Thursday, April 25, 2024

మహిళా ధర్మాసనం

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: దేశంలోని ఇతర అణగారిన వర్గాలతో పాటు మహిళలకు కూడా సరైన న్యాయం లభించడం లేదన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. అది ఇప్పటికీ ఆకాశ పుష్పంగానే మిగిలిపోయింది. అప్పుడప్పుడూ సంకేతాత్మకంగా తీసుకొనే చర్యలు వారి పట్ల అధికార వ్యవస్థ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నదనే అభిప్రాయానికి అవకాశం కలిగిస్తుంది. సుప్రీంకోర్టులో ప్రత్యేక మహిళా ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం ఇందుకు తాజా తార్కాణం. భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై చంద్రచూడ్ గురువారం నాడు ఇద్దరు మహిళా న్యాయమూర్తులతో ఈ ధర్మాసనాన్ని నెలకొల్పారు. న్యాయమూర్తులు హిమా కోహ్లి, బేలా ఎం త్రివేదిలను ఈ ధర్మాసనంలో నియమించారు. దీనికి 32 కేసులను కేటాయించారు.

ఇందులో కింది కోర్టుల నుంచి బదిలీ అయిన 10 వైవాహిక వివాదాల కేసులు కాగా, 10 బెయిల్ పిటిషన్లు వున్నాయి. సుప్రీంకోర్టులో ప్రత్యేక మహిళా ధర్మాసనం ఏర్పాటు కావడం ఇది మూడో సారి. ఇంతకు ముందు 2013లో ఒకటి, 2018లో మరొకటి నియమితమయ్యాయి. సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది జడ్జీల నియామకానికి అవకాశం వున్నది. ప్రస్తుతం వున్న న్యాయమూర్తుల సంఖ్య 27 మాత్రమే. వీరిలో ముగ్గురే మహిళా న్యాయమూర్తులు. ప్రత్యేక ధర్మాసనానికి నియమించిన ఇద్దరు పోనూ మూడవ మహిళా న్యాయమూర్తు జస్టిస్ నాగరత్న. ఈమె 2027లో భారత మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి కానున్నారు. 2020లో మద్రాస్ హైకోర్టు ఆ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మొట్టమొదటి మహిళా ధర్మాసనాన్ని నెలకొల్పింది. అందులో న్యాయమూర్తులు పుష్పా సత్యనారాయణ, అనితా సుమంత్, పిటి ఆశ పని చేశారు. దేశంలోని హైకోర్టుల్లో గల జడ్జీల్లో మహిళా న్యాయమూర్తులు కేవలం 11.5 శాతం మందే కావడం, మొత్తం 17 లక్షల మంది న్యాయవాదుల్లో మహిళల సంఖ్య 15 శాతంగానే వుండడం గమనించవలసిన విషయం.

మనం స్త్రీ విద్యను ప్రోత్సహించడాన్ని బట్టే ఏ ఉన్నత రంగంలోనైనా మహిళల ఉనికి ఆధారపడి వుంటుంది. గతం కంటే మెరుగైనప్పటికీ స్త్రీ విద్య మరింతగా, మరింత వేగంగా పుంజుకోవలసి వున్నది. న్యాయ విద్యలో వారికి ప్రాధాన్యం పెరగవలసి వున్నది. న్యాయమూర్తుల నియామక సమయంలో స్త్రీల పట్ల, అణగారిన సామాజిక వర్గాల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టవలసి వుంది. నియామకాలు జరగవలసి వుంది. స్త్రీపై పురుషుడు జరుపుతున్న అన్యాయాలు, అక్రమాలు అసాధారణంగా వుండే మన వంటి దేశంలో మహిళా న్యాయమూర్తుల అవసరం అపారంగా వుంది. మహిళలకు సంబంధించిన కేసులను మహిళలే పరిష్కరించడం వల్ల బాధిత మహిళలకు మెరుగైన న్యాయం జరుగుతుంది.

దేశ జనాభాలో సగం మంది మహిళలు కాగా మహిళా న్యాయవాదులు అందుబాటులో వున్నంతగానైనా న్యాయమూర్తులుగా వారి నియామకం జరగడం లేదనే విమర్శ వున్నది. రాజ్యాంగం 124, 217, 234 అధికరణల కింద సుప్రీంకోర్టు, హైకోర్టులకు న్యాయమూర్తుల నియామకం జరుగుతుంది. ఈ నియామకాల్లో రిజర్వేషన్లకు తావు లేదు. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ గల దేశంలో ఇందులో సైతం రిజర్వేషన్లుండడం సబబు. కొలీజియం వ్యవస్థ అయినా దీనిని దృష్టిలో పెట్టుకొని నియామకాలు చేయవలసి వుంది. అప్పుడు మాత్రమే మహిళా న్యాయమూర్తుల సంఖ్య పెరుగుతుంది. పెండింగ్ కేసులకు మన దేశం పెట్టింది పేరు. దేశంలోని 25 హైకోర్టుల్లో 59 లక్షల కేసులు పెండింగ్‌లో వున్నాయి. ఇందులో 72 వేల కేసులు 30 ఏళ్ళ నాటివి. అంటే న్యాయం ఎంత నత్తనడక నడుస్తున్నదో అర్థమవుతుంది. మహిళలపై గృహ హింస చట్టం కింద 4,71,684 కేసులు నమోదు కాగా, ఈ చట్టం కింద 21,088 అప్పీళ్ళు పెండింగ్‌లో వున్నాయి.

ఈ చట్టం వచ్చిన తర్వాత అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 2,02,880 కేసులు నమోదయ్యాయి. యుపి దేశంలో అతి పెద్ద రాష్ట్రమే కాకుండా మహిళలను హింసించడంలో కూడా ఎదురులేని రాష్ట్రమని స్పష్టపడుతున్నది. దేశానికి ఎక్కువ మంది ప్రధానులనిచ్చిన రాష్ట్రం కదా మరి! యుపి తర్వాత మహారాష్ట్రలో అత్యధికంగా 1,96,717 గృహ హింస కేసులు నమోదయ్యాయి. 27212 కేసులతో ఆ తర్వాత స్థానంలో రాజస్తాన్, 27043 కేసులతో నాలుగో స్థానంలో దేశ రాజధాని ఢిల్లీ వున్నాయి. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ కోర్టుల్లో పెండింగ్‌లో వున్న మహిళలు, పిల్లలపై నేరాలు, అక్రమాల కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నదని సమాచారం. పురుషాహంకారాన్ని, పురుషాధిపత్యాన్ని ప్రోత్సహించే సమాజాల్లో సహజంగానే మహిళలపై నేరాలు ఎక్కువగా వుంటాయి. న్యాయమూర్తి పదవుల్లో మహిళలకు, కింది సామాజిక వర్గాలకు ప్రాధాన్యం పెరిగే కొద్దీ న్యాయ వ్యవస్థ నుంచి సామాజిక న్యాయాన్ని ఇతోధికంగా పొందగలుగుతాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News