Home ఎడిటోరియల్ ‘కొలువు’దీరలేకపోతున్న మహిళ

‘కొలువు’దీరలేకపోతున్న మహిళ

 

భారత మహిళలు విద్యాభ్యాసం తర్వాత ఉద్యోగంలో చేరుతున్నప్పటికీ పెళ్ళి, కుటుంబంలో ఇతర సభ్యుల డిమాండ్లు, పిల్లల పెంపకం, ఇంటి బాధ్యతలు, సామాజిక ఒత్తిళ్ళు తదితర కారణాలతో ఉద్యోగం మానేయడం మామూలే. కాని మహిళలు పని ప్రదేశాల నుంచి తప్పుకోవడం వల్ల ఆ నష్టం దేశం కూడా భరించవలసి ఉంటుంది. సెకండరీ స్థాయి వరకు చదువుకున్న మహిళలు భారతదేశంలో చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అందులో చాలా మంది ఇంటిపనికే పరిమితమవుతున్నారు కాని పని ప్రదేశాలకు రావడం లేదు. దీని వల్ల భారత ఆర్ధిక వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది. భారతదేశంలో ఉద్యోగాలు చేస్తున్న వారిలో 33 శాతం మాత్రమే సెకండరీ స్థాయి విద్యాభ్యాసం కలిగి ఉన్నారు. మహిళలు పని ప్రదేశాల్లో లేకపోవడం వల్ల లక్షలాది మంది యోగ్యులైన వారు పనిచేయని పరిస్థితి తలెత్తుతున్నది.

దేశంలో దాదాపు 12 కోట్ల మంది మహిళలు, అంటే దక్షిణ కొరియా జనాభా కన్నా రెట్టింపు సంఖ్యలో ఉన్న మహిళలు సెకండరీ స్థాయి విద్యాభ్యాసం కలిగి ఉన్నారు. కాని వారు ఎలాంటి ఉద్యోగాలు చేయడం లేదు. దేశంలో అనేక ఉద్యోగాల్లో యోగ్యత, అర్హత కలిగిన వారి అవసరం ఉంది. ఈ మహిళలు అలాంటి ఉద్యోగాల్లో పని చేయగలరు. ఇందులో కనీసం సగం మంది ఉద్యోగాల్లో ప్రవేశించినా చాలా మార్పు వస్తుంది. ప్రస్తుతం కార్మిక శక్తిలో కేవలం 33 శాతం మాత్రమే సెకండరీ స్థాయి విద్యాభ్యాసం కలిగి ఉన్నారు. ఈ మహిళలు ఉద్యోగాల్లో ప్రవేశిస్తే కనీసం 46 శాతం కార్మికులు సెకండరీ స్థాయి విద్యాభ్యాసం కలిగిన వారు అవుతారు. ఫలితంగా పనితీరు, ఉత్పత్తి మెరుగుపడతాయి.

ఇటీవల జరిగిన ఒక సర్వేలో 70 వేల మంది అమ్మాయిల అభిప్రాయాలు సేకరించారు. గ్రాడ్యుయేట్లు అయిన తర్వాత తమదైన కెరీర్ ప్రారంభించాలన్న ఆలోచన ప్రతి అమ్మాయిలోనూ ఉంది. చాలా మంది అమ్మాయిలు ఎలాంటి వృత్తిలో స్థిరపడాలో కూడా నిర్ణయించుకుని చెప్పారు. 2012లో జాతీయ స్థాయిలో ఒక సర్వే జరిగింది. గృహిణులుగా ఉన్న మహిళల అభిప్రాయాలు సేకరించారు. మంచి అవకాశం, జీతం దొరికితే తాము పని చేయడానికి సిద్ధమే అని చాలా మంది అన్నారు. ఈ మహిళలు పని చేయడం ప్రారంభిస్తే, కార్మికశక్తిలో మహిళల ప్రాతినిధ్యం చాలా పెరుగుతుంది. దేశంలో పనిచేయగలిగిన వయసులో ఉన్న మహిళల్లో కేవలం 23 శాతం మాత్రమే కార్మికశక్తిలో పాలుపంచుకుంటున్నారు. జి 20 దేశాల్లో కార్మికశక్తిలో మహిళల ప్రాతినిధ్యం అతి తక్కువ ఉన్న దేశాలు రెండే రెండు. అన్నింటికన్న దిగువ స్థానంలో సౌదీ అరేబియా ఉంటే, దిగువ నుంచి రెండవ స్థానంలో ఇండియా ఉంది. మన పొరుగు దేశాలన్నింటి కన్నా మనం ఈ విషయంలో వెనుకబడి ఉన్నాం. నేపాల్ లో 80 శాతం మహిళలు పనుల్లో ఉన్నారు.

