Home తాజా వార్తలు ఇదో రకం రక్త సంబంధం

ఇదో రకం రక్త సంబంధం

world-blood-donor-dayరక్తదానం అనేది మానవత్వానికి నిదర్శనం. ఇది సహచర మానవుల పట్ల ప్రేమను, దయను ప్రదర్శించే పవిత్రమైన కార్యక్రమం. రక్తదానం అనేది దాదాపుగా ప్రాణదానం వంటిదే. రోగ నివారణ కోసం… ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్తదానం అంటారు. అమ్మకం అనకుండా దానం అని ఎందుకు అన్నారంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైతిక విలువల ప్రకారం ఒకరి శరీరంలో ఉన్న అవయవాలని మరొకరి అవసరానికి వాడదలుచుకున్నప్పుడు వాటిని దాత స్వచ్ఛందంగా ఇవ్వాలే తప్ప వ్యాపారదృష్టితో అమ్మకూడదు. కనుక ప్రపంచంలో చాలా మంది రక్తాన్ని దానం చేస్తారు. అయితే, ఒక గ్రూపు కలిగిన రక్తదాతలు ఏ గ్రూపు వారికి రక్తం దానం చేయొచ్చన్న దానిపై అవగాహన ఉండదు. అందుకే బ్లండ్ బ్యాంక్ నిర్వాహకులు అందరి రక్తాన్ని సేకరించి… నిల్వవుంచి అవసరమైన వారికి వినియోగిస్తుంటారు.

రక్తదానం అంటేనే ప్రాణదానం. అన్నిదానాల్లోనే రక్తదానం గొప్పది. ఒకరి ప్రాణాన్ని నిలబెట్టడం అనేది మామూలు విషయం కాదు. చాలా గొప్పది. మనకెందుకులే అనుకోకుండా ఆపదలో ఉన్నవారిని కాపాడటంలో ఉన్న సంతృప్తి మరెందులోనూ ఉండదు. అందుకనే యువత రక్తాన్ని దానం చేయడంలో ముందుంటారు.
ప్రత్యేక రోజు
ఎందుకంటే…
ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో జూన్ 14న ప్ర పంచ రక్త దాతల దినోత్సవాన్ని జరుపుకుంటా రు. రక్తదాతలకు ధన్యవాదాలు తెలిపేందుకు, సురక్షితమైన రక్తం ఆవశ్యకత ను తెలియజేసేందుకు, రక్తదాతల నుంచి సేకరించిన రక్తాన్ని భద్రపరచే విధానాల ను మెరుగు పరచుకునేందు కు 2005 లో ఈ కార్యక్రమం మొద లైంది. ఎ, ఒ, బి, బ్లడ్ గ్రూ పు లను కనుగొన్న కార్ల్ లేండ్ స్టీనర్ జ్ఞాపకార్థం ఆయన పు ట్టిన రోజైన జూన్ 14న ప్రపంచ రక్త దాతల దినోత్సవాన్ని చేస్తు న్నాం.
అవసరం ఎప్పుడం టే…
*ఒకరి రక్తం మరొకరికి ఎక్కించవలసిన అత్యవసర పరిస్థితి (emergency) ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడయినా సరే ఒక లీటరు రక్తంలో 100 గ్రాముల కంటే ఎక్కువ హిమోగ్లోబిన్ ఉంటే ఆ వ్యక్తికి రక్తం ఎక్కించవలసిన పని లేదు. ఎవరి రక్తంలో అయినా సరే లీటరు ఒక్కంటికి 60 గ్రాముల కంటే తక్కువ హిమోగ్లోబిన్ ఉంటే అది ర క్తం ఎక్కించవలసిన పరిస్థితి. అంతే కాని ఆపరేషను చేసినప్పుడల్లా రక్తం ఎక్కించవలసిన పని లేదు.
* ప్రమాదాలలో దెబ్బలు తగిలి రక్తం బాగా పోయినప్పుడు సర్వసాధారణంగా ఆపరేషను చేసి ప్రా ణం కాపాడుతారు. ప్రమాదంలో పోయిన రక్తంతో పాటు ఆపరేషనులో కూడా కొంత రక్త స్రావం జరుగుతుంది. ఈ సందర్భంలో మొత్తం నష్టం పది, ప న్నెండు యూనిట్లు (ఒక యూనిట్ = అర్ధ లీటరు) దాకా ఉండొచ్చు. మన శరీరంలో ఉండే మొత్తం ర క్తమే సుమారుగా 12 యూనిట్లు ఉంటుంది. ఈ సందర్భంలో రోగి శరీరంలో ఉన్న పాత రక్తం అం తా పోయి కొత్త రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి రావచ్చు. ఇటువంటి సందర్భంలో ఎన్నో కారణాల వల్ల దానం స్వీకరించినవాడి రక్తం సులభంగా గడ్డకట్టదు. ఇటువంటి క్లిష్టమయిన పరిస్థితులు ఎదురయినప్పుడు రోగి సొంత రక్తాన్నే ఎంత వీలయితే అంత గొట్టాల ద్వారా పట్టి, కూడగట్టి, శుద్ధి చేసి, తిరిగి వాడతారు.
రక్తాన్ని నిల్వ చెయ్యడమెలా..
దానం చేసిన రక్తాన్ని అప్పటికప్పుడు, అక్కడికక్కడ వాడుకోవటం కష్టం. కనుక రక్తాన్ని ఏదో ఒక విధంగా నిల్వ చేయాలి. రక్తాన్ని యథాతధంగా నిల్వ చెయ్యటం శ్రేయస్కరం కాదు.

