Home తాజా వార్తలు భారత్ వృద్ధి రేటు 6%

భారత్ వృద్ధి రేటు 6%

World Bank

 

2019 అంచనాలో కోత
2022లో 7.2 శాతానికి పెరగొచ్చు
ప్రపంచ బ్యాంక్ నివేదిక

న్యూఢిల్లీ : ఇప్పటికే పలు అంతర్జాతీయ, దేశీయ సంస్థలు భారత్ జిడిపి వృద్ధి రేటును తగ్గించగా, తాజాగా ప్రపంచ బ్యాంక్ కూడా ఇదే విధంగా హెచ్చరికలు చేసింది. భారత్ వృద్ధి రేటులో కోత పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2019-20) భారత్ వృద్ధి రేటు అంచనాను 6 శాతానికి తగ్గించింది. 2018-19లో వృద్ధి రేటు 6.9 శాతంగా ఉంది. దక్షిణాసియా ఎకనమిక్ ఫోకస్ తాజా ఎడిషన్‌లో ప్రపంచ బ్యాంక్ భారత్ గురించి వివరించింది. ద్రవ్యోల్బణం అనుకూలంగా ఉంటే, ద్రవ్య వైఖరి సానుకూలంగా ఉంటే వృద్ధి రేటు 2021 సంవత్సరంలో 6.9 శాతం, 2022 సంవత్సరంలో 7.2 శాతంతో భారత్ వృద్ధి రేటు పుంజుకోగలదని బ్యాంక్ తెలిపింది.

అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్)తో ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశానికి ముందు విడుదల చేసిన నివేదిక ఇది. దీనిలో భారత ఆర్థిక వృద్ధి వరుసగా రెండో సంవత్సరానికి తగ్గుతుందని అంచనా వేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం నుంచి 2018-19లో 6.8 శాతానికి వృద్ధి రేటు తగ్గింది. తయారీ, నిర్మాణ కార్యకలాపాల పెరుగుదల కారణంగా పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 6.9 శాతానికి పెరిగింది. వ్యవసాయం, సేవల రంగంలో వృద్ధి రేటు వరుసగా 2.9 శాతం, 7.5 శాతంగా ఉంది. డిమాండ్ పరంగా ప్రైవేట్ వినియోగం క్షీణించడం, అలాగే పరిశ్రమ, సేవలు రెండింటిలో బలహీనమైన వృద్ధి కారణంగా 2019-20 మొదటి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ మందగించిందని నివేదిక పేర్కొంది.

కరెంట్ ఖాతా లోటు పెరిగింది

కరెంట్ ఖాతా లోటు 2018-19లో జిడిపి(స్థూల జాతీయోత్పత్తి)లో 2.1 శాతానికి పెరిగిందని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది. ఇది ఏడాది క్రితం 1.8 శాతంగా ఉంది. ఈ గణాంకాలు క్షీణిస్తున్న వాణిజ్య సమతుల్యతను సూచిస్తున్నాయని బ్యాంక్ వెల్లడించింది. నివేదిక ప్రకారం, ఆర్థిక వేగం, ఆహార ధరలు తగ్గడం వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం 2018-19లో సగటున 3.4 శాతం. ఇది రిజర్వ్ బ్యాంక్ లక్ష్యం 4 శాతం కంటే చాలా తక్కువ. దీంతో రిజర్వు బ్యాంక్ రెపో రేటును 2019 జనవరి నుండి ఇప్పటి వరకు 1.35 శాతం తగ్గించింది. ఇక ద్రవ్య పరిస్థితిని తటస్థం నుంచి సర్దుబాటు వైఖరిగా మార్చింది.

బలహీనపడిన రూపాయి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి భాగంలో మూలధన ప్రవాహం ఉంది. అయితే 2018 అక్టోబర్ తరువాత ధోరణిలో మార్పు కారణంగా గత ఆర్థిక సంవత్సరం చివరినాటికి విదేశీ మారక నిల్వలు 411.90 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అదేవిధంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి కూడా ఘోరంగా దెబ్బతిన్నది. 2018 మార్చిఅక్టోబర్ మధ్య ఇది 12.1 శాతం తగ్గింది. అయితే 2019 మార్చి నాటికి ఏడు శాతం బలపడింది.

తగ్గుతున్న పేదరికం

పేదరికం తగ్గుతూనే ఉందని, అయితే దాని వేగం గతం కంటే మందగించిందని ప్రపంచ బ్యాంక్ చెప్పింది. 2011-12, అలాగే 2015-16 ఆర్థిక సంవత్సరాల్లో పేదరికం రేటు 21.6 శాతం నుండి 13.4 శాతానికి తగ్గింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మందగమనం, పట్టణ ప్రాంతాల్లో యువత నిరుద్యోగం అధికంగా ఉండటంతో పాటు జిఎస్‌టి, డీమోనిటైజేషన్ వంటివి పేద కుటుంబాల సమస్యలను పెంచాయని నివేదిక పేర్కొంది. కార్పొరేట్ పన్ను రేటులో ఇటీవల కోత విధించడం కంపెనీలకు ప్రయోజనం చేకూర్చినప్పటికీ, ఆర్థిక రంగం ఇబ్బందులను ఎదుర్కొంటోందని నివేదిక తెలిపింది.

World Bank cuts India growth projection to 6%