Friday, March 29, 2024

లింగ సమానత్వ సాధనలో మహిళా నాయకత్వమే కీలకం

- Advertisement -
- Advertisement -

Women's leadership is crucial in achieving gender equality

 

కరోనా మహమ్మారి కారణంగా పురుషుల కన్నా మహిళలు ఎక్కువ సమస్యలు ఎదుర్కొన్నారు. మహిళా ఉద్యోగులు, కూలీలు, కార్మికులు ఉపాధి కోల్పోయి అర్ధాకలితో పోషకాహార లోపానికి గురయ్యారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడంతో అనారోగ్యం బారిన పడ్డారు. మూడవ ప్రపంచ దేశాల్లోని మహిళలు కనీసం సానిటేషన్ కు సంబందించి వసతులు లేక ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ పురుషులతో ధీటుగా మహమ్మరిని ఎదుర్కోవడంలో ముందున్నారు. కరోనా కష్టకాలంలో మహిళల యొక్క కృషిని గుర్తిస్తూ 2021 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి కోవిద్-19 నేపద్యంన సమాన భవిష్యత్ సాధనలో మహిళా నాయకత్వం అనే థీమ్ తో నిర్వహిస్తుంది. సమాజం యొక్క అభివృద్ధిలో స్త్రీ పాత్ర వెలకట్టలేనిది. రంగం ఏదైనా కానీ, అందులో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో స్త్రీలు కీలక భూమిక పోషిస్తున్నారు. అయితే ప్రపంచ చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే స్త్రీ జాతి సమస్తం ద్వితీయశ్రేణి గానే పరిగణించబడింది. పురుషులతో పాటు సమానంగా పని చేస్తున్నప్పటికీ మెరుగైన వేతనాన్ని, గౌరవాన్ని పొందలేకపోయారు.

ప్రభుత్వాలను ఎన్నుకునే విధానంలోనూ మహిళల పట్ల వివక్ష చూపి ఓటు హక్కును దూరం చేశారు. ఆ పీడన నుండి విముక్తి పొందడానికి మహిళా హక్కులను సాధించుకునేందుకు 19వ శతాబ్దిలో కీలకంగా వ్యవహరించిన కార్మిక ఉద్యమాలు ఎంతగానో దోహదపడ్డాయి. 1908లో అనువైన పనిగంటలు, మెరుగైన వేతనం, ఓటు హక్కును కోరుతూ న్యూయార్క్ లో 15 వేల మంది మహిళలు దీక్ష చేశారు. 1917లో రష్యా యుద్ధం సమయంలో ఆహారం-శాంతి నినాదంతో సహాయ నిరాకరణ చేశారు. ఆ సందర్భంలో ఏర్పాటయిన తాత్కాలిక ప్రభుత్వం మహిళలకు రాజకీయ హక్కులలో భాగంగా ఓటు హక్కును కల్పించింది. రష్యన్ క్యాలెండర్ ప్రకారం అది మార్చి 8. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా విద్యా, ఉద్యోగ, సామాజిక, రాజకీయ, వ్యాపార రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతూనే ఉంది. వారిని మరింతగా ప్రోత్సహించడమే లక్ష్యంగా, లింగ సమానత్వం, మహిళా సాధికారత సాధించడమే ప్రధాన ఎజెండాగా 1975 నుండి ఐక్యరాజ్యసమితి మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా ఈ వేడుకలు ఘనంగా నిర్వహించబడుతున్నప్పటికీ, మహిళల నాణ్యమైన బ్రతుకుల్లో వచ్చిన మార్పులు నామమాత్రమే. అధికారికంగా వేడుకల నిర్వహణ ఘనంగా జరుపుకొని 45 సంవత్సరాలు గడిచినప్పటికీ, ఆ వేడుక ప్రధాన లక్ష్యమైన లింగ సమానత్వాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశం కూడా పూర్తిగా సాధించలేకపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళల్లో 23 శాతం పురుషుల కన్నా తక్కువ స్థాయిలో వేతనాలు పొందుతున్నారు. పురుషులతో సమానంగా దాదాపు సగం జనాభా కలిగిన మహిళల్లో పార్లమెంటేరియన్ల సంఖ్య కేవలం 24 శాతం మాత్రమే. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒక మహిళ లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు.

