Home ఎడిటోరియల్ కాంగ్రెస్ మరో మెట్టు దిగుతుందా?

కాంగ్రెస్ మరో మెట్టు దిగుతుందా?

congress

గతంలో కాంగ్రెస్ పార్టీ తన ఏక ఛత్రాధిపత్య వైభవాన్ని కోల్పోయిన తర్వాత, ఇతరులతో కలిసి ఉమ్మడికూటమి ప్రసక్తి లేదని, తమ ప్రభుత్వాన్ని తక్కిన పార్టీలు బయటి నుంచి బలపరచాలని అంటూ కొండకొమ్మున కూర్చోవటం, కాని అది సాగదని అర్థంకావటంలో విధిలేక మెట్టు దిగివచ్చి యుపిఎ రూపంలో అధికారాన్ని పంచుకోవటం తెలిసిందే. ఈసారి అవసర మైన పక్షంలో ఇంకొక మెట్టుదిగి, ఏ విధంగానైనా బిజెపిని ఆపటం అవసరం గనుక తమకు కాస్త ఎక్కువ సీట్లు వచ్చినా సరే ప్రధాని పదవి కోసం పట్టుబట్టకుండా ఇతర పార్టీల కూటమి అభ్యర్థిని బల పరచగలదా? అందుకు కూడా ఆ పార్టీ నాయకత్వం మానసికంగా ఇప్పటి నుంచే సిద్ధం కావటం మంచిదేమో.

2019 ఎన్నికలకు సంబంధించి జాతీయస్థాయిలో ప్రస్తుతం రంగులరాట్నం తిరుగుతున్నది. బిజెపి ఒక ఎన్నికలో ఓడినపుడల్లా ఇక ఆ పార్టీ పని అయిపోయిం దని, ఈసారి అధికారంలోకి రాదనే మాటలు జోరుగా సాగుతున్నాయి. ఆ పార్టీ మరో ఎన్నికలో గెలిచినపుడు అందరూ ఉసూరుమంటున్నారు. ఆశనిరాశలు ఉద్వేగ స్థాయికి చేరినప్పుడు ఇటువంటి పరిస్థితులు కన్పిస్తుం టాయి. ఇది చివరకు ఏ విధంగా పరిణమించవచ్చు. ఎందుకంటే, వాస్తవ పరిణామాలు ఇటు బిజెపిగాని, అటు ప్రతిపక్షాలుగాని ఎవరి ఆశ నిరాశలపైనా ఆధారపడి ఉండవు.

ఎన్నికలకు ఇంకా సరిగా ఏడాది కాలం ఉంది. అందరి బలాబలాలు ఈలోగా ఎటునుంచి ఎటైనా మారవచ్చు. ఎవరికివారు వ్యూహాలు రూపొందించుకుని తమ బలాన్ని పెంచుకునేందుకు ఏడాదికాలం తక్కువ వ్యవధి కాదు. అటువంటి క్రమంలో, ఏది ఎట్లా జరగవచ్చునో ఊహించేందుకు ప్రయత్నించటమంటే ఆకాశంలో మబ్బుతునక ను చూసి బిందెలను ఒడిసి పట్టుకోవటమే అవుతుంది. అట్లా పట్టుకోవటం అధికార క్రీడలోగల రాజకీయ పార్టీలకు సహజం. కాని సాధారణ ప్రజలు అయినవారు అటువంటి ఉద్వేగాలకు లోను కావలసిన అవసరం లేదు.

ఇది మరింత బాగా అర్థం కావాలంటే 2014 తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితా లను, పలు ఉప ఎన్నికల ఫలితాలను ఒకసారి మననం చేసుకోవచ్చు. వీటిలో బిజెపి లేదా వారి ఎన్‌డిఎ కూటమి పక్షాలు గొప్పగా గెలిచినవి ఉన్నాయి. దిగ్భ్రమ కలిగించే టట్లు ఓడినవీ ఉన్నాయి. ఈ రంగుల రాట్నం ముఖ్యంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలనుంచి మొదలైంది. తాజాగా ఇటీవల త్రిపుర తదితర ఈశాన్య భారత ఎన్నికలు, అంత కు కొద్ది వెనుక ముందులుగా ఉత్తరాది రాష్ట్రాలలో ఉప ఎన్నికలు జరిగాయి. కొన్నిచోట్ల స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. వీటన్నింటిని కలిపి చూసినట్లయితే గాలి ఏదో ఒకవైపు తిరుగులేని విధంగా వీస్తున్నట్లు చెప్పలేము. 2019 లోపు కర్నాటకతోపాటు మరికొన్ని అసెంబ్లీలకు ఎన్నికలున్నా యి. బహుశా కొన్ని ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికలు కూడా జరగవచ్చు. ఆయా రాష్ట్రాలలో ప్రస్తుతం కన్పిస్తున్న స్థితినిబట్టి కూడా అక్కడ గాలి నికరంగా ఒకరికి అను కూలం, మరొకరికి ప్రతికూలం అనదగ్గ విధంగా లేదు. గెలుపు ఓటములు కొద్ది అటుఇటుగా ఎవరివైపు అయినా జరగవచ్చుగాక. కాని దానిని మొత్తంగానే గాలి ఇటోఅటో జోరుగా వీయట మనలేము.

