Home జాతీయ వార్తలు ఉమ్మడి పౌరసత్వ బిల్లు?

ఉమ్మడి పౌరసత్వ బిల్లు?

Parliament

 

నేటి నుంచి శీతాకాల పార్లమెంట్

కశ్మీర్, ఆర్థిక పరిస్థితిపై చర్చ!
అస్త్రశస్త్రాలతో విపక్షాలు రెడీ
సీట్లు మారిన శివసేన

న్యూఢిల్లీ : పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం (నేటి) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా పలు జాతీయ స్థాయి కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. ఈసారి సమావేశాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదింప చేసుకోవాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. కేంద్రం తన కాషాయ అజెండాతోనే ఈ ప్రతిపాదన తీసుకువచ్చిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీని వల్ల జాతీయ సమగ్రత లోపిస్తుందని విమర్శిస్తున్నాయి. పౌరసత్వ బిల్లు బిజెపి ప్రధాన నినాదంగా విధానంగా నిలిచింది. పొరుగుదేశాల నుంచి వచ్చే ముస్లిమేతరులకు భారత పౌరసత్వాన్ని కల్పించేందుకు పౌరసత్వ బిల్లును ప్రతిపాదించారు. సోమవారం నుంచి ఆరంభం కాబోయే రెండో సెషన్‌లో ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం అజెండాలోకి తీసుకువచ్చింది. దీనిపై వాడిగా వేడిగా చర్చలు జరిగే అవకాశం ఉంది.

ప్రత్యేకించి కశ్మీర్‌లో పరిస్థితి, ఆర్థిక మందగమనం, నిరుద్యోగం వంటి కీలక సమస్యలపై ప్రధాన ప్రతిపక్షాలు ఈ సమావేశాలలో ప్రభుత్వంపై దాడికి దిగనున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పౌరసత్వ బిల్లు ఆమోదం కోసం రంగంలోకి దిగనుంది. మరికొన్ని ఆర్డినెన్స్‌లను బిల్లు రూపంలో తీసుకువచ్చి ఆమోద ప్రక్రియకు ముందుంచాలని సంకల్పించింది. ప్రధాని మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న రెండో సెషన్ ఇది. దేశంలో కార్పొరేటు సంస్థలకు పన్ను రాయితీలు కల్పిస్తూ తీసుకువచ్చిన ఆర్డినెన్స్, ఇ సిగరెట్లపై నిషేధం ఉత్తర్వుల ఆర్డినెన్స్ స్థానంలో బిల్లులు ప్రవేశపెట్టనున్నారు.

దేశంలో ఆర్థిక పరిస్థితి ప్రమాద ఘంటికలను కట్టడి చేసేందుకు నూతన, స్వదేశీ ఉత్పత్తి రంగ కంపెనీలకు కార్పొరేటు పన్నుల స్థాయిని తగ్గిస్తూ సెప్టెంబర్‌లో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. దీని మేరకు ఆదాయపు పన్ను చట్టం, ఫైనాన్స్ యాక్ట్ 2019ని సవరించే ప్రతిపాదనలు కూడా చేశారు. అయితే కొన్ని కార్పొరేటు సంస్థలకు మేలు చేయాలనే ఉద్ధేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా పన్నులను తగ్గించిందని ప్రతిపక్షాలు విమర్శిస్తూ వస్తున్నాయి. కశ్మీర్ అంశంపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా డిటెన్షన్, ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో మాజీ ఆర్ధిక మంత్రి, ఎంపి చిదంబరం జైలు పాలయిన దశలో ఈ పార్లమెంట్ సెషన్ జరుగుతోంది.

అయోధ్య, రాఫెల్ తీర్పుల తరువాత…
ఈసారి పార్లమెంట్ సమావేశాలకు ప్రత్యేకత ఉంది. అత్యంత కీలకం, సంక్లిష్టమైన అయోధ్య వ్యాజ్యంపై సుప్రీంకోర్టు తీర్పు ఇటీవలే వెలువడింది. ఇక రాఫెల్ యుద్ధ విమానాలపై ప్రభుత్వానికి క్లీన్‌చిట్ ఇస్తూ కూడా తీర్పు వచ్చింది. ఈ రెండు అంశాలను అధికార పక్షం తనకు అనుకూలంగా వినియోగించుకుంటుందని విశ్లేషిస్తున్నారు. గత పార్లమెంట్ సెషన్ పలు విధాలుగా ఫలప్రదంగా మారింది. తక్షణ ట్రిపుల్ తలాక్ పద్ధతికి దిగే వారికి శిక్షలు విధించే బిల్లుకు ఆమోదం దక్కింది.

స్పీకర్ బిర్లాకు రెండో పరీక్ష
పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత స్పీకర్‌గా ఓం బిర్లా రెండో సారి సమావేశాల నిర్వహణకు దిగుతున్నారు. సమావేశాలు సజావుగా సాగేందుకు, ఇంతకు ముందటి లాగానే ఫలప్రదం అయ్యేందుకు అన్ని విధాలుగా సహకరించాలని ఆయన ప్రతిపక్షాలు, అధికార పక్షాన్ని కోరారు. శనివారం స్పీకర్ ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీ జరిగింది. తాము వ్యవసాయ రంగ సంక్షోభం, రైతుల కడగండ్లు, జమ్మూ కశ్మీర్ పరిస్థితి, నిరుద్యోగం, అన్నింటికీ మించి ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం నుంచి సమాధానాలు రాబడుతామని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి.

26న రాజ్యాంగ దినోత్సవం
సోమవారం నుంచి ఆరంభం అయ్యే శీతాకాల సమావేశాలు డిసెంబర్ 13 వరకూ ఉంటాయి. ఈ నెల 26న భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉభయ సభల సంయుక్త సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా వివిధ పార్టీల నేతలు ప్రసంగిస్తారు. రాజ్యాంగ దినోత్సవ ప్రత్యేక భేటీ గురించి త్వరలో ప్రభుత్వం కీలక ప్రకటన వెలువరించే అవకాశముంది.

Winter session of Parliament from Monday