Home తాజా వార్తలు మహిళా రక్షణకు పెద్దపీట

మహిళా రక్షణకు పెద్దపీట

MP Kavitha

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి, రక్షణ విషయంలో విశేష కృషి చేస్తోందని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని లక్డీకపూల్‌లో శుక్రవారం మహిళా భద్రత విభాగం నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపి కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు చేస్తున్న పోలీస్ సంస్కరణలు దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నాయన్నారు. ముఖ్యంగా మహిళలకు భదత్ర, అభివృద్ధితో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించినట్లు ఆమె వివరించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మహిళల భదత్ర, ప్రజల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. రాష్ట్ర భద్రత విషయంలో ముఖ్యమంత్రి విధాన పరమైన నిర్ణయాలతోపాటు అందుకు అవసరమైన వనరులను, సిబ్బందిని, సౌకర్యాలను ఏర్పాటుచేశారన్నారు. రాష్ట్ర పోలీసుల పట్ల మహిళలకు పూర్తి విశ్వాసం కలిగిందని, దీంతో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ఖ్యాతి లభించిందన్నారు. మహిళా రక్షణ, భద్రత కోసం షీటీమ్స్, షీ క్యాట్స్, భరోసా సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా మహిళల కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లు పనిచేస్తున్నాయని వివరించారు.

మహిళలకు సంబంధించిన కేసుల్లోని నిందితులను తగిన శిక్ష పడేలా ఉమెన్స్‌వింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో భరోసా కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం సమాలోచనలు సాగిస్తోందని, కార్పొరేటు సంస్థలు తమ సామాజిక బాధ్యతగా ఆర్థికంగా చేయూనందించాలని ఆమె పిలుపునిచ్చారు. బాధల్లో ఉన్న మహిళలకు భరోసా సెంటర్లు పరిష్కార మార్గం చూపుతున్నాయని, షీటీమ్స్ పనితీరుపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని వివరించారు. షీటీమ్స్ విభాగం ఇంచార్జి స్వాతిలక్ర బాధ్యతతో తమ విధులు నిర్వహించడం వల్లే ఇంతటి ఖ్యాతి వచ్చిందన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వెంటనే 100కు ఫోన్ చేయాలని, అలాగే పోకిరీల బెడద నుంచి తప్పించుకునేందుకు విద్యార్థునులు హాక్‌ఐ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఇటీవల జరిగిన వరంగల్, హైదరాబాద్ నగరంలోని కాచిగూడ ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్ట కరమని, నేరాల అదుపులో పోలీసు యంత్రాంగం ఎంత ప్రయత్నిస్తున్నా కొన్ని దారుణాలు జరిగిపోతూనే వున్నాయని ఎంపి కవిత ఆవేదన వ్యక్తం చేశారు. గృహహింస తదితర సమస్యలపై మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని ఆమె తెలిపారు.

తల్లిగా, భార్యగా, కూతురిగా ఇలా అనేక రకాలుగా మహిళలు కుటుంబంలోనూ సమాజంలోనూ కీలక పాత్రపోషిస్తున్నారని, సమ సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర ప్రధానమైందని ఆమె వివరించారు. మన పిల్లల ప్రవర్తన, మనస్తత్వం మన పెంపకంపైనే ఆధారపడిఉంటుందన్నారు. పిల్లలను సమాజానికి మంచి చేసే పౌరులుగా తీర్చిదిద్దాలని ఆమె కోరారు. అనంతరం రాష్ట్ర హోంమంత్రి మహమూద్ ఆలీ మాట్లాడుతూ రాష్ట్ర పోలీసులు మహిళల భద్రత కోసం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమన్నారు. తెలంగాణ పోలీసుల పనితీరు దేశవ్యాప్తంగా ఆదర్శంగా తీసుకుని ముందుకుసాగుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన షీటీమ్స్, భరోసా సెంటర్లు మిగితా రాష్ట్రాలలో సైతం అమలు చేస్తున్నారన్నారు. మన రాష్ట్ర పోలీసుల ఖ్యాతి ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలిచేరోజులు కూడా త్వరలోనే వస్తాయన్నారు. కార్యక్రమంలో డిజిపి మహేందర్‌రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొలేటి దామోదర్ గుప్తా,సిటి పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, పోలీసు ఉన్నతాధికారులు మల్లారెడ్డి, స్వాతిలక్ర తదితరులు పాల్గొన్నారు.

Women Safety Wing Building Launched By MP Kavitha