Friday, April 19, 2024

పని గంటలు- నిరుద్యోగ మంటలు

- Advertisement -
- Advertisement -

Working hours- Unemployment fires

 

పని సందర్భంగా వడదెబ్బ సంబంధిత అత్యధిక గాయా లు, సమస్యలు పరిగణనలోకి రావటం లేదని న్యూయార్క్ టైవ్‌‌సు పత్రిక జూలై 15న ఒక విశ్లేషణ ప్రచురించింది. వడగాలులు శ్రమ జీవులను ప్రత్యేకించి పేదవారిని అనూహ్య పద్ధ్దతులలో ఎలా గాయపరుస్తాయో తాజా సమాచారం వెల్లడించిందని పేర్కొన్నది. దాని సారాంశం ఇలా ఉంది. తీవ్ర వడగాడ్పులు సంభవించినపుడు పెద్ద సంఖ్యలో వడదెబ్బలే కాదు పడిపోవటం, యంత్రాలను సరిగా పని చేయించలేకపోవటం, వాహనాల మధ్య ఇరుక్కుపోవటం వంటివి కూడా గణనీయంగా ఉంటున్నాయి. పని స్ధలాల్లో ఇతర కారణాలతో తగిలే గాయాలకు కాలిఫోర్నియాలోనే అదనంగా ప్రతి సంవత్సరం వడదెబ్బ గాయాలు ఇరవై వేలు తోడవుతున్నాయి. వీటి వలన పని మీద కేంద్రీకరించటం కష్టం అవుతోంది. పశ్చిమ అమెరికా, బ్రిటిష్ కొలంబియాలో ఇటీవలి వడగాడ్పులకు 800 మంది మరణించారు. బహిరంగ ప్రదేశాల్లోనే కాదు ఉత్పాదక యంత్రాలు, గోడవున్లలో పని చేసే వారికి కూడా వడగాడ్పులు ముప్పు తెస్తున్నాయి.

వడగాడ్పు గాయాల వలన వేతనాలను కోల్పోవటం, వైద్య ఖర్చు పెరగటం, ఉష్ట్రోగ్రతలు పెరిగే కొద్దీ వేతన వ్యత్యాసం కూడా పెరుగుతోంది. 2001 నుంచి 2018 వరకు కాలిఫోర్నియాలో గాయాలకు పరిహారం చెల్లించిన కోటీ పది లక్షల నివేదికలను పరిశోధకులు విశ్లేషించారు. తేదీలు, పని ప్రాంతాలు, వడగాడ్పుల తీవ్రత, గాయాల సంఖ్య తీరుతెన్నులను విశ్లేషించగా వేడి ఎక్కువగా ఉన్నపుడు గాయాలు ఎక్కువగా నమోదైనట్లు తేలింది. అధికారికంగా సగటున 850 గాయాలైనట్లు నివేదికలు చూపాయి. అయితే వాస్తవ గాయాలతో పోల్చితే ఇవి చాలా తక్కువ. అరవై డిగ్రీల ఫారన్‌హీట్ ఉన్నపుడు తగిలిన గాయాలతో పోల్చితే 8590 డిగ్రీలు ఉన్నపుడు ఐదు నుంచి ఏడు శాతం, వంద డిగ్రీలకు పెరిగినపుడు పది నుంచి 15 శాతం పెరిగాయి. వడ దెబ్బ గాయాలు గరిష్ఠ వేతనాలు పొందే వారితో పోల్చితే కనిష్ట వేతనాలు పొందే కార్మికులకు ఐదు రెట్లు ఎక్కువ ఉన్నాయి. వడదెబ్బ తగలకుండా కొన్ని చర్యలు తీసుకున్న తరువాత కేసులు సంఖ్య తగ్గింది తప్ప తీరుతెన్నులు మాత్రం అలాగే ఉన్నాయి.

మనది ఉష్టమండల ప్రాంతం. ఉష్ణోగ్రతలు అమెరికా కంటే ఎక్కువ నమోదవుతున్నాయి. వేసవిలో 110-115 మధ్య ఉన్న సందర్భాలు ఎన్నో. రికార్డు స్ధాయిలో రాజస్థాన్‌లో 124 కూడా నమోదైంది. అధిక ఉష్ణోగ్రత నమోదైనపుడు వడదెబ్బ తగలకుండా నివారణ చర్యలు తీసుకున్న సంస్థలు ఎన్ని ఉన్నాయన్నది ప్రశ్నార్థకం.అమెరికా మాదిరి మన దేశంలో కూడా పరిశోధన చేస్తే తప్ప తీవ్రత బయటకురాదు. వడదెబ్బ ఒక్కటే కాదు కష్టజీవుల జీవితాలను దెబ్బతీస్తున్న వృత్తి రుగ్మత అంశాలు అనేకం ఉన్నాయి. వాటిలో ఓవర్‌టైవ్‌ు కూడా ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యుహెచ్‌ఒ) తొలిసారిగా అంతర్జాతీయ కార్మిక సంస్ధ(ఐఎల్‌ఒ)తో కలసి దీర్ఘ పని గంటల మీద నిర్వహించిన సర్వే ప్రకారం ఏడాదికి ఆ కారణంగా మరణిస్తున్నవారు 7,45,000 మంది (ఇది 2016 సంఖ్య) ఉన్నారట. గుండెపోటు, హృదయ సంబంధ వ్యాధులు దీనికి కారణం. ఆగ్నేయ ఆసియా, పశ్చిమ పసిఫిక్ ప్రాంత దేశాలలోని కార్మికులు ఎక్కువగా ప్రభావితులవుతున్నారు. ఆసియాలో గుండెపోటు ముప్పు మామూలుగానే ఎక్కువ, దీనికి అధిక పని గంటల సమస్య మరింత పెంచుతోంది.

వారానికి 35-40 గంటల పాటు పని చేసేవారితో పోల్చితే 55 గంటలు, అంతకు మించి పని చేసే వారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు 35 శాతం, గుండె సంబంధ వ్యాధులతో ప్రాణాలు కోల్పోయే ముప్పు 17 శాతం ఎక్కువగా ఉంది. ఈ కారణంగా మరణిస్తున్న వారిలో నాలుగింట మూడు వంతులు మధ్య వయస్కులు లేదా వృద్ధులు ఎక్కువగా ఉన్నారు. రోజుకు ఎక్కువ గంటలు పని చేసిన వారిలో ఇది పని మానేసిన తదుపరి జీవితంలో, కొన్ని సందర్భాలలో దశాబ్దాల తరువాత కూడా ప్రభావం చూపుతోంది.అధిక పని గంటలు అంటే భౌతిక శ్రమే చేయనవసరం లేదు. ఇతరత్రా పనిలో ఎక్కువ గంటలు ఉన్నా ముప్పు ఉంటుంది. పిల్లలతో సహా అధిక గంటలు పని చేస్తున్నవారు ప్రపంచ జనాభాలో తొమ్మిది శాతం ఉన్నారు. 2000 సంవత్సరం తరువాత వీరి సంఖ్య పెరుగుతోంది.

వృత్తిపరంగా తలెత్తే రుగ్మతలకు కారణాలు అనేక వాటిలో సింహభాగం అధిక పని గంటలే అని తేలింది. ఎక్కువ సేపు భౌతిక శ్రమ చేయటం ముప్పు కారణమైతే, అది లేకుండా ఇతరంగా ఎక్కువ గంటలు పని చేసే వారు మద్యం, పొగాకు వినియోగం, తక్కువ సేపు నిద్రపోవటం, వ్యాయామం లేకపోవటం, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవటం వంటి అంశాలు కూడా ముప్పును పెంచుతున్నాయి. దీర్ఘకాలం పనిచేసే వారి సంఖ్య ప్రపంచ వ్యాపితంగా పెరుగుతోంది. కరోనా మహమ్మారి సమయంలో అది మరింత పెరిగింది. అధికపని చేసినందుకు ప్రతిఫలం కూడా అన్ని సందర్భాలలో ఉండటం లేదు. ఇంటి నుంచి పని చేసే వారు సగటున 3.6 గంటలు ఎక్కువ సేపు విధి నిర్వహణలో ఉంటున్నారని తేలింది.యజమానులు వృత్తి రుగ్మతలను పరిగణనలోకి తీసుకోవాలని, తక్కువ పని గంటలు ఉంటే ఉత్పత్తి ఎక్కువ వస్తుందని గ్రహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ్ద పేర్కొన్నది. అప్పగించిన ప్రాజెక్టు పనులు నిర్ణీత గడువులోగా పూర్తి కావాలనే లక్ష్యాలు నిర్ణయిస్తున్నందున వాటి కోసం ఇంట్లో లేదా పని స్ధలాల్లో ఎక్కువ సేపు పని చేయటంతో పాటు వత్తిడి సమస్య కూడా తలెత్తుతోంది.

