే ప్రధాన ప్రతిపక్షమైన డిఎంకె 39.85 ఓట్ల శాతంతో 89 స్థానాలు సాధించి కేవలం ఒక్క శాతం ఓట్లతోనే పరాజయం పాలైంది. జయలలిత మరణంతో ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం బాధ్యతలు చేపట్టడం, మూడు నెలలలోపే పన్నీర్ సెల్వం వైదొలగి పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, పన్నీర్ సెల్వం, పళని స్వామి వర్గాల మధ్య ఆధిపత్య ధోరణి, అవినీతి తదితర అనేక కారణాలతో అన్నాడిఎంకె బలహీనపడింది. 2019 పార్లమెంట్ సాధారణ ఎన్నికలలో 39 లోక్‌సభ స్థానాలకు గాను డిఎంకె 52.39 ఓట్ల శాతంతో 38 స్థానాలు సాధించింది.

ఎఐఎడిఎంకె 31.26 ఓట్ల శాతంతో కేవలం ఒక్క స్థానానికి పరిమితమై ప్రాభవాన్ని కోల్పోయింది. తమిళనాడులో దశాబ్ద కాలంగా పట్టుకోసం పరితపిస్తున్న బిజెపిని ప్రజలు ఉత్తరాది పార్టీగానే భావించడంతో ఉనికిని కాపాడుకోవటానికి తమిళ పార్టీల పైననే ఆధారపడుతూ వస్తోంది. ఎఐఎడిఎంకె పట్ల రోజురోజుకీ ప్రజలలో ఆదరణ తగ్గిపోతుండటంతో దాని మిత్ర పక్షమైన బిజెపికి చిరాకు తెప్పిస్తోంది. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం ద్వారా లబ్ధి పొందాలని భావించిన బిజెపికి అది బెడిసికొట్టడంతో శశికళ నాటకాన్ని రక్తి కట్టించి నవ్వుల పాలైంది. కూటమి పొత్తులో భాగంగా 20 స్థానాలకు పోటీ చేస్తున్న బిజెపి తనకున్న అర్థ, అంగ బల ఆధారంగా తమ కూటమి అధికారంలోకి రావటానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశ ప్రకటనలు, కమలహాసన్ నూతన పార్టీ ఆవిర్భావం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి ఎఐఎడిఎంకె కు లాభం చేసే పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో 2019 లోనే డిఎంకె అధినేత స్టాలిన్ ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా తన ఎన్నికల కార్యక్రమాలను సమన్వయం చేయడానికి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌ను నియమించుకున్నాడు. తన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి అఖండ విజయం సాధించడంలో ప్రశాంత్ కిషోర్ చేయించిన సోషల్ మీడియాలో ప్రచార హోరు, సోషల్ ఇంజినీరింగ్, ప్రచార సరళిలో వినూత్న పోకడలు లాంటి వ్యూహాలను గమనించిన స్టాలిన్ అతనిని తన వ్యూహకర్తగా నియమించుకున్నారు.

రాజకీయ చాణక్యుడిగా పేరొంది అనేక రాష్ట్రాల్లో ప్రత్యర్థి ఊహించని ఎత్తుగడలతో తనదైన ముద్ర వేసి విజయం సాధించి పెట్టిన ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ బృందానికి తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల్లో గెలుపు సులువేమీ కాదు. తమిళనాడులో వన్నియార్లు, వెల్లాల గౌండర్లు, చెట్టియార్, మొదలియార్ మొదలగు కులాలను సమన్వయం చేసి మద్దతు సాధించటం, బెంగాల్‌లో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ పేరుతో మత గురువైన అబ్బాస్ సిద్ధికి పెట్టిన పార్టీకి ముస్లింల ఓట్లు పోకుండా, మరో ప్రధాన వర్గమైన మతువాల ఆదరణ పొందటం పైనే దీదీ, స్టాలిన్‌ల గెలుపోటములు ఆధారపడ్డాయి. ఈ ప్రధాన వర్గాల మద్దతును ఓట్ల రూపంలో తృణమూల్ కాంగ్రెస్, డిఎంకెలకు సాధించి విజయాన్ని అందించడంలో ప్రశాంత్ కిషోర్ కృతకృత్యుడు అవుతాడా? లేదా? అన్నది మే రెండో తేదీ వరకు వేచి చూడాల్సిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News