అందుకని రక్తంలో ఉన్న భాగాలని విడగొట్టి ఏ భాగానికా భాగాన్ని విడివిడిగా నిల్వ చేస్తారు. ఉదాహరణకి ఎర్ర కణాలని విడగొట్టి బీరువాలో నిల్వ చేస్తే 42 రోజులపాటు పాడు కాకుండా ఉంటాయి. అవే ఎర్ర కణాలని చల్లబరచి, గడ్డకట్టిస్తే 10 సంవత్సరాలు నిల్వ ఉంటాయి. రసిని చల్లబరచి, గడ్డకట్టిస్తే ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది.
ఇలా రక్తం లోని భాగాలని వీడదీసి నిల్వ చెయ్యటంలో కొన్ని లాభాలు ఉన్నాయి. సాధారణంగా రక్తాన్ని ఎక్కించవలసిన ఏ సందర్భంలోనూ కూడా పక్కా రక్తం (whole blood) అవసరం ఎప్పుడో కాని రాదు. ఒకొక్క పరిస్థితిలో ఒకొక్క కారణాంశం అవసరం ఉంటుంది. అప్పుడు అదొక్కటే వాడి విలువైన రక్తాన్ని పొదుపుగా వాడుకోవచ్చు.
ఒకరి రక్తం మరొకరికి ఎక్కించేటప్పుడు అప్రమత్తతతో ఉండకపోతే కామెర్లు, ఎయిడ్స్ వంటి రోగాలు సంక్రమించే అవకాశం ఉంది.
ఈ ప్రమాదాల నుండి తప్పించుకునేందుకు ఎవరి రక్తం వారే, ఎవరికి వారే దానం చేసుకుని బ్యాంకులో దాచుకుంటారు. ఇది ఒక కొత్త ధోరణి!
రక్తదానం ప్రయోజనాలు
ఐరన్ నిల్వలను సమతుల్యం చేయడమనది రక్త దానం చేయడం వల్ల కలిగే ఓ మంచి ఆరోగ్య ప్రయోజనాల్లో ఇది ఒకటి. అనేక పరిశోధనలు, అధ్యయనాల ప్రకారం చాలా మందిలో వారు తీసుకొనే ఆహారాన్ని బట్టే ఐరన్ నిల్వలు ఉంటాయి. కాబట్టి శరీరంలో ఇనుము స్థాయిని సమతుల్యం కోసం రక్తం దానం చేయడం చాలా మంచిది. రక్తంలో ఎక్కువగా ఐరన్ ఉంటే గుండెకు హాని చేస్తుంది. కార్డియో వాస్కులర్ వ్యాధులను నివారించేందుకు రక్తదానం చేయడం మంచిది. రక్తం దానం చేయడం వల్ల మహిళల్లో రుతుస్రావం ద్వారా ఇనుము స్థాయిల్లో సమతుల్యత జరుగుతుంది. మహిళల్లో ఒక వయస్సు వచ్చిన తర్వాత రుతస్రావం పూర్తిగా నిలిచిపోయినప్పుడు వారి శరీరంలో నిల్వఉండే ఐరన్ స్థాయిని సమతుల్యం చేసుకోవడానికి రక్తదానం చేయడం మంచిది.
* హెల్త్ చెకప్ చేయించుకోవాలి:
రక్తం దానం చేయడానికి ముందు, దాత చరిత్రను వైద్యులు తప్పనిసరిగా తెలుసుకుంటారు. అంతే కాదు, ఆ వ్యక్తి రక్తం దానం చేయడానికి అర్హుడా కాడా అన్ని విషయ నిర్ధారణ కోసం డాక్టర్లు కొన్ని ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు. కాబట్టి రక్తదానం చేయడానికి ముందు డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి. మన ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తిగా వైద్యునికి చెప్పాలి.

