Friday, April 26, 2024

నేటి నుంచే మహా సంగ్రామం

- Advertisement -
- Advertisement -

మహిళల ప్రపంచకప్‌కు సర్వం సిద్ధం
సిడ్నీ: మహిళల ట్వంటీ20 ప్రపంచకప్‌కు శుక్రవారం తెరలేవనుంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్‌లో పది జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా ఆస్ట్రేలియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు మాజీ ఛాంపియన్ ఇంగ్లండ్, మాజీ రన్నరప్ న్యూజిలాండ్ జట్లు కూడా ట్రోఫీపై కన్నేశాయి. ఇక, భారత్ కూడా భారీ ఆశలతో టోర్నీకి సిద్ధమైంది. దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, వెస్టిండీస్ జట్లు కూడా సంచలన విజయాలపై కన్నేశాయి. అయితే ఈసారి నాలుగు జట్ల మధ్యే తీవ్ర పోటీ నెలకొంది. ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లకే ట్రోఫీ సాధించే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. మిగతా జట్లు బలంగానే ఉన్నా ట్రోఫీని సాధించే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. ఫిబ్రవరి 21న భారత్‌ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో వరల్డ్‌కప్ ప్రారంభమవుతోంది. ఇక, మార్చి 8న జరిగే ఫైనల్‌తో మహా సంగ్రామానికి తెర పడుతుంది. టోర్నీలో పాల్గొనే జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు గ్రూప్‌ఎలో ఉన్నాయి. గ్రూప్‌బిలో మాజీ ఛాంపియన్లు ఇంగ్లండ్, వెస్టిండీస్‌లతో పాటు దక్షిణాఫ్రికా, థాయిలాండ్, పాకిస్థాన్ జట్లలకు చోటు కల్పించారు. ఈ గ్రూప్‌లో సెమీస్ బెర్త్ కోసం మూడు జట్ల మధ్‌య పోటీ నెలకొంది. దక్షిణాఫ్రికా, విండీస్, ఇంగ్లండ్‌లకే సెమీస్ చేరే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక, గ్రూప్‌ఎలో కూడా సెమీస్ స్థానం కోసం ముక్కోణపు పోటీ ఏర్పడింది. భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్ బెర్త్ కోసం హోరాహోరీగా తలపడనున్నాయి. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే లీగ్ మ్యాచుల్లో ప్రతి గ్రూప్ నుంచి అగ్రస్థానంలో నిలిచే రెండేసి జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.
ఐదో ట్రోఫీపై కన్ను
ఇక, ఇప్పటికే నాలుగుసార్లు ప్రపంచ కప్‌ను సాధించిన ఆస్ట్రేలియా మరో ట్రోఫీపై కన్నేసింది. సొంత గడ్డపై జరుగుతున్న మెగా టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కంగారూ జట్టు సమతూకంగా కనిపిస్తోంది. ఈసారి కూడా ఈ జట్టుకే ట్రోఫీ సాధించే అవకాశాలు అధికంగా ఉన్నాయని చెప్పక తప్పదు. మహిళల క్రికెట్‌లోనే అత్యుత్తమ జట్టుగా పేరున్న ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి ట్రోఫీని సాధించడం ఇతర జట్లకు అనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి. ఎటువంటి జట్టునైనా ఓడించే సత్తా ఆస్ట్రేలియాకు ఉంది. ఇటీవలే ముగిసిన ముక్కోణపు సిరీస్‌లో బలమైన భారత్, ఇంగ్లండ్‌లను ఓడించి ఆస్ట్రేలియా ట్రోఫీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక, తనకు ఎంతో కలిసి వచ్చే ప్రపంచకప్ సమరంలో మరోసారి ట్రోఫీని ముద్దాడాలని ఆస్ట్రేలియా తహతహలాడుతోంది. అలీసా హిలీ, బెట్ మూని, అష్లే గార్డ్‌నర్, మెగ్ లానింగ్; ఎలిసె పెర్రీ, రాచెల్ హేన్స్, సదర్లాండ్ తదితరులతో ఆస్ట్రేలియా చాలా బలంగా ఉంది. మరోవైపు ఇంగ్లండ్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. ఆ జట్టులో కూడా ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. అంతేగాక వన్డే ప్రపంచకప్‌లో ట్రోఫీని సాధించిన ఇంగ్లండ్ టి20లోనూ అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఇక, యువ క్రికెటర్లతో కూడిన భారత్ కూడా చరిత్ర సృష్టించాలని భావిస్తోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్‌కు ఈసారి మెరుగైన అవకాశాలున్నాయనే చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ బలంగా ఉంది.

ఇటీవలే జరిగిన ట్రై సిరీస్‌లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లను ఓడించి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ కూడా భారీ ఆశలతో టోర్నీకి సిద్ధమైంది. తనకు అందని ద్రాక్షగా మారిన ప్రపంచకప్ ట్రోఫీని ఈసారైనా సొంతం చేసుకోవాలని భావిస్తోంది. తమకు అనుకూలంగా ఉండే ఆస్ట్రేలియా పిచ్‌లపై మెరుగైన ప్రదర్శనతో ట్రోఫీని దక్కించుకోవాలని తహతహలాడుతోంది. కాగా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్థాన్, శ్రీలంక జట్లు కూడా ఒకటి రెండు సంచలన విజయాలు సాధించాలనే పట్టుదలతో ఉన్నాయి. ఒకప్పుడూ మహిళల క్రికెట్‌లో ఎదురులేని శక్తిగా కొనసాగిన విండీస్ ఇటీవల కాలంలో వరుస ఓటములతో సతమతమవుతోంది. దీంతో ఈ టోర్నమెంట్‌లో విండీస్‌కు గెలుపు అవకాశాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. ఇక, పసికూనలు శ్రీలంక, బంగ్లాదేశ్, థాయిలాండ్‌లు ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించినా గొప్పగానే పరిగణించవచ్చు. ఇదిలావుండగా మహిళల ప్రపంచకప్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి, క్రికెట్ ఆస్ట్రేలియాలు భారీ ఏర్పాట్లు చేశాయి. టోర్నీని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు.

Woman’s ICC T20 World Cup 2020 Starts from Feb 21

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News