అనగా, పరిస్థితి ఇప్పటికే అస్పష్టంగా ఉందన్నమాట. 2019లోక్‌సభ ఎన్నికలు సంబంధించి జోస్యాలు అయితే చెప్పవచ్చుగాని, హేతుబద్ధమైన రీతిలో అంచనాలు వేయ గల స్థితి కన్పించటం లేదు. ఇక్కడ గుర్తుంచుకోవ లసిన ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. ఎన్నికలు పూర్తిగా సమీపించినపుడు ఏ పార్టీ ఏ కూటమిలో ఉండ గలదో, ఫలితాలు వెలువడినాక అప్పటి అవకాశాలను బట్టి ఎవరు ఏ కూటమివైపు ఆకర్షితులు కాగలరో మనం ఈ రోజున చెప్పగలమా? ఈ ప్రశ్న ఇంత అనిశ్చయంగా ఉండటానికి కారణాలు అందరికీ తెలిసినవే. ఎన్నికల కూటములు, అధికార కూటములు రెండూ ఫ్రీ మార్కెట్ వ్యవహారంగా ఎప్పుడో మారిపోయాయి. ఇందులో అత్యధికులకు సిద్ధాం తాలు, పవిత్రతలు, నైతికతలు అంటూ ఏవీ లేవు. ఇది మనం గతంలోనూ చూసిందే. ఫ్రీ మార్కెట్‌లో పార్టీల మద్దతును ప్రభావితం చేసేవి పదవులు, ధనం, అదే విధమైన ప్రయోజనాలు మరేవో కల్పించగల ఒప్పందాలు. ఆ కారణంగా, ఒకవేళ ఏ కూటమికో తిరుగులేని ఆధిక్యత లభించితే తప్ప, ఎన్నికల అనంతరం కూడా రంగుల రాట్నం తిరుగుతూనే ఉంటుందన్న మాట. సందర్భం అంటూ వచ్చినందున చెప్పుకుంటున్నాము గాని ఇవన్నీ దేశ ప్రజలు చూస్తూ వస్తున్న విషయాలే. అయినప్పటికీ గుర్తు చేసుకోవటం ఎందుకంటే, ప్రస్తుత ఆశనిరాశలు ఉద్వేగాలకు రాజకీయ పార్టీల వలె ప్రజలు లోను కానక్కర లేదని చెప్పేందుకే. కాకపోతే ఇందుకు ఈ ఏడాదిలో కర్ణాటకతో ఆరంభించి మరో మూడు అసెంబ్లీలకు జరగ నున్న ఎన్నికల అనంతరం పూర్తిగా కాదుగాని మరి కొద్దిగా స్పష్టత రావచ్చు. అంతవరకు వేచి చూడటం మంచిది.

ఇక వర్తమానానికి వస్తే, ముఖ్యంగా గుజరాత్‌లో బిజెపి బలం తగ్గటం, రాజస్థాన్, యుపి, బీహార్ ఉప ఎన్నికలలో ఆ పార్టీ పరాజయాలు ఎన్‌డిఎకు నిరుత్సా హాన్ని, ప్రతిపక్షాలకు ఉత్సాహాన్ని కలిగించటం కనిపిస్తున్నదే. వీటన్నింటిమధ్య త్రిపుర ఓటమి ఆ ఉత్సాహాన్ని కొంత తగ్గించటం నిజమే అయినా అదెక్కడో మారుమూల రాష్ట్రం కావటం, అక్కడ ఓడింది వామపక్షాలు అవట మన్నది ఆ ఓటమి ప్రభావం సాధారణ రూపంలో ప్రతిపక్షాలపై కొంత తక్కువగా ఉంది. వీటిన్నంటి చివరన ప్రస్తుతం ప్రతిపక్ష శిబిరంలో మంతనాలు చురుకుగా మొదలయ్యాయి. వచ్చేనెలలో జరిగే కర్ణాటక ఎన్నికల వరకు ఇది ఇట్లాగే ఉంటుంది. అక్కడ ఎవరు గెలుస్తారనే దానిని బట్టి ఇవి మరింత వేగాన్ని అందుకోవటం లేదా మందగించటమన్నది ఆధారపడి ఉంటుంది.