* క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది:
శరీరంలో ఐరన్ నిల్వల స్థాయి తగ్గడం వల్ల క్యాన్సర్ లక్షణాలను తగ్గిస్తుంది. రక్తదానం చేయడం వల్ల క్యాన్సర్‌తో బాధపడుతున్న అవకాశాలు ప్రత్యేకంగా పెద్దపేగు, ఊపిరితిత్తులు, కాలేయం, గొంతు, ఊపిరి తిత్తుల క్యాన్సర్‌లు రాకుండా అడ్డుకుంటుంది.
* అధిక రక్త పోటును నియంత్రిస్తుంది: రక్త దానం చేసినప్పుడు, రక్త పరిమాణం సమతుల్యం చెంది, రక్తపోటును నిరోధిస్తుంది. కాబట్టి ఒక ఆరోగ్యకరమైన గుండె, గుండె సంబంధిత వ్యాధులను నివారించడానికి రక్తదానం చేయడం మంచిది.
* కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది: శరీరంలోని రక్త కణాల్లో కొలెస్ట్రాల్ నిల్వ ఉంటుంది. ఎర్ర రక్తకణాల్లో చెడు, మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. కాబట్టి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి రక్తదానం చాలా ఉపయోగకరం.
*రక్తం నష్టం అధిగమించడానికి సహాయం చేస్తుంది రక్తదానం చేసినప్పుడు, తిరిగి దాత శరీరంలో ఏర్పడిన రక్త నష్టాన్ని భర్తీ చేయడం కోసం 4-8 సమయం పడుతుంది. ఆ సమయంలో ఎర్రరక్తకణాల్లో ఉన్న రక్తం శరీరం మొత్తం పునరుద్ధరణ సరిచేస్తుంది.
* పురుషులు ప్రతి మూడు నెలలకొకసారి రక్తదానం చేయొచ్చు.
* మహిళలు ప్రతి నాలుగు నెలలకొకసారి డొనేట్ చేయవచ్చు. రక్తదానం చేసేటప్పుడు మీరు డాక్టర్‌ను తప్పనిసరిగా సంప్రదించాలి.