భారతదేశ చరిత్రను ప్రస్ఫుటంగా పరిశీలిస్తే, ప్రాథమికంగా కుటుంబ వ్యవస్థ నుంచి మొదలు, సమాజం వంటి బృహత్తర స్థాయి వ్యవస్థల దాకా లింగ వివక్ష స్పష్టంగా కనిపిస్తుంది. భారతీయ కుటుంబ వ్యవస్థ బలీయమైన పితృస్వామిక కుటుంబ వ్యవస్థ లక్షణాలను కలిగి ఉంది. స్త్రీని దేవతగా పూజించే ఈ దేశంలోనే స్త్రీలకు కనీస మానవ హక్కులు నిరాకరించబడినవి. కుల వివక్షకు దీటుగా, లింగ, వర్గ, వర్ణ, ప్రాంత వివక్ష సైతం రాజ్యమేలింది. స్త్రీలను వంటింటికే పరిమితం చేస్తూ, కనీసం ఆరు బయటకు వచ్చే స్వేచ్ఛ కూడా ఇచ్చేవారు కాదు. చదువుకోవడం, విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం పూర్తిగా నిషిద్ధం. ఇటువంటి సందర్భంలో పూలే దంపతులు, రనడే, కార్వే, అంబేద్కర్ వంటి సామాజిక ఉద్యమకారులు స్త్రీ విద్యా హక్కుల సాధన, రక్షణ కోసం, సమాజాభివృద్దిలో, మానవాభివృద్దిలో గురుత్తరమైన భాద్యతను గుర్తించి వారి వికాసానికి తీవ్రంగా కృషి చేశారు. వారి కృషి ఫలితంగానే నేడు కాస్తో కూస్తో మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారు.

అయినప్పటికీ ఆ మహనీయుల కృషి ఫలాలు స్వాతంత్య్రం వచ్చి 70 వసంతాలు గడిచినప్పటికీ నేటికీ పూర్తిగా అందుకోలేకపోతున్నాం. శాస్త్ర, సాంకేతిక రంగాలు, పౌర సేవలు ఎంతగానో అభివృద్ధి చెందిన ప్రస్తుత తరుణంలోనూ, విద్యా, ఉపాధి, రాజకీయ రంగాలలో అసమానతలు, వరకట్న వేధింపులు, గృహ హింస, లైంగిక దాడులు, బాల్య వివాహాలు, పడుపు వృత్తి, భ్రూణ హత్యలు, పోషకాహార లోపం వంటి అనేక సామాజిక, సాంస్కృతిక, ఆర్ధిక, రాజకీయ వివక్ష సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. లింగ సమానత్వం సాధించాల్సిన చోట లింగభేదపరమైన దాడులు తగ్గకపోగా, రోజురోజుకూ అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ వంటి సంఘటనలు అందులో రాజకీయ, న్యాయవ్యవస్థ స్పందించిన తీరు భారతదేశంలో మహిళల రక్షణకు సంబంధించి ప్రస్తుత పరిస్థితులను అద్దం పడుతుంది.

2020 లో విడుదలైన జాతీయ నేర నమోదు విభాగం NCRB గణాంకాల ప్రకారం 2018-19 సంవత్సరాల మధ్య మహిళలపై జరుగుతున్న నేరాలు 7.3 శాతం పెరగడం, ఈ జాబితాలో ఉత్తర ప్రదేశ్ (59,853-14.7%), రాజస్థాన్ (41,550-10.2%), మహారాష్ట్ర (37,144-9.2%)తో తొలి మూడు స్థానాల్లో నిలవడం, భారతదేశంలో సగటున రోజుకు దాదాపు 88 రేప్ కేసులు నమోదవుతూ ఉండడం, ఈ జాబితాలో రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ తొలి రెండు స్థానాల్లో ఉండడం దేశంలో మహిళలు ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారు అనడానికి నిదర్శనం. ఇది అధికార గణాంకాలలో నమోదైన కేసుల సంఖ్య మాత్రమే. గ్రామీణ, గిరిజన, మురికివాడల్లో నేటికీ ప్రాథమిక సామాజిక నియంత్రణ వ్యవస్థ కొనసాగుతూనే ఉంది. ఇలాంటి చాలా కేసుల్లో న్యాయం స్థానిక కుల పంచాయితీ లోని పెద్దల సమక్షంలో జరిగిపోతుంది. ఈ లెక్కన NCRB గణాంకాల లో నమోదవని కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.

