Friday, March 29, 2024

ఫైనల్లో భారత్

- Advertisement -
- Advertisement -

సెమీఫైనల్ మ్యాచ్ వర్షార్పణం

ఇంగ్లండ్ ఇంటికి, ఆస్ట్రేలియాతో హర్మస్ సేన టైటిల్ పోరు
సిడ్నీ: మహిళల ట్వంటీ20 ప్రపంచకప్ చరిత్రలోనే తొలి సారి భారత్ ఫైనల్‌కు చేరుకుంది. ఇంగ్లండ్‌భారత్ జట్ల మధ్య గురువారం సిడ్నీలో జరిగిన తొలి సెమీఫైనల్ సమరం వర్షం వల్ల ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యింది. దీంతో లీగ్ దశలో అజేయంగా నిలిచిన భారత్ మెరుగైన పాయింట్ల తేడాతో ఇంగ్లండ్‌ను వెనక్కి నెట్టి తుది సమరానికి అర్హత సాధించింది. రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో దక్షిణాఫ్రికాను ఓడించి ఫైనల్‌కు చేరింది. ఆదివారం చారిత్రక మెల్‌బోర్న్‌లో గ్రౌండ్‌లో జరిగే ఫైనల్లో భారత్‌తో ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనుంది.
వర్షార్పణం
భారత్‌ఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం జరిగిన తొలి సెమీఫైనల్ సమరానికి వర్షం అంతరాయం కలిగించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో మైదానం మొత్తం చిత్తడిగా మారింది. వర్షం ఏకధాటిగా కురవడంతో మ్యాచ్ జరగలేదు. ఓవర్లను కుదించి మ్యాచ్‌ను నిర్వహించాలని భావించినా అది కూడా సాధ్యం కాలేదు. దీంతో ఇరు జట్ల క్రికెటర్లు పెవిలియన్‌కే పరిమితం కాక తప్పలేదు. రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య జరిగే సెమీఫైనల్‌ను ప్రత్యక్షంగా చూడాలని భావించిన అభిమానులకు వరుణుడు నిరాశే మిగిల్చాడు. ఇక మ్యాచ్ ఆరంభానికి ముందే వర్షం జోరుగా కురవడంతో మైదానం మొత్తం చిత్తడిగా తయారైంది. మరోవైపు నిర్వాహకులు పిచ్ మొత్తాన్ని కవర్లతో కప్పి ఉంచారు. కానీ, వర్షం ఎంతకి తగ్గక పోవడంతో మ్యాచ్ సాగడంపై అనుమానాలు నెలకొన్నాయి. కాగా, కొన్ని ఓవర్ల పాటయిన మ్యాచ్‌ను నిర్వహించాలని అంపైర్లు భావించారు. కానీ, భారీ వర్షం వల్ల అది కూడా సాధ్యపడలేదు. చివరికి టాస్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దు కాక తప్పలేదు.
తొలిసారి ఫైనల్లో
ఇక, వర్షం వల్ల మ్యాచ్ రద్దు కావడంతో భారత్ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. గ్రూప్ దశలో భారత్ ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించింది. మరోవైపు గ్రూప్‌బిలో ఇంగ్లండ్ మూడు మ్యాచుల్లో గెలిచి సౌతాఫ్రికా చేతిలో ఓటమి పాలైంది. భారత్ కంటే ఇంగ్లండ్ మెరుగైన రన్‌రేట్ కలిగి ఉన్నా పాయింట్లు ఆధికంగా ఉండడంతో హర్మన్ సేన ఫైనల్‌కు అర్హత సాధించింది. మరోవైపు ఇంగ్లండ్ సెమీఫైనల్లోనే ఇంటిదారి పట్టక తప్పదు. ఇదిలావుండగా ట్వంటీ20 ప్రపంచకప్ చరిత్రలోనే భారత మహిళా క్రికెట్ జట్టు తొలిసారి ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించింది. గతంలో మూడు సార్లు భారత్ సెమీస్‌లోనే నిష్క్రమించింది. అయితే ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఈ ప్రపంచకప్‌లో మాత్రం భారత్ తుది పోరుకు దూసుకెళ్లింది. లీగ్ దశలో వరుస విజయాలు సాధించడం భారత్‌కు కలిసి వచ్చింది. దీంతో మ్యాచ్ రద్దయినా మెరుగైన పాయింట్ల ఆధారంగా హర్మన్‌ప్రీత్ సేన ఫైనల్‌కు దూసుకెళ్లింది.
ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు
మరోవైపు ఈసారి ఎలాగైనా ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడాలని భావించిన మాజీ ఛాంపియన్ ఇంగ్లండ్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. సెమీఫైనల్ జరిగి ఉండే ఇంగ్లండ్‌కే గెలిచే అవకాశాలు అధికంగా ఉండేవనడంలో సందేహం లేదు. ఎందుకంటే భారత్‌తో పోల్చితే ఇంగ్లండ్ కాస్త బలంగా ఉండడమే దీనికి కారణం. అంతేగాక భారత్‌పై మెరుగైన రికార్డు కలిగి ఉండడం కూడా ఇంగ్లండ్ కలిసి వచ్చే అంశంగా ఉండేది. కానీ, వర్షం వల్ల మ్యాచ్ రద్దు కావడంతో భారత్ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. ఇక, ఇంగ్లండ్ అనూహ్యంగా సెమీఫైనల్లోనే ఇంటిదారి పట్టక తప్పలేదు.

Womens T20 World Cup: INDW Entered into Finals

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News