Friday, March 29, 2024

ఖాప్ చట్టాలు

- Advertisement -
- Advertisement -

Women can Marry Men regardless of Religion

 

దేశ ఆధిపత్య రాజకీయాల్లో వచ్చిన మార్పు, పరాకాష్ఠకు చేరిన హిందుత్వ శక్తుల ప్రాబల్యం రాజ్యాంగ మూల సూత్రాలకే ముప్పు తెచ్చే పరిణామాలకు దారి తీస్తున్నది. ఇది భారతీయ సమాజ సెక్యులర్ సభావాన్ని బలి తీసుకుంటున్నది. వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లో ప్రవేశించి, కుటుంబ సాంసారిక జీవన గతులనూ ప్రభావితం చేసే దిశగా వికటాట్టహాసం చేస్తూ వికృత విశ్వరూప ప్రదర్శన సాగిస్తున్నది. ముస్లిం యువకులు హిందూ యువతులను వలలో వేసుకొని మత మార్పిడి పెళ్లిళ్లు చేసుకుంటున్నారని, ఇందు కోసం తమ మత నేపథ్యాన్ని కప్పిపుచ్చడం, ఆ అమ్మాయిల బలహీనతలను వినియోగించుకోడం వంటి మోసాలకు పాల్పడుతున్నారని ఉత్తరాదిలో సంఘ్ పరివార్ శక్తులు చిరకాలంగా సాగిస్తున్న ప్రచారం తెలిసిందే. దానికే ‘లవ్ జిహాద్’ అని పేరు పెట్టారు. ఈ వ్యూహం దేశంలో మతపరమైన చీలికను పెంచి తనకు ఎన్నికల్లో లబ్ధి చేకూరుస్తున్నదని బిజెపి భావిస్తున్నది. అందుచేత ఆ ప్రచారాన్ని మరింత తీవ్రం చేసి విశేష ప్రయోజనం పొందాలని ఆశిస్తున్నది. ఆ దిశగా బిజెపి పాలిత రాష్ట్రాలు ‘లవ్ జిహాద్’ నిషేధ చట్టాలను తీసుకురావడానికి వెంపర్లాడుతున్నాయి.

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, కర్నాటక ప్రభుత్వాలు ఆ వైపుగా దృఢ సంకల్పాన్ని వ్యక్తం చేశాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు మరో ముందడుగు వేసి ఆర్డినెన్స్ బాట పట్టింది. పెళ్లి కోసం జరుపుకునే మతాంతరీకరణలను నిషేధించే ఆర్డినెన్స్‌కు మంగళవారం నాడు యుపి మంత్రివర్గం ఆమోదం ముద్ర వేసింది. ఇందుకు పాల్పడే వారికి ఒకటి నుంచి ఐదు సంవత్సరాలు జైలు శిక్షను ఈ ఆర్డినెన్స్ నిర్దేశిస్తున్నది. ఎస్‌సి, ఎస్‌టి మహిళల చేత మత మార్పిడులు చేయించి పెళ్లి చేసుకున్నా, సామూహిక మతాంతరీకరణల్లో భాగంగా వారిని వివాహమాడినా మూడు నుంచి పది సంవత్సరాల శిక్ష విధించాలని నిర్ణయించారు. యుపి మంత్రివర్గం ఈ ఆర్డినెన్స్‌కు పచ్చజెండా ఊపడానికి ఒక రోజు ముందే అలహాబాద్ హైకోర్టు ఇందుకు పూర్తి విరుద్ధమైన తీర్పు ఇచ్చింది. మతాలతో నిమిత్తం లేకుండా మైనారిటీ తీరిన స్త్రీలు పురుషులు పెళ్లి చేసుకోవచ్చని, మేజర్లయిన జంటల మధ్య నెలకొన్న బంధాన్ని ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేదని ఆ తీర్పు స్పష్టం చేసింది. అటువంటి బంధాన్ని అడ్డుకోడం దేశ సెక్యులర్ లక్షణానికి, భిన్నత్వంలో ఏకత్వానికి గొడ్డలి పెట్టని స్పష్టం చేసింది.

సలామత్ అన్సారీ, ప్రియాంక ఖర్వార్ అనే దంపతులు తమకు రక్షణ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన వ్యాజ్యంపై ఈ తీర్పు వెలువడింది. రాజ్యాంగం 21వ అధికరణ వారికి తగిన రక్షణ ఇస్తున్నదని అభిప్రాయపడింది. ఏ వ్యక్తి స్వేచ్ఛను, జీవన హక్కును హరించే హక్కు ఎవరికీ లేదని అలాగే చట్టం ముందు సమానత్వాన్ని నిరాకరించడం తగదని 21వ అధికరణ స్పష్టం చేస్తున్నది. రాజ్యాంగం 25వ అధికరణ దేశ పౌరులందరికీ ఇచ్ఛానుసారం జీవనం సాగించే హక్కును, కోరుకున్న మతాన్ని అవలంబించి ప్రచారం చేసుకునే స్వాతంత్య్రాన్ని ప్రసాదించింది. అందుచేత మత ప్రాతిపదిక మీద వివాహాలను నియంత్రించే అధికారం మతాంతర, కులాంతర మున్నగు ఇష్టపూర్వక పెళ్లిళ్లను అడ్డుకునే హక్కు ఎవరికీ ఉండదు. వివాహపరంగా గాని, ఆ వ్యవస్థ బయట గాని జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ప్రతి వ్యక్తికీ ఉంటుందని సుప్రీంకోర్టు గతంలో సందేహాతీతంగా నిర్ధారించింది. అది రాజ్యాంగం 21వ అధికరణ ఇచ్చిన హక్కు అని కూడా స్పష్టం చేసింది.

ఇస్లాం మతంలోకి మారిన హదియా అనే యువతికి షెఫిన్ జహాన్ అనే ముస్లిం యువకుడికి జరిగిన వివాహాన్ని రద్దు చేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును త్రోసిపుచ్చుతూ అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా అధ్యక్షతన గల ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఎటువంటి దుస్తులు ధరించాలి, ఏ ఆహారం తీసుకోవాలి, ఏ సిద్ధాంతాన్ని పాటించాలి, ఎవరిని ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి అనే వాటి విషయంలో ఎవరి జోక్యం తగదని సమాజానికి అందులో ఎటువంటి పాత్ర లేదని వివరించింది. రాజ్యాంగం విశ్వాసులకు, ఏ విశ్వాసం లేనివారికి కూడా ఒకే రకమైన ప్రాధాన్యం ఇస్తుందని చెప్పింది. అలాగే యుక్త వయసు వచ్చిన వారు, మేజర్లు తమ ఇష్టం వచ్చిన వారిని పెళ్లి చేసుకునే హక్కు కలిగి ఉంటారని ఇందులో ఖాప్ పంచాయతీల ప్రమేయానికి ఎటువంటి అవకాశం లేదని కూడా మరో సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. తమ పిల్లలు అన్యులను పెళ్లాడడం ఇష్టంలేని తలిదండ్రుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఆసరా చేసుకొని ప్రేమ వివాహితులను ఇబ్బంది పెట్టే ధోరణి మన పోలీసు వ్యవస్థలో తరచూ చూస్తుంటాము. ఇప్పుడు బిజెపి ప్రభుత్వాలే అందుకు వీలు కలిగించే చట్టాలను తీసుకు రావడం దేశ బహుళత్వానికి మృత్యు ఘాతం వంటిది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News