Wednesday, April 24, 2024

విజ్డన్ క్రికెటర్ ఆఫ్‌ది ఇయర్‌గా బెన్ స్టోక్స్

- Advertisement -
- Advertisement -

 Ben Stokes

 

లండన్: స్టార్ ఆల్‌రౌండర్, ప్రపంచకప్ హీరో బెన్ స్టోక్స్ అరుదైన ఘనతను సాధించాడు. 2020 సంవత్సరానికి సంబంధించి ప్రతిష్టాత్మకమైన విజ్డన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్‌ది ఇయర్ అవార్డును బెన్ స్టోక్స్ సొంతం చేసుకున్నాడు. కిందటి ఏడాది సొంత గడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో స్టోక్స్ అసాధారణ ఆల్‌రౌండ్‌షోతో తన జట్టును విశ్వవిజేతగా నిలిపాడు. అతని ప్రతిభకు గుర్తింపుగా ప్రతిష్టాత్మకమైన విజ్డన్ క్రికెటర్ ఆఫ్‌ది ఇయర్ అవార్డుల లభించింది. మరోవైపు మూడేళ్లుగా ఈ అవార్డును సాధిస్తూ వచ్చిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి నిరాశే మిగిలింది. ఇక, ప్రపంచకప్‌తో పాటు యాషెస్ సిరీస్‌లో స్టోక్స్ అసాధారణ రీతిలో రాణించాడు. ఇటు బంతితో అటు బ్యాట్‌తో అద్భుత ప్రతిభను కనబరిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో చారిత్రక బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.

క్లిష్ట సమయంలో కూడా కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఇంగ్లండ్ ట్రోఫీని సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో స్టోక్స్‌కు క్రికెట్ నోబెల్‌గా భావించే విజ్డన్ పురస్కారం లభించింది. కాగా, వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు ఆండ్రీ రసెల్ టి20 క్రికెటర్ ఆఫ్‌ది ఇయర్ అవార్డును సాధించాడు. అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో రసెల్ అసాధారణ రీతిలో రాణించాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో విండీస్‌కు సంచలన విజయాలు సాధించాడు. అతని ప్రతిభను గుర్తించి నిర్వాహకులు టి20 క్రికెటర్ అఫ్‌ది ఇయర్ అవార్డును ప్రకటించారు. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎల్లిస్‌పెర్రీ విజ్డన్ లీడింగ్ ఉమెన్ క్రికెటర్ ఆఫ్‌ది ఇయర్‌గా నిలిచింది. మరోవైపు ఇంగ్లండ్ యువ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్, ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ పాట్ కమిన్స్, ఎల్లిస్ పెర్రీ, మార్నస్ లబూషేన్, సిమన్ హర్మర్ విజ్డన్ పురస్కారాలను అందుకున్నారు.

Wisden Cricketer of the Year – Ben Stokes
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News