Tuesday, March 21, 2023

కడుపులోనే కడతేర్చుతున్నారు…

- Advertisement -

medical*కడుపులోనే ఆడపిల్లను చంపేస్తున్న వైనం

*యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు 

*గల్లీ గల్లీలో డయాగ్నస్టిక్ సెంటర్లు

*కాసుల మత్తులో జోగుతున్న వైద్య, ఆరోగ్యశాఖ 

మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గల్లీ గల్లీలో కిల్లి కొట్టు మాదిరిగా వారానికి ఒక డయాగ్నస్టిక్ సెంటర్లు పుట్టుకొస్తున్నాయి. కాసుల మత్తులో వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగంతో పాటు ప్రభుత్వ శాఖలు అటువైపు కన్నెతికూడా చూడకపోవడంతో నకిలీ డాక్టర్లు, ఆర్‌ఎంపి వైద్యులతో పాటు కార్పొరేట్ ఆసుపత్రులలో పనిచేస్తున్న డాక్టర్లు సైతం అమాయక ప్రజల జీవితాలతో చెలగాటం అడుకుంటూ అడ్డమైన పరీక్షల పేరుతో లూటీ చేసి అందరు కలసి పంచుకుంటున్నారు. హైదరాబాద్ మహానగరానికి ఆనుకోని ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతో పాటు వికారాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో సైతం వారానికి ఒక కేంద్రం చొప్పున డయాగ్నస్టిక్ కేంద్రాలు ఏర్పాటు అవుతున్న వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం కనీసం పట్టించుకోవడం లేదు. రంగారెడ్డి జిల్లాలో దాదాపు వెయ్యికి పైగా డయాగ్నస్టిక్ కేంద్రాలు నడుస్తుండగా అందులో కేవలం 220 కేంద్రాలకు మాత్రం అనుమతులు ఉన్నాయంటే పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. మేడ్చల్ జిల్లాలో సైతం వెయ్యికి పైగా నడుస్తుండగా ఇక్కడ వందలోపే అనుమతులు ఉండటం విశేషం. వికారాబాద్ జిల్లాలో మరింత అడ్డగోలుగా వ్యవహారం సాగుతుంది. డయాగ్నస్టిక్ కేంద్రాలలో పరీక్షలు నిర్వహించడానికి అనుభవం కలవారు అవసరం ఉండగా ఇక్కడ మాత్రం ఆర్‌ఎంపిలు, నకిలీ డాక్టర్లు సకల పరీక్షలు నిర్వహిస్తున్నారు. రేడియాలజిస్టులు చేయాల్సిన స్కానింగ్ పదవ తరగతి పాస్ కాని వారు చేస్తున్న కేంద్రాలు రంగారెడ్డి , మేడ్చల్ జిల్లాలో వందల సంఖ్యలో ఉన్నాయి.
కడుపులోనే చిదిమేస్తున్నారు…
అడ్డగోలు సంపాదనకు అలవాటు పడిన డయాగ్నస్టిక్ కేంద్రాల నిర్వహకులు రోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు నగర శివారులోని పలు మండలాల్లో జ్వరం వస్తే చాలు తమకు కమీషన్ ఇచ్చే డయాగ్నస్టిక్ కేంద్రం లెటర్ పాడ్‌పై రోగానికి సంబంధం ఉన్న లేకపోయిన పరీక్షలు పది రాసి చేయించుకు రండి రిపోర్టులు వచ్చాక చికిత్స చేద్దాం అంటూ రాస్తున్నారు. ప్రా ణం మీద భయంతో రోగులు, బంధువులు అప్పులు చేసి పరీక్షలు నిర్వహించుకుని వచ్చాక తీరా ఏమిలేదు…రెండు రోజులు విశ్రాంతి తీసుకోండి అంటూ తాపీగా చెప్తున్నారు. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలో డయాగ్నస్టిక్ కేంద్రాల మాఫియా భారీ భాగోతం చేస్తుంది. డయాగ్నస్టిక్ కేంద్రం ముందు భారీ అక్షరాలతో ఇక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు చేయబడవు.. స్కానింగ్ చేయరు.. అంటూ అక్షరాలతో బోర్డులు పెట్టి మరి యథేచ్ఛగా స్కానింగ్ చేసి కడుపులోనే చిన్నారులను చిదిమేస్తున్నారు. ప్రత్యేకంగా బోర్డులు పెట్టిన వాటిలో ఇలాంటి దందా మరింత జోరుగా సాగుతుంది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని యాచారం, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, శంషాబాద్, చేవెళ్ళ, శంకర్‌పల్లి, మొ యినాబాద్, హయత్‌నగర్‌లతో పాటు నగర శివారులో గత పలు కేంద్రాలలో యథేచ్ఛగా స్కానింగ్ చేయడంతో పాటు అందుబాటులో ఉన్న ఆర్‌ఎంపిలు అబార్షన్‌లు సైతం చేస్తున్నారు. డయాగ్నస్ట్టిక్ కేంద్రాలలో స్కానింగ్ చేసే సమయంలో కనీసం పేరు, ఊరు కూడా నమోదు  చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు లింగ నిర్ధారణ పరీక్షలకు అడ్డగోలుగా వసూళ్లు చేస్తున్నారు. రంగారెడ్డి, మహబుబ్ నగర్, నల్గొండ జిల్లాల సరిహద్దు ప్రాంతం మాల్, యాచా రం ప్రాం తంలో ఇటీవల వెలుగు చూసిన దారుణ సంఘటనల అనంతరం రాచకొండ పోలీసులు నలుగురు ఆర్‌ఎంపిలపై కేసులు నమోదు చేసి ఆదుపులోకి తీసుకున్నా ఇలాం టి దందాలు చేస్తున్న నీచులు రాచకొండ, సైబారాబాద్ కమిషనరేట్‌ల పరిధిలో వందల సంఖ్యలో ఉ న్నారు. వికారాబాద్ జిల్లాలోని తాండూర్ ప్రాంత ంలో సైతం స్కానింగ్ కేంద్రాలలో ఇలాంటి తంతు కొనసాగుతుంది. గిరిజనులు అధికంగా ఉన్న ప్రాంతాలలో ఇ లాంటి కేంద్రాలు అడ్డగోలుగా పుటుకొస్తుండటం వెనుక మతలబు ఏమిటో అధికారులకే తెలియాలి.
జాడలేని అధికారులు..
లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేవారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ , వికారాబాద్ జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో వేయి మంది పురుషులకు 925 మహిళలు ఉండగా రోజు రోజుకు మరింత తగ్గుతుండటం వెనుక ఇలాంటి స్కానింగ్ సెంటర్‌ల పుణ్యమే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నవారికి పది వేయిల రూపాయల జరిమానతో పాటు మూడు సంవత్సరాల జైలుశిక్ష పడే అవకాశం ఉన్న అసలు మన యంత్రాంగం అటువైపు కన్నెతి కూడ చూసి కేసులు నమోదు చేయడం లేదు. తమకు పిర్యాదులు వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పడం తప్ప అడ్డగొలుగా వెలుస్తున్న డయాగ్నస్టిక్ కేంద్రాలను తనికీ చేసి చర్యలు చేపట్టే పరిస్థీతులు తమకు లేవని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles