Home లైఫ్ స్టైల్ ఆడపిల్లలకు ఆత్మరక్షణ అవసరం

ఆడపిల్లలకు ఆత్మరక్షణ అవసరం

Women need self-defense

ఒకప్పుడు అమ్మాయంటే ఎవరో ఒకరి చెప్పుచేతుల్లో ఉండాలి. స్వేచ్ఛా స్వాత్రంత్యం ఉండకూడదు అనుకునేవారు. రోజులు మారాయి. సమాజంలో మేం ఎందులో తక్కువకాదంటూ రుజువు చేస్తున్నారు నేటి అమ్మాయిలు. ధైర్యంగా ఉంటున్నారు. తమ వల్ల సాధ్యంకానిదంటూ లేదంటున్నారు. కానీ ఇంతగా సమాజంలో మార్పు వస్తున్నా, అమ్మాయి తనకాళ్లపై తాను నిలబడాలంటే ఎన్నో ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. అలాంటివారికి గాళ్ ఫౌండేషన్ ద్వారా ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తోంది రోహిణీనాయుడు.

చిన్నవయసులోనే వివాహం చేసుకున్న రోహిణికి చదువంటే చాలా ఇష్టం. తనకంటూ ఓ గుర్తింపు ఉండాలనుకుంది. దీంతో పెళ్లయ్యాక దూరవిద్యలో డిగ్రీ పూర్తిచేసింది. తర్వాత కోఠి ఉమెన్స్ కాలేజీలో పీజీ చేసింది. పగలంతా తన పిల్లల్ని చూసుకుంటూ, రాత్రిపూట చదువుకునేది. చదువయ్యాక ఇంగ్లీషుపై పట్టు సాధించింది. ఇంగ్లీష్ లెక్చరర్‌గా చేరింది.సివిల్‌సర్వీస్‌లో చేరాలనుకుంది. కొన్ని కారణాల వల్ల కుదర్లేదు. ఐతేనేం కొన్నాళ్లకు సాఫ్ట్ స్కిల్స్‌లో సివిల్‌సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. దగ్గర్లోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి వారికి పాఠాలు చెప్తుండేది. అంతేకాకుండా స్కూల్లోని అబ్బాయిలకు అమ్మాయిలకు కౌన్సెలింగ్ ఇవ్వడం చేస్తుండేది. అమ్మాయిల్లోని బెరకుదనం పోగొట్టేందుకు కృషి చేసింది రోహిణి. ప్రతి విషయాన్ని తనతో పంచుకునేలా చేసుకుంది. దీంతో వారి సమస్యలేంటో తెలుసుకోగలిగింది .అందుకోసం ఏమైనా చేయాలనుకుంది. అలా ఓ సంస్థను ఏర్పాటుచేయాలని నిర్ణయం తీసుకుంది.

గాళ్ ఫౌండేషన్: అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకు గాళ్ ఫౌండేషన్ ద్వారా కౌన్సెలింగ్ ఇవ్వడం ప్రారంభించింది. మధ్యలో చదువు మానేసిన అమ్మాయిలకు తన సంస్థ ద్వారా కౌన్సెలింగ్ ఇచ్చేది రోహిణి. ఇలా ఒక స్కూలుతో మొదలుపెట్టి మరిన్ని పాఠశాలల్లో చదువుపై అవగాహన కల్పించడం చేస్తుంది. దాంతోపాటు అమ్మాయిల్లో నెలసరిపై అపోహలు, పరిశుభ్రత, న్యాప్‌కిన్‌ల వాడకం, ఆత్మరక్షణకు సంబంధించిన విషయాలపై వారితో విపులంగా చర్చించేది. ఎవరికీ చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్న అమ్మాయిలు సైతం రోహిణికి తమ సమస్యలను చెప్పుకునేవారు. వారికి సైకాలజిస్ట్ ద్వారా కౌన్సెలింగ్ ఇప్పించేది. అమ్మాయిలతోపాటు అబ్బాయిలతోనూ మాట్లాడేది. అబ్బాయిలు అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలనే విషయాన్ని వివరించేది. ఈ విధంగా ఇప్పటివరకూ జంట నగరాలతోపాటు నిజామాబాద్, కామారెడ్డి, మొయినాబాద్, విశాఖపట్నం, చింతపల్లి, అరకు లాంటి చోట్ల అవగాహనా కార్య క్రమాలు నిర్వహించింది. అనేక పాఠశాలల్లో లైంగిక వేధింపుల నిరోధానికి ప్రత్యేకంగా డ్రాప్ బాక్స్‌లను ఏర్పాటుచేసింది. ప్రస్తుతం వంద పాఠశాల విద్యార్థులకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తోంది రోహిణినాయుడు.

ఈ విధంగా పాఠశాల స్థాయి నుంచే ఆడపిల్లలకు బాల్యవివాహాలు, నెలసరి సమస్యలు, వ్యక్తిగత పరిశుభ్రత వంటివాటిపై అవగాహన కల్పిస్తోంది రోహిణి. ఇంగ్లిష్, సాఫ్ట్ స్కిల్స్‌పై శిక్షణా అందిస్తోంది. అవసరమైన వారికి పుస్తకాలు, శానిటరీ న్యాప్‌కిన్‌లు పంచుతూ అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది.