Home తాజా వార్తలు విప్రో లాభం 2483 కోట్లు

విప్రో లాభం 2483 కోట్లు

Abidali Neemuchwalaక్యూ4లో 38 శాతం వృద్ధి
రూ. 10,500 కోట్ల బైబ్యాక్ ఆఫర్
విప్రో సిఇఒ అబిదాలి నీముచ్‌వాలా వెల్లడి

న్యూఢిల్లీ: బెంగళూరుకు చెందిన విప్రో సంస్థ 2019 క్యూ4(జనవరిమార్చి)లో రాణించింది. సంస్థ నికర లాభం రూ.2,483 కోట్లతో 37.7 శాతం వృద్ధిని సాధించింది. ప్రత్యర్థి సంస్థలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్‌లకు గట్టిపోటీ ఇచ్చిన విప్రో గతేడాది ఇదే సమయంలో రూ.1,803 కోట్ల లాభాన్ని ఆర్జించింది. మొత్తానికి విశ్లేషకుల అంచనాలను కంపెనీ అందుకుంది. కంపెనీ మొత్తం ఆదాయం ఏడాదిఏడాది ఆధారంగా చూస్తే రూ.15,915 కోట్లతో 11 శాతం వృద్ధిని సాధించింది. కంపెనీ రూ.10,500 కోట్ల బైబ్యాక్ ప్లాన్‌ను ప్రకటించింది.

సంస్థ ఆదాయం రూ.15,006 కోట్లతో 8.9 శాతం వృద్ధిని నమోదు చేయగా, గతేడాది ఇదే సమయంలో ఆదాయం రూ. 13,768 కోట్లుగా ఉంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి(201819) గాను విప్రో నికర లాభం రూ.9,017 కోట్లతో 12.6 శాతం వృద్ధిని సాధించగా, అలాగే ఆదాయంలో రూ.58,584 కోట్లతో 7.5 శాతం వృద్ధని సాధించింది. విప్రో సిఇఒ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అబిదాలి నీముచ్‌వాలా మాట్లాడుతూ, తమ టీమ్ సంస్థ వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేసిందని, దీంతో ఏడాదిఏడాదికి త్రైమాసికాల్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తోందని అన్నారు. ఆరోగ్యకరమైన ఆర్డర్ బుక్‌తో వృద్ధిలో పటిష్టమైన పునాది వేశామని.. డిజిటల్, సైబర్ సెక్యూరిటీ, ఇంజినీరింగ్ సేవలు, క్లౌడ్ వంటి విభాగాల్లో పెట్టుబడులను కొనసాగిస్తామని అన్నారు. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో విప్రో షేరు విలువ 2 శాతం నష్టపోయి రూ.281.60 వద్ద స్థిరపడింది.

బైబ్యాక్ ఆఫర్
ఐటి దిగ్గజం రూ. 10,500 కోట్ల బైబ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. 15 నెలల్లో బైబ్యాక్ ప్రకటించడం ఇది రొండోసారి కావడం విశేషం. షేరుకు రూ.325 చొప్పున వాటాదారుల నుంచి దాదాపు 32.3 కోట్ల షేర్లను సంస్థ కొనుగోలు చేయనుంది. ఇది విప్రోకు మూడో బైబ్యాక్ కార్యక్రమం, 2016 సంవత్సరంలో రూ.2500 కోట్లు, 2017 నవంబర్‌డిసెంబర్ కాలంలో రూ.11,000 కోట్ల బైబ్యాక్‌ను కంపెనీ చేపట్టింది. సెక్యూరిటీ ఉల్లంఘన విప్రోలో ఇటీవల సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘన వల్ల సంస్థకు చెందిన ఉద్యోగుల ఖాతాలపై ప్రభావం పడనుంది. దీంతో కంపెనీ ప్రతిష్టకు స్వల్పకాలిక ప్రభావం ఏర్పడనుంది.

Wipro Q4 profit jumps to Rs 2,483 Crore