రాజ్యాంగబద్ధంగా సమస్యలు రూపుమాపడానికి ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ పరిస్థితుల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. కన్యాశుల్కం నుంచి వరకట్న సమస్య గా రూపాంతరం చెందడంలో భాగంగా శాస్త్ర, సాంకేతిక పరికరాలు, వాహనాలు అందులో అంతర్భాగంగా మారాయి. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రుల గుండెల్లో గుదిబండలాగా, భావిస్తున్నారు. ఈ తంతు ఆపడానికి 1961 లోనే ప్రభుత్వం వరకట్న నిషేధ చట్టాన్ని తీసుకువచ్చినప్పటికీ వరకట్నం లేనిదే వివాహం జరగలేని పరిస్థితికి వచ్చింది నేటి సమాజం. ఇలా కట్న కానుకలు, ఆభరణాలు, పెట్టు పోతలు, ఇచ్చుకోలేని ఎన్నో కుటుంబాలు దీనావస్థను ఎదుర్కొంటున్నాయి. చివరకు వివాహమవ్వక, తల్లిదండ్రులకు భారం కాలేక బాలికల ఆత్మహత్యలకు, బాల్య వివాహాలకు దారితీస్తుంది.

కొన్నిసార్లు వరకట్నం ఇచ్చిన అదనపు కట్నం కోసం వేధింపులు తప్పడం లేదు. ఎన్సీఆర్బీ-2019 గణాంకాల ప్రకారం 7115 కేసులు భారతదేశంలో నమోదయ్యాయి. అయితే అనధికారికంగా ప్రతి ఏటా జరుగుతున్న వివాహాలలో 99 శాతం వివాహాలు అనుభవంలో వరకట్నం ఇవ్వడం లేదా తీసుకోవడం ద్వారానే జరుగుతున్నాయి. వాస్తవానికి అన్ని కేసులు చట్టం పరిధిలో నమోదవడం లేదు. ఇలా వరకట్నం కోసం పీడిస్తున్న వారిలో అత్యధికులు విద్యాధికులు కావడం గమనార్హం. గృహహింస నిరోధక చట్టం-2005 లోనే వచ్చినప్పటికీ నేటికి గృహహింస ఏ మాత్రం తగ్గడం లేదు, కేవలం దాని రూపు మార్చుకుంటుంది అంతే. కానీ ఇటువంటి గృహ సంబంధ కేసుల్లో బాధితుల నుండి పెద్దగా ఫిర్యాదులు అందడం లేదు. అందుకు కుటుంబ గౌరవం, సముదాయ కట్టుబాట్లు, బయటి వ్యక్తుల ప్రేరణ, చట్టాల పట్ల సరైన అవగాహన లేకపోవడం వంటి అనేక అంశాలు దోహద పడుతున్నాయి.

మహిళల అభివృద్ధికి అవరోధంగా నిలుస్తున్న మరొక ప్రధాన సమస్య బాల్య వివాహాలు. బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 ప్రకారం బాలుర కనీస వివాహ వయస్సు 21 సంవత్సరాలు, బాలికల వివాహ వయస్సు 18 సంవత్సరాలుగా నిర్ధారించబడింది. వివాహ వయస్సులోనూ లింగ సమానత్వం సాధించాలనే ఉద్దేశ్యంతో బాలికల కనీస వివాహ వయస్సు బాలుర తో సమానంగా పెంచడానికి 2020 లో జయ జైట్లీ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేయబడింది. ఈ కమిటీ నివేదికలో భారతదేశంలో బాల్యవివాహాలు 27 శాతానికి పైగా తగ్గాయని పేర్కొంది. అయితే యునెస్కో అభిప్రాయం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న బాల్య వివాహాల లో దాదాపు 33 శాతం భారతదేశంలో జరుగుతున్నవే కావడం ఆలోచించవలసిన అంశం. జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ ప్రకారం ఈ జాబితాలో పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి వెనుకబడిన రాష్ట్రాలు త్రిపుర వంటి ఈశాన్య రాష్ట్రం తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

వరల్ ఎకనామిక్ ఫోరం అంచనా ప్రకారం 2030 నాటికి బాల్య వివాహాల బారినపడే బాలికల సంఖ్య రెండు బిలియన్ల దాటనుంది. వీటి వల్ల చిన్న వయస్సులోనే గర్భం దాల్చడం కారణంగా తల్లి, బిడ్డలో అనారోగ్య సమస్యలు, గర్భస్రావం జరిగే ప్రమాదముంది. శిశు మరణాల రేటు వృద్ధిచెందుతుంది. పోషకాహార లోపం, రక్తహీనత, ఐరన్ లోపం వంటి సమస్యలు ఎదురవుతాయి. బాల్యవివాహాలతో బాలికలు యవ్వన దశలోనే వితంతువులుగా మారుతూ సమాజం నుండి కఠినమైన వివక్షను ఎదుర్కొంటున్నారు. ఈ బాల్య వివాహాలు జరగడానికి కారణాలు లేకపోలేదు, పేదరికం, ఆవిధ్య, సనాతన సాంప్రదాయాలు, మూడ నమ్మకాలు, వరకట్నం తో పాటుగా తల్లిదండ్రులు ఆడపిల్లలను భారంగా భావించడం, సమాజంలో బాలికలకు రక్షణ లేకుండా పోవడం, వారిపై జరుగుతున్న లైంగిక దాడులు, ఇవన్నీ చిన్న వయసులోనే వివాహాల వైపు ప్రేరేపిస్తున్నాయి.

సమాజంలో మహిళల యొక్క పాత్రను అర్థం చేసుకోవాలి అంటే సామాజిక స్పృహ అత్యంత అవసరం. విలువలతో కూడిన సమాజం నిర్మితం కావాలి అంటే మహిళా శక్తి ప్రధానమైన ఏజెంట్. ఆ దిశగా మహిళలకు గుర్తింపు దక్కవలసిన అవసరం ఉన్నది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా స్త్రీని అనేక రూపాలలో ఉపయోగించుకుంటున్న పితృస్వామిక వ్యవస్థ వారికి ఇవ్వాల్సిన కనీస గుర్తింపును మాత్రం విస్మరిస్తోంది. ‘సమాన పనికి సమాన వేతనం’ చట్టాలు ఉన్నప్పటికీ ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న నేటికీ ఆచరణకు నోచుకోవడం లేదు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో ఆ దిశగా ఒక అడుగు పడినా ఇంకా మిగతా విభాగాల్లో అది అమలు కావాల్సి ఉంది. షి టీం, భరోసా, సఖి వంటి ప్రభుత్వ రంగ సంస్థలు, పార్లమెంటరీ చట్టాలు ఏవీ కూడా నేరాలను అదుపు చేసి మహిళలను రక్షించలేకపోతున్నాయి.భద్రత, భరోసాను ఇవ్వలేకపోతన్నాయి.

అయితే దానిని వ్యవస్థల మీద ఆపాదించడం కంటే క్షేత్రస్థాయిలో ప్రజల్లో మార్పు తీసుకువచ్చే దిశగా కృషి చేయవలసిన అవసరం ఉన్నది. కోవిద్ 19 లాక్డౌన్ నేపధ్యాన మహిళల పట్ల దాడులు వేధింపులు పెరిగినట్టు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పేర్కొంటున్నాయి. ఇటువంటి తరుణంలో ఈ తరహా దాడులు తగ్గాలంటే మహిళా నాయకత్వం మరింత బలోపేతం అవ్వాల్సిన అవసరం ఉంది. కోవిద్ 19 నేపథ్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పురుషులకు ధీటుగా మహిళా డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు, మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది చేసిన కృషి అనిర్వచనీయమైనది. అటువంటి త్యాగమూర్తుల సేవలను మరొక్కసారి గుర్తు చేసుకుంటూ, మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ, కోవిద్ విపత్తుల్లోనూ పురుషులతో సమానంగా కఠోరంగా శ్రమించిన మహిళలను ఐక్యరాజ్యసమితి గుర్తించి 2021 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ‘సమాన బావిష్యత్ సాధనలో మహిళా నాయకత్వ సంవత్సరంగా’ ప్రకటించడం హర్షణీయం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News