భారతదేశపు
తొలి రక్తదాత
దక్షిణ భారతదేశ తొలి రక్తదాత శ్రీపురం వెంకటనరసింహారావు. ఈయన నెల్లూరు జిల్లా వెంకటగిరి వాసి. దేశంలో మొదటి రక్తదాత బీహార్‌లోని జెంషెడ్‌పూర్‌కు చెందిన బాల్లన్ కాగా, స్వచ్ఛంద రక్తదాతగా వెంకటనరసింహారావు గుర్తింపు పొందారు. బాల్లన్ 1939లో రక్తదానం చేయగా, నరసింహారావు 1942లో రక్తం దానం చేసి దక్షిణ భారతదేశపు తొలిరక్తదాతగా పేరుగాంచారు. 1942 లో నరసింహరావు నెల్లూరు జిల్లా కావలిలో సైన్యంలో యువకులను రిక్రూట్ చేసుకొనే అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఆ సమయంలో కావలి వద్ద జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడడం, రక్తం లభించక ప్రాణాలొదలడం ఆయనను కదిలించి వేసింది. వెంటనే రక్తదాన మహోద్యమానికి శ్రీకారం చుట్టేలా ప్రేరేపించింది. అనుకున్నదే తడవుగా ఆయన దేశమంతటా రక్తదాన ఆవశ్యకతపై ప్రచారం నిర్వహించారు. తన 37వ ఏట చెన్నై జనరల్ ఆసుపత్రిలో మొదట రక్తదానం చేశారు. చరిత్రకారుడు రసూల్ ప్రకారం తదుపరి 20 సంవత్సరాలలో ఆయన 64 సార్లు రక్తదానం చేశారు. 1962లో ఢిల్లీ రెడ్ క్రాస్ ప్రారంభించిన సమయంలో రక్తదానం చేసిన వారిలో నరసింహరావు ఒకరు. తను 56 సంవత్సరాల వయస్సులో శ్వాసకోశ సంబంధిత వ్యాధి కారణంగా మరణించారు.

24 గంటలూ అందుబాటులో ఉంటాం..

స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేసేవారిని మేం ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటాం. అందుకోసం స్వచ్ఛంద రక్తదాన క్యాంపులను ఏర్పాటుచేస్తుంటాం. కళాశాల విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు రక్తదానంలో ముందుంటాయి. సేకరించిన రక్తాన్ని ప్రాసెస్ చే స్తాం. మేం రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి రక్తాన్ని సేకరిస్తాము. సేకరించిన రక్తాన్ని తగిన పరీక్షలు చేసి ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులకు అందజేస్తాం. క్యాంపుల ద్వారానే కాకుండా బ్లడ్ ఇవ్వడానికి చాలా మంది మా దగ్గరకు వస్తుంటారు. ప్రతి రక్తదాత నుంచి ముగ్గురు రోగులను రక్షించొచ్చు. మేం 24 గంటలూ అందుబాటులో ఉంటాం. మెటర్నిటీ హాస్పిటల్స్‌లో కాన్పులు అవుతుంటాయి కదా! సడెన్‌గా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు రక్తం