భారత ఆర్ధిక వ్యవస్థ 7 శాతం వృద్ధి రేటు నమోదు చేసిన కాలంలో అవకాశాలు పెరగడం వల్ల మహిళలు కూడా పనుల్లోకి వచ్చే అవకాశాలు పెరిగాయి. కాని అప్పుడు కూడా మహిళల ప్రాతినిధ్యం పెరగలేదు. 2011లో కన్నా 2017లో మహిళల ప్రాతినిధ్యం కోటి తొంభై లక్షలు తగ్గిపోయింది. దీనికి అనేక కారణాలున్నాయి. పందొమ్మిది సంవత్సరాల వయసులోనే చాలా మంది అమ్మాయిలకు వివాహం చేస్తున్నారు. ఇరవయ్యేళ్ళు వచ్చేసరికి ముగ్గురు అమ్మాయిల్లో కనీసం ఒకరు తల్లిగా మారుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో 25 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళల్లో 50 నుంచి 80 శాతం మంది పనులు చేస్తుంటారు. కాని భారతదేశంలో 25 శాతం కన్నా తక్కువ మంది మహిళలు మాత్రమే పనుల్లో కనబడుతున్నారు. దీనికి చాలా కారణాలున్నాయి.

చాలా మంది మహిళలు పనులు చేస్తున్నారు. కాని వారికి వేతనం ఉండడం లేదు. అందుబాటులో ఉన్న డాటా ప్రకారం ఎలాంటి వేతనం లేని సేవలు దాదాపు 87 శాతం భారత మహిళలు అందిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే చాలా ఎక్కువ. చైనాలో కూడా ఇలాంటి పరిస్థితి లేదు. అక్కడ వేతనం లేని సేవలందించే మహిళల శాతం 72 మాత్రమే. అమెరికాలో 61 శాతం మాత్రమే. పిల్లల పెంపకం, ఇంటి బాధ్యతలు చూసుకోవడం, ఇంట్లో వృద్ధులకు సేవలందించడం, గృహిణిగా అనేక పనులు వేతనం లేకుండా చేస్తున్నారు. ఈ పనులు తక్కువ కాదు. ఇంటికి సంబంధించిన పనుల్లో శుభ్రం చేయడం, పిల్లల పెంపకం, వంట, పిల్లలను చదివించడం, సలహాలివ్వడం, ఇంటి వ్యవహారాలు నిర్వహించడం వంటి పనులు పురుషుడి కన్నా 9.8 రెట్లు ఎక్కువగా మహిళలు చేస్తున్నారు. ఈ పనులకు వేతనం ఉండదు. పని తప్పదు, ఇది ఒక త్యాగం వంటిది. ఈ వేతనం లేని పనులకు విలువ కడితే భారత ఆర్ధికవ్యవస్థ ఉత్పాదకతలో 300 బిలియన్ డాలర్లు అదనంగా చేరుతాయి. భారతదేశంలో మహిళలు పని చేయాలని అనుకున్నప్పటికీ భద్రత మరో సమస్యగా వారి ముందుకు వస్తోంది.

