గుడ్లూరు(ప్రకాశం జిల్లా):తాగుబోతు భర్త పెట్టే వేధింపులు భరించలేక ఒక ఇల్లాలు తన మూడేళ్ల కుమార్తెతో సహా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవేరు గ్రామంలో సోమవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల కిత్రం చెంచుబాబుతో శ్రీలేఖకు వివాహమైంది.. మూడేళ్ల వరకు వారి కాపురం సజావుగా సాగింది. వారికి హర్షిత అనే మూడేళ్ల కుమార్తె ఉంది. అయితే ఆ తర్వాత మద్యానికి బానిసైన చెంచు బాబు ఆమెను తీవ్రంగా వేధించేవాడు. ఆ వేధింపులు భరించలేక శ్రీలేఖ తన కుమార్తెతో కలసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె బంధువు రమణయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చెంచుబాబు, అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. తల్లీకుమార్తె మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.