Home ఆఫ్ బీట్ ప్రకృతితో మమేకమౌతూ…

ప్రకృతితో మమేకమౌతూ…

శానిటరీ ప్యాడ్ కావాల్సివస్తే ఒకప్పుడు మెడికల్ షాప్‌కు వెళ్లి అడగాలంటే  అమ్మాయిలకు సిగ్గు ..బిడియం. ఇచ్చేవాడు కూడా శానిటరీ ప్యాడ్‌ల ప్యాకెట్‌ను కాగితంలో చుట్టి గుట్టుగా ఇస్తుంటాడు. కాలక్రమంలో ప్యాడ్ ల గురించి ఈ మధ్య ప్రజల్లో అవగాహన పెరిగింది. రుతుస్రావం అనేది ప్రకృతిధర్మంగా  అంగీకరిస్తున్నారు. వీటి గురించి ఆడ మగా బాహాటంగానే చర్చించుకుంటున్నారు. అరుణాచలం మురుగనాథమ్‌ని స్ఫూర్తిగా తీసుకుని అక్షయ కుమార్ నటించిన ప్యాడ్‌మెన్ సినిమా కూడా ఎంతో కొంత అవగాహన కలిగించింది. ఇప్పుడు ఆర్గానిక్ ప్యాడ్‌లపై గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని  మహిళలకు అవగాహన కల్పించేందుకు మరింత కృషి చేస్తున్నారు అంజూబిస్ట్‌లాంటి కొంతమంది మహిళలు.

Sanitary-Pad

మహిళలకు రుతుస్రావం అనేది ప్రకృతి సహజమైంది. ఒకప్పుడు ఈ పదాన్ని పలకాలంటే ఎంతో ఇబ్బంది పడేవారు స్త్రీలు. దాన్నో పాపంగా చూసేవారు అప్పటి కుటుంబాలు. ఇప్పటికీ గ్రామీణప్రాంత మహిళలకు ఈ ప్రక్రియపై సరైన అవగాహన కూడా లేదంటే దురదృష్టకరమైన విషయమే. పట్టణ ప్రాంత మహిళలు కొంతవరకు నయం. ఐతే ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. శానిటరీ ప్యాడ్‌ల వల్ల పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతోంది. అదెలా అంటారా.. పెద్ద పెద్ద కంపెనీల ద్వారా కొనుగోలు చేసే శానిటరీ ప్యాడ్‌ల తయారీలో ప్లాస్టిక్, హానికరమైన పెర్‌ఫ్యూమ్‌లను ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల మహిళల ఆరోగ్యంతోపాటు వాతావరణానికి నష్టం జరుగుతోంది.. మరి ఇటువంటి పరిస్థితిని మార్చలేమా..? మార్గంలేదా అంటే .. ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్‌ల రూపంలో పరిష్కారం ఉంది.

మహిళలకు మార్గదర్శి అంజూబిస్ట్ : భారతదేశానికి చెందిన ప్యాడ్ ఉమెన్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది అంజూబిస్ట్. మెట్రోపాలిటన్‌లతోపాటు గ్రామీణ ప్రాంత మహిళలు, యువతులకు ఆర్గానిక్ ప్యాడ్‌ల గురించి అంజూ అవగాహన కల్పిస్తోంది. ముఖ్యంగా అరటినార, వస్త్రంతో తయారుచేసిన శానిటరీ పాడ్స్ ఉపయోగం, లాభనష్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇంజినీర్, ఒన్నోవేటర్ అయిన అంజూ ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్‌ల గురించి అవగాహన కల్పించే సలహాదారుగా మారింది.
అంజూ ఈ సందర్భంగా మాట్లాడుతూ..ప్రతి ఏడాది ఇండియా మార్కెట్‌లో శానిటరీ ప్యాడ్స్ వల్ల వేల కోట్ల ఆదాయం వస్తోంది. కానీ వాటి వల్ల అంతేస్థాయిలో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఒకసారికే ఉపయోగించేవే. అంటే యూజ్ అండ్ త్రో అన్నమాట. పైగా ఈ రకం ప్యాడ్లు చెట్లను కొట్టివేయడం వల్ల వాటి కలపతో తయారుచేసినవి. ఈ సెల్యులోజ్ ఫైబర్‌ను ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే శానిటరీ ప్యాడ్స్ తయారీకి వాడుతున్నారు. సెల్యులోజ్ ఫైబర్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. పూర్తిగా ఇది తెల్లగా మారడానికి బ్లీచ్ చేస్తారు. ఈ ప్యాడ్స్‌పైన హాని కరమైన డయాక్సిన్స్ ఉంటాయి. వీటిని తయారుచేయడానికి చెట్లను నరకడం తప్పనిసరి అని చెబుతున్నారు.