అత్యవసరం. ఇలాంటి ఆసుపత్రులకు అత్యవసర పరిస్థితుల్లో, బల్క్‌లో రక్తాన్ని అందజేస్తాం. ఇదే కాకుండా ఉస్మానియా, గాంధీ, ఎమ్‌ఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి, నీలోఫర్, ఇతర ప్రభుత్వ మెటర్నటీ ఆసుపత్రుల నుంచి రక్తం కోసం వచ్చేవారికి 24 గంటలూ అందబాటులో ఉంటాం. కొన్ని పరిస్థితుల్లో హాస్పటల్స్‌కు, బ్లడ్ బ్యాంకులకు బల్క్‌లో రక్తాన్ని అందిస్తున్నాం. హైదరాబాద్ మాత్రమే కాకుండా సంగారెడ్డి, తాండూరు లాంటి చుట్టుపక్కల జిల్లాల వారికి కూడా మా సేవలందిస్తున్నాం.
స్వచ్ఛందంగా వచ్చే డోనర్స్‌ని సెలక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తాం.18 ఏళ్ళ నుం చి 60 ఏళ్ళ వయస్సు వరకు బ్లడ్ ఇవ్వొచ్చు. NBTC (నేషనల్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ కౌన్సిల్), NACO( నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్) గైడ్‌లైన్స్ ప్రకారం రక్తదాత 45 నుంచి 50 కేజీల బరువు ఉండాలి. హీమోగ్లోబిన్ 12.5g% కన్న తక్కువ ఉండకూడదు. ఈ విధంగా ఉన్నప్పుడు వైద్య పరీక్ష చేసి దాత చరిత్రను తెలుసుకుంటాం. ప్రతి డొనేషన్‌కి 3 నెలల వ్యవధి ఉండాలి. డోనర్స్ చిరునామా తీసుకుంటాం.
దీర్ఘకాలిక వ్యాధులున్నవాళ్లు రక్తాన్ని ఇవ్వడానికి అర్హులు కారు. కిడ్నీ డిసాడర్, హార్ట్ డిసీసెస్, మూర్ఛ కానీ ఉంటే అలాంటి వాళ్ళు ఫిట్ కారు. రీసెంట్‌గా ఏదన్నా వాక్సినేషన్ తీసుకుంటే తాత్కాలికంగా బ్లడ్ ఇవ్వకూడదు.ప్లేట్‌లెట్స్ డొనేట్ చేస్తున్నప్పుడు డోనర్ కనీసం 72 గంటల ముందు పెయిన్ కిల్లర్లను తీసుకోకూడదు. మహిళలైతే రుతుక్రమంలో, గర్భిణిగా ఉన్నప్పుడు బ్లడ్ డొనేట్ చేయకూడదు. ఈ వేసవిలో విద్యార్థులు సెలవుల్లో ఉంటారు. ఇప్పుడున్న అధిక ఉష్ణోగ్రత వల్ల డోనర్స్ రక్తాన్ని దానం చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో బ్లడ్ కలెక్షన్ తగ్గిపోతుంది. ఇలాంటప్పుడు మా రెగ్యులర్ డోనర్స్‌ను మోటివేట్ చేస్తుంటాం. మధ్య ప్రభుత్వం ‘ఈ రక్త కోష్’ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఈ వెబ్‌సైట్ ప్రతి పౌరుడికి అందుబాటులో ఉంది. ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుల్లో ఎంత రక్తం అందుబాటులో ఉందీ, రక్తదానం చేసేవారికి కావాల్సిన సమాచారం మొత్తం సైట్‌లో ఉంటుంది.

విజయశాంతి
బ్లడ్ బ్యాంక్ ఇంచార్జ్
నారాయణగూడ, వైఎమ్‌సిఎ

రక్తదానానికి ఇవి తప్పనిసరి…
మనం ఇచ్చే ఒక యూనిట్ రక్తంలో ఎన్నో కణాలు దాగి ఉంటాయి. ఎర్ర, తెల్ల రక్త కణాలు, ప్లేట్ లెట్స్ తదితరాలు ఎంతో మంది రోగులకు ఉపయోగపడతాయి. రక్త దానం.. ఏటా కోట్లాది మందికి ప్రాణం పోస్తోంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే రక్తదాతలు దొరక్కపోతే.. పరిస్థితి ఊహించుకోండి. అందుకే, రక్త దానానికి అంత ప్రాధాన్యం. అయితే.. రక్తదానం చేసే ముందు, అందుకు మీరు అర్హులో కాదో తెలుసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది.
* దాత బరువు కనీసం 50 కిలోలు ఉండాలి.
* సాధారణ శరీర ఉష్ణోగ్రత ఉండాలి. నోటి ఉష్ణోగ్రత 37.5 డిగ్రీలను మించకూడదు.
* దాత 18- నుంచి 60 ఏళ్ల మధ్య వయసువాడై ఉండాలి.
* అంటువ్యాధులు, హెచ్‌ఐవి, కేన్సర్, మధు
మేహం, క్షయ, ఉబ్బసం, రెబీస్‌లాంటి వ్యాధులు ఉన్నవారు రక్తదానం చేయకూడదు.
* రక్తదానం చేసే వ్యక్తి రక్తంలో కనీసం 12.5 g/ dL హిమోగ్లోబిన్ ఉండాలి.
*పల్స్ రేటు 50 నుంచి 100 మధ్య స్థిరంగా ఉండాలి.
* డయాస్టోలిక్ బీపీ 50–= 100 ఎమ్‌ఎమ్ హెచ్ జి, సిస్టోలిక్ బీపీ 100=-180 ఎమ్‌ఎమ్ హెచ్‌జి మధ్య ఉండాలి.
రక్తదానం ఉపయోగాలు..
రక్తాన్ని దానం చేయడం వల్ల మానసికంగా శారీరకంగా ఫిట్‌గా ఉంటారు. మెంటల్ హెల్త్ ఫౌండేషన్ రిపోర్టు ప్రకారం రక్తదానం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఆందోళన తగ్గి స్థిరమైన ఆలోచనలు కలుగుతాయి. శారీరక దృఢత్వం ఏర్పడుతుంది. ప్రతికూల ఆలోచనలు తగ్గుతాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. అంతేకాకుండా గుండెకు సంబంధించిన జబ్బులు చాలా వరకు తగ్గుతాయి. 2013లో చేసిన స్టడీ ప్రకారం క్రమం తప్పకుండా రక్తాన్ని దానం చేసేవారిలో కొలెస్ట్రాల్ లెవల్స్ సరిసమానంగా ఉంటాయట. బిపి లెవెల్స్ నార్మల్‌గా ఉంటాయని 2016 పరిశోధనలో తేలింది. ఏడాదికి నాలుగు సార్లు డొనేట్ చేసేవారిలో చాలా మంచి రిజల్ట్ వచ్చినట్లు తెలుసుకున్నారు.
బ్లడ్ డొనేట్ చేసే వారికి కొన్ని చెకప్‌లు చేస్తారు. పల్స్, బిపి, శరీర ఉష్ణోగ్రత, హిమోగ్లోబిన్ లెవల్స్ చూస్తారు.
రక్తాన్ని కూడా పరీక్షిస్తారు.హెపటీసిస్ బి, హెపటీసెస్ సి, హెఐవి, వెస్ట్ నైల్‌వైరస్, సిఫిలిసిస్, ట్రైపనోసోమ క్రూజి లాంటివి చెక్ చేస్తారు.
సైడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉన్నాయా….
రక్తాన్ని దానం చేసిన తర్వాత కొంతమందికి నీరసంగా ఉంటుంది. కొంచెం వణుకుతూ ఆందోళనపడుతుంటారు. ఇవన్నీ కొద్దిసేపే ఉంటాయి. కొంచెం విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. సూదిగుచ్చిన చోట కొంచెం బ్లీడింగ్ కావచ్చు. అప్పుడు కొద్ది సేపు చెయ్యిని పైకి కిందకి అంటే సరిపోతుంది. సర్దుకుంటుంది. అయినా ఆందోళనగా ఉంటే వైద్యున్ని సంప్రదించాలి.

హిమోగ్లోబిన్ కోసం ఆహారం

రక్తంలో హిమోగ్లోబిన్ పెరగాలంటే ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తరచుగా తీసుకోవాలి. చాలామంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. ఎప్పుడైతే హిమోగ్లోబిన్ తగ్గుతుందో ఒంట్లో రక్తం ఉండాల్సిన స్థానాన్ని నీరు ఆక్రమిస్తుంది. దీంతో ఒళ్లు బరువెక్కడం, కాళ్లు తిమ్మిర్లు ఎక్కడం, కళ్లు తిరగడం వంటి పలు సమస్యలు తలెత్తుతాయి. హిమోగ్లోబిన్ శాతం పెరగడానికి కొన్నిరకాల ఆహారాలు తీసుకోవాలి. మన శరీరంలో ఐరన్, ఫోలిక్ ఆసిడ్, విటమిన్ సి, విటమిన్ బి12 ఇలాంటివాటిలో దేని పరిమాణం తగ్గినా అది రక్తహీనతకు దారి తీస్తుంది. వీటి లెవెల్స్ తగ్గకుండా చూసుకుంటే చాలు, ఎలాంటి సమస్య ఉండదు. ఎక్కువగా ఐరన్ లోపం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది.
* రక్తంలోని హిమోగ్లోబిన్ వేగవంతంగా పెరగడానికి ప్రోటీన్స్ చాలా అవసరం. రెడ్ మీట్ (ఎరుపు రంగులో ఉండే మాంసం) ఇందుకు బాగా ఉపయోగడుతంది. బీఫ్, మటన్, మాంసంలోని కాలేయం వంటివి హిమోగ్లోబిన్ ఉత్పత్తికి అవసరమైన ఐరన్ పెరుగుదలకు తోడ్పడుతాయి. చికెన్‌ను కూడా రెగ్యులర్ గా తీసుకుంటే మనకు కావాల్సినంత ఐరన్ లభిస్తుంది. రెడ్ మీట్‌లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అయితే రెడ్ మీట్ కొవ్వు పదార్థాల స్థాయిలు అధిక మొత్తంలో ఉంటాయి. అందువల్ల దీన్ని ఎక్కువగా కూడా తీసుకోకూడదు. మనకు అవసరమైన మేరకు మాత్రమే దీన్ని తీసుకోవాలి.
* మామిడి, నిమ్మకాయలు, నారింజ వంటి సిట్రస్ పండ్లలోనూ ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో శరీరానికి అవసరమైన విటమిన్- సి కూడా ఎక్కువగా ఉంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని త్వరగా పెంచడానికి ఈ పండ్లు ఉపయోగపడతాయి. స్ట్రాబెర్రీస్, యాపిల్స్, పుచ్చకాయలు, జామకాయలు, దానిమ్మ వంటి పండ్లు రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచుతాయి.
* సీఫుడ్‌లోనూ హీమోగ్లోబిన్ స్థాయిని పెంచే గుణాలుంటాయి. వీటిలో ఐరన్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి ఉపయోగపడతాయి. సముద్రపు చేపలు, ఓయిస్ట్రస్, క్లామ్స్ వంటివి ఎక్కువగా తింటూ ఉండాలి.
* అపరాల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. చిక్కుడు, సోయాబీన్స్, బీన్స్ వంటి వాటిని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి. సోయా గింజల్ని అందుకు సంబంధించిన ఆహారపదార్థాలను ఎక్కువగా తీసుకుంటే మంచిది.
* తృణధాన్యాల్లోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. రైస్, గోధుమ, బార్లీ, వోట్స్ వంటి వాటిలో హిమోగ్లోబిన్ పెంచే గుణాలు ఎక్కువగా ఉంటాయి. రెగ్యులర్ గా వీటితో తయారు చేసిన ఆహారాన్ని తింటూ ఉండాలి. దీంతో శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు అందుతాయి. ముఖ్యంగా బ్రౌన్ రైస్ వల్ల ఐరన్ ఎక్కువగా శరీరానికి అందుతుంది. దీంతో బ్లడ్‌లో హిమోగ్లోబిన్ పెరుగుతుంది.
* తాజా కూరగాయలతో తయారు చేసిన ఆహారపదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మినరల్స్ కూడా ఉంటాయి. బంగాళాదుంపలు, బ్రకోలీ, టమోటాలు, గుమ్మడికాయలు, బీట్‌రూట్, క్యారట్ వంటి వాటిని ఎక్కువగా తింటూ ఉండాలి. పాలకూరను రెగ్యులర్ గా తింటూ ఉండాలి. దీంతో రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.
* గుడ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇందులో పోషకాలు కూడా దండిగా ఉంటాయి. గుడ్డు పచ్చసొనలో ఎక్కువగా మినరల్స్, విటమిన్లు ఉంటాయి. రోజూ ఉడికించిన గుడ్లను తింటే చాలా మంచిది. బాడీకీ అవసరమైన ఐరన్ అందించడమేకాకుండా రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని కూడా ఇది పెంచుతుంది.
* డ్రై ఫ్రూట్స్ కూడా హిమోగ్లోబిన్ పెంచేందుకు బాగా ఉపయోగపడతాయి. ఆప్రికాట్లు, ఖర్జూరాలు వంటి వాటిలో ఐరన్, విటమిన్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయి. రోజూ ఒక పిడికెడు బాదం పప్పులను తింటే 6 శాతం ఐరన్ శరీరానికి అందుతుంది. జీడిపప్పులోనూ ఐరన్ ఎక్కువగా ఉంటుంది.
* డార్క్ చాక్లెట్లలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది. రక్తంలో హిమోగ్లోబిన్ ఎక్కువగా పెరగడానికి ఉపయోగపడతాయి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.

  మల్లీశ్వరి వారణాసి

world blood donor day 2019