Home తాజా వార్తలు లొంగదీసుకుని.. కలిసున్న వీడియోలతో వేధింపులు.. వివాహిత ఆత్మహత్య

లొంగదీసుకుని.. కలిసున్న వీడియోలతో వేధింపులు.. వివాహిత ఆత్మహత్య

Mother and Son attempt Suicide in Vijayawada

మనతెలంగాణ/కొత్తగూడెం/పాల్వంచటౌన్: భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళలపై వేధింపులు నానాటికి పెరుగుతున్నాయి. ఒక మైనర్ విద్యార్ధినిపై అత్యాచారం చేసి, ఆ వీడియోలు చూపి మరొకరు వేధించిన ఘటన మరువకముందే పాల్వంచలో దారుణం చోటుచేసుకుంది. ఒక మహిళలను లొంగదీసుకున్న యువకుడు ఇద్దరు కలిసి ఉన్న వీడీయోలను చూపించి బెదిరించి వాటిని వైరల్ చేస్తాననడంతో తీవ్రంగా కలత చెంది, భయపడిన వివాహిత పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన ఇది. మృతురాలి భర్త పోలూరి ఆంజనేయులు పాల్వంచ పట్టణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వివరాలు ఇలా ఉన్నాయి. తాము గత 20ఏళ్లుగా కరకవాగు వద్ద నున్న గేటుతండాలో ఉంటూ ఒక వ్యక్తి పొలంలో వ్యవసాయ పనులు చేస్తు జీవిస్తున్నామని, తన భార్య పోలూరి రాజేశ్వరి(43) స్నానం చేస్తుండగా అదే తండాకు చెందిన బాణోతు మధు వీడియోతీసి అది తన భార్యకు చూపించి తనతో శరీరం పంచుకోవాలని లేకపోతే వీడియో బహిర్గతం చేస్తానని, పరువు తీస్తానని బెదిరించాడు.

ఈ విషయంతో గతంలో పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. ఇది పునరావృతం కాదని, చిన్న వయస్సు అని తమను సముదాయించారని మన్నించి వదిలేశామని, ఆ వీడియో తీసేసినట్లు నమ్మించారని వివరించాడు. గత నెల రోజులుగా తను ఇంటిలో లేని సమయంలో మధు తన భార్యను మరలా బెదిరించి లోబర్చుకున్నాడని పేర్కొన్నాడు. తన భార్యతో కలిసి మధు వారిద్దరు శారీరకంగా కలసి ఉన్నప్పుడు దృశ్యాలను సైతం వీడియో తీసి బెదిరింపులు కొనసాగిస్తూనే ఉన్నాడని, ఈవీడియోలు అడ్డుపెట్టుకుని తన భార్యతో శృంగారంలో పాల్గొనే వాడని వివరించాడు. శుక్రవారం సైతం మధు తన ఇంటికి వచ్చి తను ఎలా చెబితే అలా వినాలని, లేకపోతే నిన్ను నీ భర్తను చంపుతానని, లేకపోతే మీకై మీరే చచ్చేటట్లు చేస్తానని బెదిరించాడని ఈ విషయం భోజన సమయంలో తన భార్య తనకు చెప్పినట్లు ఆంజనేయులు వివరించాడు. తను పొలం నుంచి సాయంత్రం వచ్చాక పోలీసులకు ఫిర్యాదు చేద్దామని భార్యకు నచ్చ చెప్పి వెళ్లాలని తెలిపాడు.

తాను వెళ్లిన కొద్దిసేపటి మధు, వాళ్ల నాన్న వెంకన్న, తల్లి సునితలు ముగ్గురు తమ ఇంటికి వచ్చి గొడవ చేసి వెళ్లారని, వీడియోలు బయటకు వస్తే పరువుపోతుందని తన భార్య తీవ్ర మనస్ధాపానికి గురై శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు చనిపోయేందుకు పొలానికి ఉపయోగించే పురుగు మందుతాగిందని వెల్లడించాడు. తన భార్య పురుగు మందు తాగిన అనంతరం తనకు ఫోన్ చేసిందని, మధు, అతని తల్లి, తండ్రి వచ్చి బెదిరించి, నువ్వు చస్తే పీడా విరగడ అవుతుందని బూతుల తిట్టారని, చచ్చిపోమ్మన్నారని దీనితో తను పురుగు మందు తాగినట్లు చెప్పిందని పేర్కొన్నాడు. వెంటనే ఇంటికి వచ్చి తన భార్యను తొలుత పాల్వంచలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించామని, అక్కడి నుంచి మెరుగైన వైద్యంకోసం కొత్తగూడెం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లామని శుక్రవారం సాయంత్రం 6.30కు మృతిచెందిందని తెలిపారు. తన భార్యను లోబర్చుకుని ఆమె చావుకు కారణమైన వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని కోరారు. మధు వీడియోను అప్‌లోడ్ చేశాడని అదికాస్తా వైరల్ అయ్యిందని పట్టణ ఎస్‌ఐ ప్రవీణ్ మనతెలంగాణ కు చెప్పారు. నిందితులుపై కేసు నమోదు చేశామని తెలిపారు. కాగా రాజేశ్వరి మృతదేహానికి పోస్టుమార్గం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని భర్తకు అప్పగించారు.

Woman suicide due to sexual harassment in Kothagudem