ఇండియాలో 355 మిలియన్ల మహిళలు నెలనెలా రుతుస్రావాన్ని కలిగి ఉన్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ( 2015—2016) ప్రకారం 15- 25 వయసు మధ్య గల 57 శాతం మంది మహిళలు ఆరోగ్యకమైన ఉత్పత్తులను వాడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు మార్కెట్లో చాలా సంస్థలు తిరిగి ఉపయోగించడానికి వీలుపడని శానిటరీ ప్యాడ్స్‌ను తయారుచేస్తున్నాయి. భారతదేశంలో రుతుస్రావం అయ్యే మహిళలు ప్రతి ఏడాదికి సుమారు 5,800కోట్ల ప్యాడ్స్‌ను ఉపయోగిస్తున్నారు. అవన్నీ డిస్పోజబుల్. భూమిలో కలిసిపోవు. ఒకవేళ వీటిని కాల్చితే హానికరమైన డయాక్సిన్లు, ఫ్యూరన్లను విడుదల చేస్తాయి. పునర్వినియోగించలేని ప్యాడ్‌లు నాలుగు ప్లాస్టిక్ సంచులతో సమానమని ఓ అంచనా. ఈ ప్యాడ్‌లు విచ్ఛిన్నం కావడానికి సుమారు 500800 సంవత్సరాలు పడుతుంది.

అరటినారతో తయారుచేసిన ప్యాడ్స్: అరటి చెట్టు తన జీవితకాలంలో ఒక గెలనే ఇస్తుందనే విషయం తెలిసిందే. తర్వాత ఆ చెట్టుని కొట్టేయడం తప్పనిసరి. కాబట్టి ప్యాడ్‌కు ఉపయోగించే మెటీరియల్‌ను సహజ సిద్ధంగానే వస్తుంది. పైగా ఇది సేంద్రియమైనది. ఆరోగ్యానికి హాని కలిగించనిది. బనానా ఫైబర్ అనేది పీల్చుకునే తత్వాన్ని కలిగి ఉంటుంది. ఇది ఆరుసార్లు తిరిగి ఉపయోగించుకునే విధంగా పనికొస్తుంది. అంతేకాకుండా ఈ మెటీరియల్‌ను రీసైకిల్ చేయొచ్చు. నీళ్లలో నుంచి ఆరుసార్లు తీసినా ఇది తిరిగి ఉపయోగపడుతుందని పరిశోధనలో తేలింది. ఈ ప్యాడ్స్ మంచి క్వాలిటీ కలిగిన వస్త్రంతో కప్పి ఉంటుంది. ఇది మెనుస్ట్రువల్ బ్లడ్‌ను త్వరగా పీల్చుకోవడమే కాకుండా ఎటువంటి లీకేజీలకు ఆస్కారం ఉండదు. సులభంగా ఉతకడానికి వీలవుతుంది. నీళ్లలో నానబెట్టి సబ్బుకానీ, యాంటీసెప్టిక్ లిక్విడ్‌తోగానీ ఉతకొచ్చు. సరిగ్గా దీన్ని వాడగలిగితే కనీసం నాలుగైదు సంవత్సరాలు ఉపయోగించవచ్చు. కాకుంటే దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేమంటే ఉతికిన ఈ ప్యాడ్‌లను ఎండలో ఆరేయాలి. తడిగా ఉన్న ప్రాంతాల్లో వీటిని భద్రపరచకూడదు.

అవేర్‌నెస్ లేకపోవడం: తిరిగి ఉపయోగించుకునే ప్యాడ్స్‌పై ఇండియాలో అంతగా అవగాహన లేదు. ప్రపంచం మొత్తంమీద పెద్ద పెద్ద బిజినెస్‌మెన్‌లు తమ ఉత్పత్తుల్లో వేస్టేజ్‌ను కూడా తిరిగి ఉపయోగించుకునేలా చేసుకుంటారు. తయారుచేసే ఉత్పత్తిలో వేస్టేజ్ అనేదే లేకుండా చేసుకుంటారు. పనికిరాని దాన్ని కూడా పనికొచ్చేలా మరో ఉత్పత్తిని తయారుచేస్తుంటారు.ఈ సిద్ధాంతాన్నే ఇండియా కూడా వంటబట్టించుకుంది. అలాగే ప్రతి మహిళా తిరిగి ఉపయోగించుకునేందుకు వీలైన ఈ ప్యాడ్‌లను వాడినట్లయితే పర్యావరణానికి మేలు కలిగించినవారవుతారు. సుమారు 40వేల నుంచి 60 వేల వరకు ప్లాస్టిక్ బ్యాగులంతటి భారాన్ని తగ్గించినవారు అవుతారు. మెట్రోపాలిటన్ సిటీల్లో మహిళలు, యువతులకు ఇటువంటి ప్యాడ్స్‌పై కొంత అవగాహన ఇప్పుడిప్పుడే వస్తోంది. కానీ గ్రామాలు, చిన్న చిన్న సిటీల్లో మాత్రం వీటిపై సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. సేంద్రియ ప్యాడ్స్‌పై అవగాహన కల్పించేందుకు మహిళలు ఇప్పుడిప్పుడే ముందుకొస్తున్నారు. ఇది శుభపరిణామంగా భావించాలి.