దానినట్లుంచి, వర్తమానపు మంతనాల గురించి కొంత చెప్పుకోవాలి. ఇందులో ఒక ధ్రువం కాంగ్రెస్, మరొక ధ్రువం కొన్ని ప్రతిపక్షాలు కాగా, ఇంకా ఎటూ మాట్లాడని వారితో కూడిన మూడవ ధ్రువం ఒకటున్నది. కొద్దిరోజుల పాటు ఢిల్లీలో గడిపిన ఈ రచయితకు అర్థమైనంత మేరకు పరిస్థితి ఈ విధంగా ఉంది. ఎన్నికల కు ముందు, లేదా ఆ తర్వాత కేంద్రస్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉండటం, అందుకు తక్కినవారు అంగీకరించట మన్నది ఒక ప్రశ్న. అయితే అది ఆ పార్టీకి వచ్చే సీట్లు ఎన్ని అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఇతరులు అంగీక రించటంపై మరికొంత ఉంటుంది. ఈ రెండూ ఇప్పటికైతే ప్రశ్నార్థకాలే. తక్కిన పార్టీలలో ఏవి వేరుగా ఒక ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి అదే వేదికనుంచి కాంగ్రెస్ చర్చలు జరుపుతాయి, అసలు ఆ ఫ్రంట్ పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయి, అవి కాంగ్రెస్‌ను బలపరచేందుకు సిద్ధపడ తాయా, లేక తమ అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతివ్వాలని షరతు పెడతాయా అన్నది మరొక ప్రశ్న. ఈ ప్రశ్న ఎవరికి రాగల సీట్లు ఎన్ని అనే దానిని బట్టి కొంత ఉన్నా, ఒకవేళ తక్కువ వచ్చినప్పటికీ తమ అభ్యర్థికి కాంగ్రెసే మద్దతు ఇవ్వాలనే వైఖరిని వీరు తీసుకుంటే ఆశ్చర్యం ఉండదు. ఎంతసేపూ ఇతర పార్టీలే కాంగ్రెస్‌కు అధికార మివ్వాలా అన్నవాదన గతంలోనూ ఉండటం తెలిసిందే. పైగా ఇపుడు రాహుల్ గాంధీ పట్ల ఇతరులకు గురి అన్నది లేదు గనుక ఈ వాదన ఈసారి మరింత బలపడుతుంది.

కాంగ్రెస్ మరో మెట్టు దిగుతుందా అనే ప్రశ్న తలెత్తు తున్నది సరిగా ఇక్కడనే. గతంలో కాంగ్రెస్ పార్టీ తన ఏక ఛత్రాధిపత్య వైభవాన్ని కోల్పోయిన తర్వాత, ఇతరులతో కలిసి ఉమ్మడికూటమి ప్రసక్తి లేదని, తమ ప్రభుత్వాన్ని తక్కిన పార్టీలు బయటి నుంచి బలపరచాలని అంటూ కొండకొమ్మున కూర్చోవటం, కాని అది సాగదని అర్థం కావటంలో విధిలేక మెట్టు దిగివచ్చి యుపిఎ రూపంలో అధికారాన్ని పంచుకోవటం తెలిసిందే. ఈసారి అవసర మైన పక్షంలో ఇంకొక మెట్టుదిగి, ఏ విధంగానైనా బిజెపిని ఆపటం అవసరం గనుక తమకు కాస్త ఎక్కువ సీట్లు వచ్చినా సరే ప్రధాని పదవి కోసం పట్టుబట్టకుండా ఇతర పార్టీల కూటమి అభ్యర్థిని బలపరచగలదా? అందుకు కూడా ఆ పార్టీ నాయకత్వం మానసికంగా ఇప్పటి నుంచే సిద్ధం కావటం మంచిదేమో.

                                                                                                                 టంకశాల అశోక్ 9848191767