Home లైఫ్ స్టైల్ చదువుకు‘సై’…ఉద్యోగానికి ‘నై’!!

చదువుకు‘సై’…ఉద్యోగానికి ‘నై’!!

మగవారితో సమానంగా మహిళలు చదువుకొంటున్నారు. ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, యాడ్ ఏజెన్సీలు, నిర్మాణ ప్రదేశాలు, దుకాణాలు, రెస్టారెంట్లు, పైలెట్లు, ట్యాక్సీ డ్రైవర్లుగా ఇలా ప్రతి రంగంలోనూ మహిళలు విధులు నిర్వర్తిస్తున్నారు. సంతోషించదగ్గ పరిణామం. ఇది నాణానికి ఒకవైపు..చదువుకొనే మహిళల శాతం ఎక్కువైనా,  కార్యాలయాల్లో పనిచేసే మహిళల శాతం తక్కువని సర్వేలు చెబుతున్నాయి.  సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ  2017 సర్వే ప్రకారం…0.9 మిలియన్ మంది మంది పురుషులు ఉద్యోగం చేసే వారు ఉంటే,  మహిళలు 2.4 మిలియన్ మంది మాత్రమేనని అధ్యయనాల్లో తేలింది. కారణాలేవైనా ఇది మాత్రం ఒకింత విచారించదగ్గ విషయం..  

Women-Work

నగరాలలో 2004-05 సుంచి 2011-12 సంవత్సరాల మధ్య కాలంలో చేస్తున్న ఉద్యోగాలను వదిలేసిన మహిళల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనాల వల్ల తెలుస్తోంది. 19.6 మిలియన్ల మంది మహిళలు ఉన్న దేశంగా ఇండియా మూడో స్థానంలో ఉండగా మొదటి రెండు స్థానాల్లో షాంఘై, బీజింగ్‌లున్నాయి. కేవలం 27 శాతం మంది మహిళలు మాత్రమే కార్మికరంగంలో పనిచేస్తున్నారు. ఇండియా స్పెన్డ్ రిపోర్ట్ ఏప్రిల్ 9, 2016 లెక్కల ప్రకారం జి 20 దేశాల్లో కేవలం సౌదీ అరేబియా మాత్రమే పనిచేసే మహిళల శాతం బాగా పడిపోయింది. 2013 నాటికి దక్షిణాసియాలో పాకిస్థాన్ తర్వాత పనిచేసే మహిళల సంఖ్య తక్కువగా ఉంది. 34.8 శాతం నుంచి 27శాతం వరకు పడిపోయినట్లు ప్రపంచబ్యాంకు రిపోర్టు ప్రకారం తెలుస్తోంది.
గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నిరక్షరాస్యలు, కళాశాల విద్యనభ్యసించినవాళ్ల కంటే పనిచేసే మహిళా కార్మికుల సంఖ్యే ఎక్కువగా ఉంది. ప్రపంచ బ్యాంకు రిపోర్టు ప్రకారం …ఆర్థికంగా నిలబెట్టుకోవాల్సిన రోజులు వచ్చినప్పుడు కూడా ఈ విధంగా మహిళలు వెనుకబడి ఉండటం దురదృష్టకరం. ఇలాంటి సమయంలో మహిళలు ఉన్న ఉద్యోగాలను వదులుకుంటుండగా, 24.3 మిలియన్ మంది పురుషులు ఉద్యోగాలను సాధించుకుంటున్నారు.
ఎక్కువ శాతం పురుషులే: వేగంగా వృద్ధి చెందుతున్న టెలికాం, బ్యాంకింగ్ వంటి రంగాల్లో పురుషుల ఆధిపత్యం ఉంది. టెలికాంలో 83.84 శాతం మంది పురుషులు పనిచేస్తున్నారు. 78.79 శాతం మంది బ్యాంకింగ్ రంగంలో, ఆర్థిక సేవలు, బీమా, చమురు, గ్యాస్, విద్యుత్, ఉక్కు, ఖనిజాల వంటి కోర్ రంగాల్లో 74.75శాతం మంది పురుషులు పనిచేస్తున్నట్లు ఇండియా స్కిల్ రిపోర్ట్ 2017 జరిపిన సర్వేలో తేలింది. బ్యూటీ, హెల్త్‌కేర్‌లాంటి రంగాల్లో అధికంగా మహిళలు పనిచేసున్నారని తెలిపింది.
విద్యలో మిన్న: మహిళలు చదువుకోవడంలో భారీ పురోగతిని సాధిస్తున్నారు. అదే సమయంలో కార్యాలయాల్లో పనిచేసే మహిళాశాతం తగ్గిపోవడం గమనార్హం. ప్రాథమిక విద్య బాలికల నమోదు రేటు దాదాపు వంద శాతం ఉంది. ఉన్నత విద్యలో 2002 నుంచి 03 లో 7.5 శాతం ఉండగా 2012 నుంచి 2013లో అది 20 శాతానికి పెరిగింది.

Women-Working
చదువు ఉద్యోగం కోసం కాదు: గ్రామీణ ప్రాంతాల్లో 67శాతం మంది గ్రాడ్యుయేట్ చేసిన బాలికలు ఉద్యోగం చేయడం లేదు. నగరాలలో 68. 3 శాతం మంది విద్యావంతులైన మహిళలు ఉద్యోగాలు చేయడం లేదని యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్, విమెన్స్ వాయిస్, ఎంప్లాయిమెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇన్ ఇండియా 2015 నివేదిక తెలిపింది. బాలుర కంటే బాలికలే ఎక్కువ శాతం చదువుకుంటున్నారని తెలిపింది. మెకిన్స్‌సే గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ 2015 అధ్యయనం ప్రకారం మహిళలు పురుషులతో సమానంగా ఉద్యోగాలు చేసినట్లైతే, 2015 నాటికి భారతదేశం జిడిపిని 60 శాతం వరకు పెంచవచ్చు. ప్రస్తుతం మహిళలు ఇండియా జిడిపికి 17శాతం మాత్రమే తోడ్పడుతున్నారు. ఇది ప్రపంచ సగటు 37 శాతం కంటే తక్కువగా ఉంది. మహిళల ఆదాయం కూడా వారి వ్యక్తిగత శ్రేయస్సుకు సంబంధించింది. సంపాదించే మహిళలు ఆ కుటుంబంలో ఎక్కువ హోదాను కలిగి ఉంటారు. వారి సంపాదనతో తమ బిడ్డలకు మంచి విద్య, ఆరోగ్యంపై పెట్టుబడి పెడుతున్నారు. కానీ ఇంటి బాధ్యతలు వదులుకోకుండా, చదువుకొన్నా కూడా ఉద్యోగాలకు మాత్రం దూరంగా ఉంటున్నారని సర్వేలు చెబుతున్నాయి.