Home జాతీయ వార్తలు భారత తొలి మహిళా డిజిపి ఇకలేరు

భారత తొలి మహిళా డిజిపి ఇకలేరు

Kanchan-Chaudharyముంబయి : భారత తొలి మహిళా డిజిపి కంచన్‌ చౌదరి భట్టాచార్య(72) ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం అర్ధరాత్రి కన్నుమూశారు. కంచన్‌ గత ఆరు నెలలుగా ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. హిమాచల్‌ప్రదేశ్‌లో జన్మించిన ఆమె అమృత్‌సర్ ప్రభుత్వ మహిళా కళాశాల నుంచి డిగ్రీ పట్టా పొందారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని ఇంద్రప్రస్థ కాలేజీ నుంచి ఇంగ్లీష్ లిటరేచర్ అభ్యసించారు. 1973 బ్యాచ్‌కు చెందిన ఆమె ఉత్తరాఖండ్ తొలి మహిళా డిజిపిగా 2004లో నియామకం అయ్యారు. 2007, అక్టోబర్ 31న పదవీ విరమణ పొందిన తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున హరిద్వార్ లోక్‌సభ నియోజకవర్గానికి పోటీ చేశారు. తొలి మహిళా ఐపిఎస్ ఆఫీసర్ కిరణ్ బేడీ కాగా, కంచన్ చౌదరి భట్టాచార్య ఐపిఎస్ సాధించిన రెండో మహిళగా ఘనత సాధించారు. ఆమె మృతిపట్ల ప్రముఖులు, ఐపిఎస్ అధికారులు, పలువురు నేతలు నివాళులర్పించారు.

 woman DGP Kanchan Chaudhary Bhattacharya Dies