అధిక పని గంటల కారణంగా గుండెపోటు, హృదయ సంబం ధ వ్యాధులతో మరణిస్తున్న వారిలో నాలుగింట మూడు వంతుల మందికి గుండెకు రక్త ప్రసరణ తగ్గిన కారణంగా తలెత్తే ఇస్కీమిక్ హృదయ వ్యాధి మూలం అని తేలింది. దీనికి వత్తిడి, అధిక రక్తపోటు కారణం. ప్రస్తుతం ప్రపంచంలో కేవలం 15 శాతం మంది కార్మికులకు మాత్రమే వృత్తిపరమైన రుగ్మతల చికిత్స ప్రత్యేక సేవలు అందుబాటులో ఉన్నాయి. తమిళనాడులోని తిర్పూరు కోయంబత్తూరు ప్రాంతంలోని నూలు, వస్త్ర, దుస్తుల పరిశ్రమలో వెలువడే పత్తి ధూళి కారణంగా కార్మికుల్లో బ్రోంకైటిస్, టివి, బరువు తగ్గటం, వినికిడి శక్తి నష్టపోవటం వంటి రుగ్మతలు తలెత్తుతున్నాయని విశ్లేషణలో తేలింది. ఈ పరిశ్రమల్లో పని చేసే వారి జీవిత కాలం కూడా తగ్గిపోతోంది. ఎన్‌ఎస్‌ఎస్ 2018 సర్వే ప్రకారం 83 శాతం మంది కార్మికులకు ఆరోగ్య బీమా లేదు.

అధిక గంటలు పని చేస్తున్న వారు ఆసియాలో ఎక్కువగానూ ఐరోపాలో తక్కువగానూ ఉన్నారు. తగిన ప్రతిఫలం లేదా ఆదాయం లేని కారణంగా ఆసియాలోని అనేక ప్రాంతాలలో రోజుకు ఒకటి కంటే ఎక్కువ పనులు చేస్తున్నవారెందరో. పని గంటల పరిమితులు ఉన్నప్పటికీ వాటికి వక్ర భాష్యాలు, మరొక కారణమో చెప్పి ఎక్కువ పని గంటలు చేయిస్తున్నారు. అదొక లాభసాటి వ్యవహారంగా కూడా ఉంటోంది. ఒకరిని అదనంగా నియమించుకొని పని చేయించుకోవటం కంటే ఆ మేరకు ఇద్దరో ముగ్గురి చేతో ఓవర్ టైవ్‌ు చేయించుకోవటం యజమానికి లాభం కనుకనే ఆ పని చేస్తున్నారు. పని చేయటంలో జపనీయులను ఆదర్శంగా తీసుకోవాలని కొంత మంది చెబుతారు. అక్కడి కార్మికులు నిరసన తెలియచేయాలంటే సమ్మెల కంటే అదనంగా ఉత్పత్తి చేసి యజమానుల మీద వత్తిడి చేస్తారనే కథలు కూడా బాగానే వినిపిస్తారు. సెలవులు తీసుకోవాలంటే సిగ్గుపడతారని ఆకాశానికి ఎత్తుతారు.

1970 దశకంలో చమురు సంక్షోభం తలెత్తినపుడు అక్కడి కార్మిక వర్గం మీద పెట్టుబడిదారులు 70 గంటల పనిని రుద్దారు. అలా పని చేయటం గర్వకారణం, జపనీయుల దేశభక్తికి నిదర్శనం అన్నట్లు ప్రచారం చేసి సాధారణం కావించారు. ఇప్పుడు అనేక దేశాల్లో పెట్టుబడిదారీ వర్గం అదే చేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్ధ, ప్రపంచ కార్మిక సంస్ధ చేసిన సర్వే అంశాలవే. అయితే జపాన్‌లో 70 గంటల పని రుద్దుడు పర్యవసానం ఏమిటి? అక్కడి పని సంస్కృతికి మరోపేరు “కరోషి” అంటే అధిక పనితో చావు. ఇలాంటి చావులు పెరిగిన కారణంగా పని గంటల గురించి అక్కడ పునరాలోచన ప్రారంభమైంది. అనేక మంది కార్మికులు పని వత్తిడి తట్టుకోలేక కార్యాలయాల మీద నుంచి దూకి ఆత్మహత్యలు చేసుకున్నవారున్నారు. ఇదొక సామాజిక సమస్యగా మారింది. ప్రతి ఏటా కరోషీ బాధితులు పెరుగుతున్నారు. ఏటా పదివేల మంది మరణిస్తున్నారని అంచనా.కానీ ప్రభుత్వ లెక్కల్లో రెండు వందలు మాత్రమే ఉంటున్నాయి.

