Home ఖమ్మం లంచం లేనిదే ఏ పని మచ్చుకైనా ముందుకు సాగదు

లంచం లేనిదే ఏ పని మచ్చుకైనా ముందుకు సాగదు

Without a bribe, no work will go forward

పినపాక : లంచం అడిగేవారిని చెప్పు తీసుకుని కొట్టండి అంటూ సిఎం కెసిఆర్‌తో సహా పలువురు ప్రముఖులు అన్నారు. అంత వరకు బాగానే ఉంది… లంచం అడిగిన వారిని చెప్పుతో ఎవరు కొడతారన్నది ప్రశ్నార్థకం… లంచం ఇవ్వనిదే పని చేయని అధికారులున్న ఈ రోజుల్లో చెప్పు తీసుకుని ఓ అధికారిని కొడితే తమపై ఎలాంటి కేసులు పెడతారో అనే భయాందోళనలో కూడా కొందరు ఉన్నారు. ప్రతి కార్యాలయంలో తనిఖీ ఏదో ఒక రూపంలో పదో పరకో ముట్టజెప్పనిదే ఏ పని చేయడం, ముందుకు కదలదనేది జగమెరిగిన సత్యం… పినపాక, కరకగూడెం ఏజెన్సీ ప్రాంతాల ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మాటలతో తికమక పెడుతూ పనిని ముందుకు సాగనీయకుండా చేస్తూ మధ్యవర్తుల ద్వారా లంచానికి మరిగి పనులు కానిస్తున్నారు. రైతు తన పొలం మార్పుల కొరకు కార్యాలయంలోకి వెళ్లితే రైతుకి సమాధానం చెప్పేవారే అక్కడ ఉండరు. ఒక దళారీ ద్వారా వెళ్లి లంచం ఇస్తే కానీ అప్పుడు పట్టించుకున్న పాపాన పోవట్లేదు అధికారులు… తహసీల్దార్ కార్యాలయంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే గ్రామరెవిన్యూ అధికారులు విఆర్వొలు భూ రికార్డులను తారుమారు చేస్తూ ప్రజలను తికమక పెట్టడంతో పాటు మార్పులు, చేర్పులు, తప్పులు సరి చేసేందుకై గ్రామంలో ప్రతి రైతు నుండి అమ్యామ్యాలు పుచ్చుకుంటూ వారిని జలగలుగా పీల్చుకు తింటున్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి కార్యాలయంలో ఇదే తంతు కొనసాగుతుంది. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో వచ్చిన వర్కులకై ఎటువంటి కమిషన్లు లేకుండా జరుగుతున్నాయా అంటే అది లేదు. విద్యాశాఖ కార్యాలయంలో అదే తంతు… వ్యవసాయశాఖ కార్యాలయంలో సంబంధిత అధికారులు నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేసి రైతులను ఆదుకునే ఆలోచనలోనూ ఏ ఒక్క అధికారి ఉన్నట్టు కనిపించడం లేదు. కోట్ల రూపాయలు పెట్టి బహిరంగంగానే షాపుల్లో నకిలీమందులు విక్రయాలు జరుగుతున్నప్పటికి చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారంటే వారు ఏ లోపాయొప్పందానికి అంగీ కరమయ్యారో అర్థం కాకనే అర్థమవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో బర్త్ అండ్ గెస్ట్‌డ్ సంతకాల కోసం వెళ్లితే అక్కడ సైతం లంచగొండి తనం లేనిదే సంతకం, స్టాంప్ పడదు. మండలంలో గిరిజన సొసైటిల పేరుతో ఇసుక ర్యాంపులు తెచ్చుకుని ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన బినామీ దారులు అధికారులకు అమ్యామ్యాలు ముట్టజెప్పి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నప్పటికి చూసి చూడనట్టుగానే వ్యవహరిస్తున్నారు ఇక్కడి అధికారులు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కార్యాలయంలో చిన్న అధికారుల నుండి పెద్ద అధికారుల వరకు ఏదో ఒక రూపంలో లంచం ఇవ్వనిదే ఏ ఒక్క పని మచ్చుకైనా ముందుకు కదిలే దాఖాలాలు కనిపించని పరిస్థితులు నేటి సమాజంలో కోకోల్లలుగా కనిపిస్తున్నాయి. ఈ లంచం మహామ్మారిని తరిమికొట్టేందుకు సాక్షాత్తు ఆ దేవుడే దిగివచ్చినా సరే కట్టడి చేసే పరిస్థితులు కనిపించడం లేదు.