Home సినిమా సినీ ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ

సినీ ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ

 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధించడంతో కెసిఆర్, కెటిఆర్‌లకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా పలువురు తారలు ఈ అగ్ర నేతలను అభినందించారు.

 

 

టాలీవుడ్ సూపర్‌స్టార్ కృష్ణ టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌కు హృదయపూర్వక విజయాభినందనలు తెలియజేశారు. కృష్ణ మాట్లాడుతూ “నాలుగున్నరేళ్ల కాలం పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన తర్వాత టిఆర్‌ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలలో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావడం చాలా గొప్ప విషయం. కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ ప్రజలకు ఎంతో మేలు చేశాయి. అందుకే అన్ని వర్గాల ప్రజలు ఆయనకు ఈ అఖండ విజయాన్ని అందించారు. మళ్లీ రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న చంద్రశేఖర్ రావుకు నా హృదయపూర్వక అభినందనలు”అని అన్నారు.
టిఆర్‌ఎస్ ఘన విజయం సాధించడంతో కెటిఆర్ ట్వీట్ చేసిన ఒక ఫొటో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. కెటిఆర్ గన్ గురి పెట్టినట్లుగా ఉన్న ఆ ఫొటోకు ఎంతో మంది కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఆ ఫొటోను మంచు మనోజ్ పోస్ట్ చేసి… “ఒక్క బుల్లెట్‌తో అంత మందా… ఎప్పటికీ మరచిపోలేని షాట్ ఇది. టిఆర్‌ఎస్ గెలుపు సందర్భంగా కెటిఆర్, కెసిఆర్‌కు కంగ్రాట్స్. మీరు భవిష్యత్తులో తెలంగాణను మరింతగా అభివృద్ధి చేస్తారు… మిమ్మల్ని ప్రజలు అభిమానిస్తుంటారు”అని కామెంట్ చేశారు. కెటిఆర్ ఫొటోపై ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ స్పందించారు. “ఈ ఒక్క ఫొటో చాలు… ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్పడానికి. కెటిఆర్‌కు శుభాకాంక్షలు”అని పేర్కొన్నారు. ఈ ఫొటోపై దర్శకుడు హరీశ్ శంకర్ కూడా కామెంట్ చేశారు. “ఈ ఫొటో ఆత్మవిశ్వాసానికి కొత్త అర్థం చెబుతోంది. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కెటిఆర్ కొత్త ఫొటోను పెట్టారు”అని ఆయన చెప్పారు.
ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఘన విజయం సాధించడంతో ప్రముఖ నటులు కృష్ణంరాజు మాట్లాడుతూ “చారిత్రాత్మక విజయం సాధించినందుకు శుభాకాంక్షలు కెసిఆర్. మీ ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు హ్యాట్సాఫ్. మీరు ఇలాగే ఎదగాలని కోరుకుంటున్నా. దేవుడి ఆశీర్వాదాలు మీకు ఎప్పుడూ ఉంటాయి”అని అన్నారు. మంచు లక్ష్మి మాట్లాడుతూ “తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన టిఆర్‌ఎస్ మరోసారి అధికారం దక్కించుకుంది. ప్రజల హృదయాలను గెలుచుకుంది. కెటిఆర్, కెసిఆర్‌కు శుభాకాంక్షలు. మీ పాలనలో మరో ఐదేళ్లు తెలంగాణ ఎలా ఉండబోతోందో చూడాలని ఉంది”అని పేర్కొన్నారు.
డా.ఎం.మోహన్‌బాబు మాట్లాడుతూ “ఎన్నికలకు ముందు ఫిలింనగర్ దైవ సన్నిధానం ప్రాంగణంలో కెసిఆర్ గెలవాలని కోరుకున్నాను. తథాస్తు దేవతలు తథాస్తు అన్నారు. ప్రజలు అద్భుతమైన, అనితరసాధ్యమైన విజయాన్ని అందించారు. ఇది మీకే సంభవం కెసిఆర్. మీ విజయ పరంపర ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. ఎన్‌విఆర్ సినిమా అధినేత ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ “తెలంగాణలో టిఆర్‌ఎస్ ఘన విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా కెసిఆర్‌కు ‘2.0’ యూనిట్ అభినందనలు తెలియజేస్తోంది. ఈ ఎన్నికల్లో కెసిఆర్ ఎలా దూసుకెళ్లారో… మా ‘2.0’ సినిమా కూడా అలాగే విశేష ప్రేక్షకాదరణతో దూసుకెళ్తోంది. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం డబ్బింగ్ సినిమాల చరిత్రలోనే రికార్డు సృష్టిస్తోంది”అని అన్నారు.
స్టార్ హీరో, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ “తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కె.చంద్రశేఖర్‌రావుకు హృదయపూర్వక శుభాభినందనలు. ఈ తీర్పుతో తెలంగాణ ప్రజల విజ్ఞత మరోసారి రుజువైంది. ఎన్నో త్యాగాలు చేసి తెలంగాణను తెచ్చిపెట్టిన టిఆర్‌ఎస్‌కు, ఆ పార్టీ అధినేత కెసిఆర్‌కు ప్రజలు పట్టం కట్టి తమ మనసులోని మాటను మరోసారి చాటి చెప్పారు. ఈ అఖండ విజయానికి సారథులైన కెసిఆర్, ఆయన కుమారుడు కెటిఆర్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను”అని పేర్కొన్నారు.
రామజోగయ్యశాస్త్రి మాట్లాడుతూ “కెసిఆర్, కెటిఆర్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ విజన్, కృషి విజయాన్ని అందించాయి. క్లీన్‌స్వీప్‌కు మీరు అర్హులు. మరో ఐదు సంవత్సరాలు భద్రంగా మీ చేతుల్లో ఉన్నాయి”అని పేర్కొన్నారు.
ప్రముఖ తెలంగాణ దర్శక, నిర్మాత అల్లాణి శ్రీధర్ మాట్లాడుతూ “తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుందని అక్టోబర్‌లోనే చెప్పాను. కెసిఆర్ రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, నిర్వహించిన అభివృద్ధి పనుల వల్లే టిఆర్‌ఎస్ పార్టీ తిరుగులేని మెజార్టీని సంపాదించింది. టిఆర్‌ఎస్ కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందడం ఖాయం. ఇక తెలంగాణ సినిమా అభివృద్ధికి కెసిఆర్ మరిన్ని చర్యలు తీసుకుంటారని, తెలంగాణ సినిమాకు ఓ రూపు తీసుకొస్తారని ఆశిస్తున్నాం”అని అన్నారు. సుబ్బరాజ్ మాట్లాడుతూ “టిఆర్‌ఎస్ పార్టీకి శుభాకాంక్షలు. మీ నాయకత్వం, అంకితభావం తెలంగాణ ప్రజల నమ్మకాన్ని పూర్తిగా గెలుచుకున్నాయి”అని అన్నారు.
రాజ్‌తరుణ్ మాట్లాడుతూ “క్లీన్‌స్వీప్… టిఆర్‌ఎస్ అద్భుతమైన మెజార్టీతో గెలుపొందింది. శుభాకాంక్షలు కెటిఆర్‌”అని చెప్పారు.
సూపర్‌స్టార్ మహేష్‌బాబు మాట్లాడుతూ “విజయం సాధించినందుకు అభినందనలు కెటిఆర్. ఈ విజయానికి నువ్వు అర్హుడివి. ప్రజల వ్యక్తిగా కొనసాగు. ఆల్ ది బెస్ట్‌”అని అన్నారు.
సందీప్ కిషన్ మాట్లాడుతూ “అద్భుత విజ యం సాధించిన కెసిఆర్, కెటిఆర్‌కు శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మారు”అని అన్నారు.
నాని మాట్లాడుతూ “కెటిఆర్, టిఆర్‌ఎస్ పార్టీ నేతలకు శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలు వారి పాత్రను నిర్వహించారు. ఇక అద్భుతమైన భవిష్యత్తు కోసం మీరు పనిచేస్తారని మాకు తెలుసు”అని చెప్పారు.
రెండోసారి తెలంగాణ రాష్ట్రంలో విజయ పతాకాన్ని ఎగురవేసిన టిఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావును మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అభినందించింది. అందరి అంచనాలను మించి అఖండ విజయాన్ని సాధించిన ఘనత కెసిఆర్‌కు దక్కిందని ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ “మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రజతోత్సవ సంవత్సరం సందర్భంగా గోల్డేజ్ హోమ్ నిర్మాణాన్ని ప్రారంభించాలనుకుంటున్నాము. దీనికి కెసిఆర్, కెటిఆర్, హరీశ్‌రావు, కవిత, తలసాని శ్రీనివాస యాదవ్‌ల సహకారం లభిస్తుందని భావిస్తున్నాము. త్వరలోనే ఈ విషయమై కెసిఆర్‌ను కలుస్తాం”అని అన్నారు. ‘మా’ కోశాధికారి పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ “చెప్పిన ఫిగర్‌ను రీచ్ కావడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో… కెసిఆర్ మ్యాజిక్ ఫిగర్‌ను దాటి ఎన్నికల్లో భారీ మెజారిటీని సాధించారు”అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బెనర్జీ, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు.
రామ్ మాట్లాడుతూ “కెసిఆర్, కెటిఆర్‌లకు అభినందనలు. మీ ఆత్మవిశ్వా సం అద్భుతం. మీకు దక్కాల్సిన విజయమే ఇది. మీరు చేపట్టనున్న మరి న్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎదురుచూస్తున్నాం”అని తెలిపారు.

Wishes To KCR From Tollywood film personalities

Telangana News