మరీ ఎక్కువ వత్తిడి చేస్తే మొదటికే మోసం వస్తుందని లేదా పరిహారం చెల్లించాల్సిన కారణాల వలన గానీ ఇటీవలి కాలంలో కొందరు యజమానులు తమ సిబ్బందికి బలవంతంగా సెలవులను ఇస్తున్నారు. ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది. సెలవులకు వేతనాలు పొందుతున్న కార్మికులు 2018లో 52.4 శాతం మందే ఉన్నారు. సెలవు తీసుకుంటే వేతనం ఇవ్వరు గనుక అనేక మంది వాటి జోలికి పోరు. చూశారా జపాను వారు సెలవులు కూడా తీసుకోకుండా పని చేస్తారని బయటి ప్రపంచం సుద్దులు చెబుతుంది. 19811996 మధ్య కాలంలో పుట్టిన వారిని మిలీనియల్స్ అంటున్నారు. వీరు మన దేశంలో 52, చైనాలో 48, అమెరికాలో 45, బ్రిటన్‌లో 41 గంటలు పని చేస్తున్నారని సర్వేలో తేలింది. తీవ్ర పోటీ, పని చేయకపోతే ఉద్యోగం ఊడుతుందన్న భయం వంటి అంశాలు రోజుకు పది గంటల కంటే ఎక్కువ సేపు పనిలో ఉండేట్లు చేస్తున్నాయి. ఫోర్డ్ కంపెనీ చేసిన సర్వే ప్రకారం వారానికి 12 గంటలు ఉద్యోగులు వాహనాలు నడపటానికి వెచ్చిస్తున్నారు.

అంటే పని గంటలకు ఇది అదనం. ఉదాహరణకు 52 పని గంటలైతే అందుకోసం మరో పన్నెండు గంటల పాటు ప్రయాణంలో వెచ్చించాల్సి వస్తోంది. మన దేశంలో సంభవిస్తున్న ఆత్మహత్యలలో పది శాతం నిరుద్యోగం, దారిద్య్రం, దివాలా వంటి కారణాలతో జరుగుతున్నాయి. ఒకవైపు అధిక గంటలు పని చేసే వారు అత్యధికులుండగా మరో వైపు అసలు పనే లేని నిరుద్యోగులు కనిపిస్తారు. అధిక గంటలు పనిచేసే దేశాలలో మనది ఐదవ స్ధానమని ఐఎల్‌ఒ తెలిపింది. 202021 ప్రపంచ వేతన నివేదికలో అతి తక్కువ కనీస వేతనాలు చెల్లిస్తున్న దేశాల్లో మనది ఒకటని కూడా వెల్లడించింది. 2019 మన జాతీయ గణాంక సంస్థ సర్వే ప్రకారం రోజులో పదో వంతు కూడా దేశ ప్రజలు తీరుబడి కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. కార్మికశక్తిలో మహిళల శాతం తగ్గిపోతున్నదని ప్రపంచ బ్యాంకు పేర్కొన్నది.

గత సంవత్సరం 20.3 శాతమే ఉన్నారని, అంతకు ముందుకంటే గణనీయంగా తగ్గినట్లు తెలిపింది. మన దేశంలో వారానికి నాలుగు దినాలు, రోజుకు 12 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది యజమానుల లబ్ధి కోసం తప్ప మరొకటి కాదు. ఓవర్‌టైవ్‌ుకు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేకుండా చేయటమే ఇది. అధిక పని గంటలు, వృత్తి రుగ్మతల కారణంగా తలెత్తే పర్యవసానాల గురించి మన దేశంలో సమగ్రమైన చట్టాలు చేయాల్సి ఉంది. ఉన్న చట్టాలనే నీరుగార్చేందుకు పూనుకుంటున్న పాలకుల హయాంలో అది జరిగేనా !

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News