Wednesday, April 24, 2024

మస్క్ సంపదతో ప్రపంచ ఆకలి అంతమవుతుందా?

- Advertisement -
- Advertisement -

Will world hunger end with Elon musk wealth?

శ్రీమంతుల సంపద పెరిగి పోతుండడంతో క్షుద్బాధపై మళ్లీ మొదలైన చర్చ

న్యూఢిల్లీ: ఎలాన్ మస్క్‌లాంటి ప్రపంచ కుబేరులు తమ సంపదలో కొంత భాగాన్ని వదులకుంటే ప్రపంచంలో క్షుద్బాధను శాశ్వతంగా నివారించవచ్చంటూ ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్లుఎఫ్‌పి) డైరెక్టర్ ఇటీవల ఓ ఇంటర్వూలో చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చకు దారి తీస్తున్నాయి. డబ్లు ఎఫ్‌పి డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలను ఎలాన్ మస్క్ సవాలు చేశారు. తన సంపదలో 6 బిలియన్ డాలర్లు ఇస్తే ప్రపంచ క్షుద్బాధ ఎలా పరిష్కారమవుతుందో చెప్పాలని మస్క్ ఓ ట్వీట్‌లో సవాలు చేశారు. దీంతో ఇప్పుడు దీనిపై మేధావుల్లో చర్చ మొదలైంది.

అసలు వివాదం ఏమిటి?

జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్ లాంటి ప్రపంచ కుబేరులు తమ వద్ద ఉన్న సంపదలో కొంత భాగాన్ని వదులుకుంటే కోట్లాది మంది ఆకలితో ప్రాణాలు కోల్పకుండా కాపాడవచ్చని డబ్లు ఎఫ్‌పి డైరెక్టర్ డేవిడ్ బీస్లీ గత వారం ఓ ఇంటర్వూలో చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి బీజం వేశాయి. ముఖ్యంగా 6 బిలియన్ డాలర్లు గనుక ఉంటే 4.2 కోట్ల మంది ఆకలి చావులు చావకుండా కాపాడవచని ఆయన అన్నారు. ఈ మొత్తం ఎలాన్ మస్క్ సంపదలో కేవలం 2 శాతం మాత్రమే కావడం గమనార్హం. దీనికి స్పందించిన ఎలాన్ మస్క్ తన సంపదతో ప్రపంచంలో క్షుద్బాధ శాశ్వతంగా ఎలా అంతమవుతుందో చెప్తే తన కంపెనీలో తనకున్న షేర్లన్నిటినీ అమ్మేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ఆయనకు ప్రతి సవాలు విసిరారు.

అయితే ఈ వివాదం వెనుక అసలు కారణం వేరే ఉంది. గత ఏడాది కొవిడ్ మహమ్మారి వెలుగు చూసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పేదరికంలోకి జారుకోగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేరుల ఆస్తులు మాత్రం గణనీయంగా పెరిగాయి. చాలా సంస్థల ఆదాయాలు తగ్గినా వీరి ఆదాయాలు పెరగడం చూసిన తర్వాత సంపన్నులు తాము సంపాదించిన సంపదలో కొంత భాగం తిరిగి జనానికి ఇచ్చేయాలనే డిమాండ్ బలంగా వినిపించడం మొదలైంది.

క్షుద్బాధ అంతానికి ఎంత కావాలి?

మస్క్ సంపదలో 6 బిలియన్ డాలర్లు ఇస్తే ప్రపంచంలో క్షుద్బాధ శాశ్వతంగా పరిష్కారం కాదనే మాట వాస్తవమే. కానీ తక్షణం ఆకలి సంక్షోభం రాకుండా అడ్డుకోవడానికి మాత్రం అది తోడ్పడుతుంది. దాదాపు ఏడాది పాటు 4.2 కోట్ల మంది కడుపు నింపడానికి అది తోడ్పడుతుందని ఓ అంచనా. ప్రపంచ క్షుద్బాధ, ఇతర పేదరికాలను అంతమొందించడానికి ఎంత సొమ్ము అవసరమనే దానికి రకరకాలు అంచనాలున్నాయి. 2030 నాటికి ప్రపంచ క్షుద్బాధను అంతం చేయడానికి 330 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని కొంత మంది పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

కాగా ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన మానవతా సంక్షోభం అయిన ఆకలిని అంతం చేయడానికి సంపద పునః పంపిణీ జరగాలన్న డిమాండ్ రావడం ఇదే మొదటి సారి కాదు. శ్రీమంతులు తమ సంపదలో కొంత భాగాన్నిత్యాగం చేస్తే ఎంత ఆహారం, వైద్య సదుపాయాలు, ఇతర మౌలిక సదుపాయాలు సృష్టించవచ్చో ఈ అంశంపై ఉద్యమాలు చేస్తున్న వారు గణాంకాలతో సహా చెబుతూనే ఉన్నారు. ఉదాహరణకు ఆక్స్‌ఫామ్‌లాంటి సంస్థలయితే ధనవంతులకు, పేదలకు మధ్య అంతరం ఎలా పెరిగి పోతోందో, శ్రీమంతులపై అధిక పన్నులు వేయడం వల్ల పేదల ఆకలిని ఎలా తీర్చవచ్చో విశ్లేషణాత్మక నివేదికలు తరచూ వెల్లడిస్తూనే ఉన్నాయి.

దాతల సొమ్ముతో ఆకలి అంతమవుతుందా?

క్షుద్బాధ సమస్య అంతం చేయడానికి శ్రీమంతులు, దాతలు ఇచ్చే సంపదతో సాధ్యమవుతుందా? అనేది అసలు ప్రశ్న. దీనికి ఒక్కొక్కరు ఒక్కో వాదన వినిపిస్తారు. కొంతమంది అయితే సంపన్నులు సంపద పోగేయడం వల్లనే ఆర్థిక అంతరాలు పెరిగి పోయాయని వాదిస్తారు. మరో విధంగా చెప్పాలంటే సంపన్నులు సంపదను పోగేయడం పెరిగి పోవడం వల్లనే కోట్లాది మంది వద్ద జీవించడానికి అవసరమైన నిత్యావసరాలు కొనడానికి కూడా డబ్బులు లేకుండా పోతున్నాయనేది వారి వాదన. అందుకే వారు సంపద పునః పంపిణీ జరగాలని వారు అంటున్నారు.

అయితే ఈ వాదనతో ఏకీభవించని వారూ చాలా మందే ఉన్నారు. పేదలు జీవించడానికి అవసరమైన సొమ్మును సంపాదించలేక పోవడం వల్లనే పేదరికం పెరిగిపోతోందే తప్ప సంపన్నుల వల్ల కాదనేది వారి వాదన. అంతే కాదు మానవతా సాయం ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారం మాత్రమే అవుతుందనేది వారి అభిప్రాయం. అంతేకాదు,ఇలా దాతల ఇచ్చిన సొమ్ము పంపిణీలో అవినీతి చోటు చేసుకునే ప్రమాదమూ లేకపోలేదని కూడా వారు వాదిస్తున్నారు. ఎంత ఎక్కుగా సాయం అందితే అంతగా అవినీతికి ఆస్కారం ఉంటుందనేది వారి వాదన. ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ ప్రపంచ కుబేరులుల తాము సంపాదించిన సంపదలో కొంత భాగమైనా సమాజం కోసం ఖర్చు చేయాలనే వాదన మాత్రం రోజురోజుకు బలపడుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News