నిజానికి కాలేజీలో చదువుతున్నప్పుడే కాలేజీకి వెళ్ళి రావడంలో భద్రత ఒక సమస్యగా ఉంటుంది. సురక్షిత ప్రయాణానికి పురుషుల కన్నా మహిళలు ఏటా 18 వేల రూపాయలు ఎక్కువగా చెల్లించవలసివస్తుందని కొన్ని సర్వేల్లో తెలిసింది. ప్రయాణ మార్గం సురక్షితమైంది కాకపోతే మంచి కాలేజీలను వదులుకుంటున్నారు. భద్రత ఉంటే అంత పేరులేని కాలేజీ అయినా చేరుతున్నారు. ఉద్యోగాల విషయంలోనూ ఈ భద్రత ప్రధాన సమస్యగా మారుతున్నది. అవసరమైతే ఉద్యోగం చేస్తున్న ప్రదేశానికి దగ్గరగా నివసించడం మంచిదని చాలా మంది భావిస్తున్నారు. కాని చాలా మంది భద్రత దృష్ట్యా ఉద్యోగం చేయకపోవడమే మంచిదనుకుంటున్నారు.

వరల్డ్ బ్యాంక్ ఎకనమిస్ట్ గిరిజ బోకర్ చెప్పిన దాని ప్రకారం, సురక్షితమైన ప్రయాణం కోసం మహిళలు చేసే ఖర్చు వల్ల నిజానికి వారి వేతనం పురుషుల కన్నా 20 శాతం తగ్గిపోతోంది. పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగం చేసే మహిళ పొందే వేతనం కన్నా పురుషుడు పొందే వేతనం ఎక్కువ ఉంటుంది. ప్రయాణానికి అయ్యే ఖర్చు పురుషుల కన్నా మహిళలకు ఎక్కువ. 2001లో వెయ్యి మంది బాలురకు 927 మంది బాలికలు ఉండేవారు, 2011 నాటికి వెయ్యి మంది బాలురకు 919 మంది బాలికలు ఉన్నారు. బాలికల పట్ల పెరుగుతున్న వివక్షకు ఇది నిదర్శనం. కేవలం మగపిల్లాడు మాత్రమే కావాలని కోరుకునే వారికి అనేక కారణాలు. కుటుంబం ఆస్తి కుటుంబంలోనే ఉండాలంటే అమ్మాయిలు ఉండరాదనుకునేవారు కూడా ఉన్నారు. వరకట్నాలు చెల్లించాలి కాబట్టి అమ్మాయి వద్దనుకునేవారు ఉన్నారు.

అమ్మాయిలు ముసలి తల్లిదండ్రులను చూసుకోలేరు కాబట్టి మగపిల్లాడు మాత్రమే కావాలనుకునేవారు ఉన్నారు. అంత్యక్రియలు చేసేది కొడుకే కాబట్టి కొడుకు కావాలనుకుంటారు. ఇవే కాదు, మహిళలకు ప్రతికూలమైన అంశాలు మన సమాజంలో చాలా ఉన్నాయి. ఒక మహిళ ఆరోగ్యకేంద్రానికి వెళ్ళాలన్నా కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోవలసి ఉంటుందని జాతీయ సర్వేలో తెలిసింది. దాదాపు 85 శాతం మహిళలు ఈ మాట చెప్పారు. చివరకు కిరాణా దుకాణానికి వెళ్ళాలన్నా కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోవాలని 58 శాతం మహిళలు చెప్పారు. స్వేచ్ఛకు ఇంతగా సంకెళ్ళున్నప్పుడు పని వెదుక్కోవడం కూడా సాధ్యం కాదు. ఒకవేళ ఉద్యోగం దొరికినా కుటుంబ సభ్యుల అనుమతి పొందడం ఒక సమస్యగా మారుతుంది. ఈ సమస్యలన్నీ కార్మిక శక్తిలో భారత మహిళల ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తున్నాయి. దీని ప్రభావం జిడిపిపై కూడా పడుతుంది.

* ఎన్. చంద్రశేఖరన్, రూపా పురుషోత్తమన్ (ది ప్రింట్)