Home Default ఆమెకే అధిక ఆయుష్షు

ఆమెకే అధిక ఆయుష్షు

Women live

 

2019 ఆరోగ్య గణాంకాల నివేదికలో డబ్లుహెచ్‌ఒ వెల్లడి

దేశంలో మగవారి కంటే మహిళలే ఎక్కువ కాలం జీవిస్తున్నారు
పురుషుల సగటు జీవితం 67.4ఏళ్లు, స్త్రీలు 70.3 ఏళ్లు

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచంలో మగవాళ్ల కన్నా ఆడవాళ్లే ఎక్కువ కాలం జీవిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించింది. భారత్‌లో పురుషులు సరాసరి 67.4 ఏళ్లు, మహిళలు 70.3 ఏళ్లు బతుకుతున్నారని తెలిపింది. మహిళల జీవితకాలం 2.9 ఏళ్లు అధికంగా ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే సరాసరి మహిళలు 74.2 ఏళ్లు జీవిస్తున్నట్లు పేర్కొంది. మగవారు 69.8 ఏళ్లు బతుకుతున్నారని తెలిపింది. అయితే అదనంగా మహిళలు బతికే 4.4 ఏళ్లు కూడా ఒంటరితనం, పేదరికం, వ్యాధులతోనే కాలం గడుపుతున్నారని పేర్కొంది.

పురుషుల కంటే మహిళల జీవితాలం ఎక్కువగా ఉండటానికి 40 ప్రధాన కారణాలున్నట్లు వివరించింది. అందులో 33 కారణాలు అధికంగా దోహదం చేస్తాయని వివరించింది. గుండెపోటు, ఊపిరితిత్తుల క్యాన్సర్,టిబి, రోడ్డు ప్రమాదాలు వంటివి ఉన్నాయి. ఇక తక్కువ ఆదాయం గల దేశాల్లో పుట్టినవారి జీవిత కాలం 62.7 ఏళ్లు కాగా, అధికాదాయ దేశాల ప్రజల జీవిత కాలం మాత్రం ఏకంగా 80.8 ఏళ్లుగా ఉంది. ఈ దేశాల జాబితాలో భారత్ కూడా ఉండటం గమనార్హం. ప్రపంచ ఆరోగ్య గణాంకాల నివేదిక -2019 ప్రకారం వివిధ దేశాల్లో ప్రజల జీవిత కాలాన్ని, ఆరోగ్య రంగంలో ఆయా దేశాల స్థానాన్ని వివరించింది. జపాన్‌లో ప్రపంచంలోనే అత్యధికంగా మహిళలు 87.1 ఏళ్లు, పురుషులు 81.1 ఏళ్లు బతుకుతున్నారు.

జీవిత కాలం ఇలా తగ్గిపోతుంది
తక్కువ ఆదాయం గల దేశాల్లో జీవితకాలం తక్కువ ఉండటానికి 10 ప్రధాన కారణాలు ఉన్నాయి. శ్వాసకోశ ఇన్ఫెక్‌షన్లతో ఆయుర్దాయం 2.09 ఏళ్లు తగ్గింది. అతిసార వ్యాధులతో 1.97 ఏళ్లు, గుండెపోట్లతో 1.45 ఏళ్లు, ఎయిడ్స్‌తో 1.45 ఏళ్లు, టిబితో 1.35 సంవత్సరాలు, గుండె జబ్బులతో 1.35 ఏళ్లు, మలేరియాతో 10 నెలలు, రోడ్డు ప్రమాదాలతో ఏడున్నర నెలలు, పోషకాహార లోపంతో 6 నెలలు, ఇతరత్రా కారణాలతో మరో ఏడాదిన్నర ఆయుర్దాయం తగ్గుతోందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 2016లో మధుమేహం, గుండెపోటు, కిడ్నీ, క్యాన్సర్ తదితర వ్యాధుల కారణంగా 4.10 కోట్ల మంది చనిపోయారు.

అంటే మొత్తం ప్రపంచంలో ఆ ఏడాది చనిపోయినవారిలో ఈ సంఖ్య ఏకంగా 71 శాతం ఉండటం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం వంటి కారణాల వల్ల 2016లో ఏకంగా 70 లక్షల మంది చనిపోయారు. పట్టణాలు, నగరాల్లో ప్రతీ పది మందిలో ఒకరు వాయు కాలుష్యం బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వాయుకాలుష్యం కారణంగా గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఇతర శ్వాసకోశ వ్యాధులు రావడానికి ప్రమాదముంది. ఇక పరిశుభ్రమైన తాగునీటిని వాడుతున్న ప్రజల శాతం పెరిగింది. ఐదేళ్లలోపు చిన్నారులు డయేరియాతో 4.70 లక్షల మంది చనిపోయారు.

10 వేల మందికి 15 మంది డాక్టర్లు
ప్రపంచవ్యాప్తంగా ప్రతీ పది వేల మందికి 15 మంది డాక్టర్లు మాత్రమే ఉన్నారు. షుగర్, బిపి, గుండె, కిడ్నీ సంబంధింత వ్యాధులకు థాయ్‌లాండ్ కంటే కూడా భారత్‌లో యూనివర్సల్ హెల్త్ కవరేజీ ఎక్కువగా లేకపోవడం గమనార్హం. శ్రీలంకలో 62 శాతం జనాభాకు యూనివర్సల్ హెల్త్ కవరేజీ అందుతుండగా, దేశం లో కేవలం 56 శాతం మందికే అందుతోంది. గర్భిణిలు ఆసుపత్రికి వస్తే ప్రసవం చేయడానికి నిపుణులైన వైద్య సిబ్బంది ఉండటం లేదు. దీనివల్ల మాతా శిశుమరణాలు అధికంగా సంభవిస్తున్నాయని తెలిపింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్ హెల్త్ కేర్ అందుబాటులోకి వస్తేనే ప్రజల ఆరోగ్య ప్రమాణాలు, ఆయుర్దాయం పెరుగుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశాలకు పిలుపునిచ్చింది.

అలాగే ప్రపంచంలో సగం జనాభాకు అత్యవసర వైద్య సేవలే అందడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రపంచంలోని జనాభాలో 80.80 కోట్ల మంది తమ ఇంటి ఖర్చులో 10 శాతం పైగా వైద్యానికి ఖర్చు చేస్తున్నారు. తమ ఇంటి ఖర్చులో వైద్యానికి అధికంగా ఖర్చు చేసిన ఫలితంగా 2010లో ఏకంగా 9.70 కోట్ల మంది పేదరికంలోకి వెళ్లాల్సి వచ్చింది. పెద్ద చిన్నా అనే తేడా లేకుండా అన్ని దేశాల్లోనూ మందుల కొనుగోళ్లకే ప్రజలు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. ఇక దేశంలో ప్రతీ 10 వేల మంది జనాభాకు 7.8 మంది డాక్టర్లుండగా, నర్సులు 21.1 మంది ఉన్నారు. ప్రతీ లక్ష మందిలో 204 మందికి క్షయ వ్యాధి ఉంది. -ప్రతీ వెయ్యి మందిలో 7.7 మందికి మలేరియా వచ్చే ప్రమాదముంది.

Women live longer than men in the country