*ఇక నుంచి మద్యం ధరలను ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు
మన తెలంగాణ/ వికారాబాద్ జిల్లా: మద్యం ధరలను ఎంఆర్‌పి ధరకు మించి విక్రయించకుండా ఎక్సైజ్, ప్రొహిబిషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా మద్యం దుకాణాలలో ఎక్కువగా విక్రయించే 25 మద్యం బాండ్ల ధరలను, 5 బీర్ బ్రాండ్ల ధరల పట్టికను ప్రతి మద్యం దుకాణంలో ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మద్యం దుకాణాలలో జరిగే అవకతవకలు జరుగుకుండా ప్రతి మద్యం దుకాణంలో రెండు సిసి కెమెరాలు ఏర్పాటు చేయించారు.
దుకాణాల్లో మద్యం ధరల పట్టిక ఏర్పాటు
మద్యం దుకాణాలలో ఎక్కువగా విక్రయం జరిగే 25 మద్యం బ్రాండ్లు, ఐదు బీరు బ్రాండ్ల ధరలను మద్యం దుకాణంలో ఏర్పాటు చేసిన పట్టికలో పొందుపర్చనున్నారు. ధరల పట్టిక ఏర్పాటు చేయడం వలన వినియోగదారుడికి ఏ బ్రాండ్ ధర ఎంత ఉన్నదో తెలుసుకోవడం సులువవుతుంది. ప్రతి మద్యం దుకాణంలో గత 12 నెలల నుంచి విక్రయించిన బ్రాండ్ల అమ్మకాలను ప్రామాణికంగా తీసుకుని పట్టికను రూపొందించారు.
లిక్కర్ ప్రైస్ మొబైల్ యాప్‌ను ప్రారంభించిన ఎక్సైజ్ అధికారులు
తెలంగాణ రాష్ట్రంలో విక్రయిస్తున్న 880 మద్యం బ్రాండ్ల ధరలను తెలుసుకోవడానికి లిక్కర్ ప్రైస్ మొబైల్ యాప్‌ను ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రారంభించారు. విస్కీ, బ్రాండీ, రమ్, వోడ్కా తదితర మద్యం బ్రాండ్ల వివరాలను మొబైల్ యాప్‌లో పొందుపర్చారు. ఈ యాప్ ద్వారా మద్యం ఎంఆర్‌పి ధర ఎంత ఉందో ఖచ్చితంగా తెలుసుకునే వీలు ఉంటుంది.
మద్యం దుకాణాలలో రెండు సిసి కెమెరాల ఏర్పాటు
జిల్లాలో గల 45 మద్యం దుకాణాలలో రెండు సిసి కెమెరాల చొప్పున ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ అధికారులు ఏర్పాటు చేయించారు. మద్యం దుకాణాలలో జరిగే అవకతవకలను అరికట్టేందుకు సిసి కెమెరాలు దోహదపడుతాయని అధికారులు పేర్కొంటున్నారు. మద్యం దుకాణంలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి అనుసంధానం చేయాలనే ఆలోచనలో అధికారులున్నారు.
మద్యం అధిక ధరలకు విక్రయిస్తే ఫిర్యాదు చేయండి
-జిల్లా ఎక్సైజ్, ప్రొహిబిషన్ అధికారి వరప్రసాద్
మద్యం అధిక ధరలకు విక్రయించినట్లు అయితే తమ దృష్టికి తీసుకువస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎక్సైజ్, ప్రొహిబిషన్ అధికారి వరప్రసాద్ హెచ్చరించారు. ఎంఆర్‌పి కన్నా ఎక్కువ ధరకు మద్యం విక్రయించకుండా ఉండేందుకు లిక్కర్ ప్రైస్ మొబైల్ యాప్‌ను ప్రారంభించినట్లు ఆయన శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. మద్యం దుకాణాలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే వాట్సాప్ (7989111222) ద్వారా, టోల్‌ఫ్రీ నెంబరు (18004252523) ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా విక్రయించే 25 మద్యం బ్రాండ్ల ధరలు, ఐదు బీర్ బ్రాండ్ల ధరలకు సంబంధించిన ధరల పట్టికను ప్రతి మద్యం దుకాణంలో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. జిల్లాలోని ప్రతి మద్యం దుకాణంలో రెండు సిసి కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.