క్లీన్ ఇండియా జర్నల్ సర్వే ప్రకారం 

* ఇండియాలో 432 మిలియన్ల శానిటరీ ప్యాడ్లను మహిళలు, యువతులు ఉపయోగిస్తున్నారు.
* వాటిలో 9000 టన్నుల ప్యాడ్స్ వాడిపడేసినవి. వాటివల్ల పర్యావరణానికి తీవ్రహాని కలిగిస్తున్నాయి.

ఇండియాలో శానిటరీ ప్యాడ్‌ల వినియోగం

* నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (201516) ప్రకారం 336 మిలియన్ల మంది అమ్మాయిలు, మహిళలు ఇండియాలో రుతుస్రావం అవుతున్నారు.
* వీరిలో 121 మిలియన్ మంది డిప్పోజబుల్ శానిటరీ ప్యాడ్స్‌ను ఉపయోగిస్తున్నారు.
* 48 శాతం మంది గ్రామీణ ప్రాంత మహిళలు, 77శాతం మంది పట్టణప్రాంత మహిళలు శానిటరీ ప్యాడ్స్‌ను వాడుతున్నారు.
* మెన్‌స్ట్రువల్ హెల్త్ అలియెన్స్ ఇండియా సర్వే ప్రకారం దేశంలోని వాడిపడేసిన శానిటరీ ప్యాడ్స్ , ఇతర చెత్త కంటే 45 శాతం ఎక్కువగా ఉంటోంది.
* కేవలం 2వేల ప్యాడ్స్ మాత్రమే భూమిలో కలుస్తోందని, అంతే ఆర్గానిక్ ప్యాడ్‌ను వాడే వారి సంఖ్యను దీన్ని బట్టి తెలుసుకోవచ్చంటున్నారు.
* చిన్నతరహా పరిశ్రమలు, లేదా ఎన్‌జివొల సాయంతో ఆర్గానిక్ ప్యాడ్‌లను తయారుచేయడం.
* నాట్ జస్ట్ ఎ పీస్ ఆఫ్ క్లాత్( ఎన్‌జెపిసి)లాంటి కొన్ని సంస్తలు క్లీన్ క్లాత్ ప్యాడ్స్‌ను అందిస్తున్నాయి. సాథి, ఎకోఫెమ్మీలాంటి కొన్ని సంఘాలు ఆర్గానిక్ ప్యాడ్‌లను తయారుచేస్తున్నాయి. కాటన్, బనానా, జ్యూట్‌ఫైబర్‌లాంటివి అందుబాటులో ఉన్నాయి.
* ఆర్గానిక్ ప్యాడ్ ఒక్కొక్కటి రు. 50 నుంచి రు. 500ల వరకు లభిస్తున్నాయి. అంటే సగటున ఓ రు. 50ల ప్యాడ్‌ను ఓ మహిళ ఏడాదికి రు.600లు ఖర్చుపెడితే సరిపోతుంది.
* ఆర్గానిక్ ప్యాడ్‌లు ఎక్కువగా ఆన్‌లైన్‌లో దొరుకుతాయి. ఆర్డరిచ్చి తెప్పించుకోవచ్చు. బెంగళూరు, చెన్నైల్లో ఆఫ్‌లైన్‌లో లభిస్తాయి.

గ్రీన్ మెనుస్ట్రుయేషన్

సుమారుగా ఓ మహిళ తన జీవిత కాలంలో దాదాపుగా 12000 నుంచి 16000వేల శానిటరీ ప్యాడ్‌లను ఉపయోగిస్తోంది. అవన్నీ కూడా డిస్పోజబుల్‌కు సంబంధించినవే. అంటే తిరిగి ఉపయోగపడేవి కావు. ఈ రకం ప్యాడ్‌లు ప్లాస్టిక్‌ను కలిగిఉండడంతో పాటు వీటిలో వాడే సువాసనలు హానికరమైన రసాయనాలను కలిగి ఉంటాయి. అవి పర్యావరణానికి, ఆరోగ్యానికి హాని కలిగించేవి. అంతేకాకుండా అక్కడ పనిచేసేవారికి కూడా అపాయమే. ఇలాంటి ప్యాడ్‌లు వాడొద్దని ఆర్గానిక్ ప్యాడ్‌లను వినియోగించాలంటూ ప్రచారానికి శ్రీకారం చుట్టారు బెంగళూరుకు చెందిన స్మిత, అంజలి, సుమలు. వరల్డ్ ఎన్విరాన్‌మెంట్ డే సందర్భంగా ఈ ముగ్గురూ గ్రామీణ ప్రాంత మహిళల్లో అవేర్‌నెస్ తేవాలని నిర్ణయించుకున్నారు. మెనుస్ట్రువల్ కప్, క్లాత్‌ప్యాడ్‌లు వాడాలంటూ ‘గ్రీన్ మెన్‌స్ట్రుయేషన్’ పేరుతో బెంగళూరు నుంచి గోవాకు కారు యాత్రచేపట్టారు.  ఈ సందర్భంగా తాము వెళేల ప్రాంతాల్లోని మహిళలకు  ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్‌లను ఉచితంగా అందిస్తూ, పర్యావరణ హితానికి పాటుపడుతున్నారు.