Home తాజా వార్తలు పాకిస్థాన్‌కు కీలకం

పాకిస్థాన్‌కు కీలకం

pakistan

నేడు ఆస్ట్రేలియాతో పోరు
టాంటాన్: ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం జరిగే కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్ డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో పాకిస్థాన్ కీలకమైన పాయింట్‌ను కోల్పోక తప్పలేదు. ఆ మ్యాచ్ జరిగి ఉంటే పాకిస్థాన్‌కే విజయవకాశాలు అధికంగా ఉండేవి. అయితే మ్యాచ్ వర్షార్పణం కావడంతో పాక్ ఒక పాయింట్‌తోనే సంతృప్తి పడక తప్పలేదు. ఇక, బలమైన ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ పాకిస్థాన్‌కు సవాలుగా మారింది. స్టార్ ఆటగాళ్లతో కూడిన ఆస్ట్రేలియాను ఎదుర్కొవడం పాక్‌ను అనుకున్నంత తేలికకాదనే చెప్పాలి. ఇప్పటికే రెండు మ్యాచుల్లో గెలిచిన ఆస్ట్రేలియా ఒకదాంట్లో ఓడిపోయింది. టీమిండియాతో జరిగిన కిందటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పోరాడి ఓడింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు చివరి వరకు తీవ్రంగా పోరాడింది. స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్మిత్‌లు ఫామ్‌లో ఉండడం కంగారూలకు శుభపరిణామంగా మారంది. భారత్‌పై వార్నర్, స్మిత్‌లు మెరుగైన ప్రదర్శన చేశారు. పాక్‌పై కూడా వీరిద్దరూ మెరుగ్గా ఆడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాగా, బలమైన ఇంగ్లండ్‌ను ఓడించిన పాకిస్థాన్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. ఓపెనర్లు ఇమాములు హక్, ఫకర్ జమాన్, యువ ఆటగాడు బాబర్ ఆజమ్‌లు ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్ సర్ఫరాజ్ కూడా మెరుగైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ టాపార్డర్ చెలరేగి పోయింది. ఆస్ట్రేలియాపై కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో బ్యాట్స్‌మెన్ ఉన్నారు. సీనియర్ ఆటగాడు మహ్మద్ హఫీజ్ జట్టుకు చాలా కీలకంగా మారాడు. ఇంగ్లండ్‌పై హఫీజ్ భారీ స్కోరు సాధించాడు. ఈసారి కూడా జట్టు అతనిపై భారీ ఆశలే పెట్టుకుంది. మరో సీనియర్ షోయబ్ మాలిక్ కూడా సత్తా చాటాలనే ఉద్దేశంతో ఉన్నాడు. ఫామ్‌లో ఉన్న టాప్3 ఆటగాళ్లు మరోసారి రాణిస్తే ఈ మ్యాచ్‌లో కూడా భారీ స్కోరు సాధించడం పాక్‌కు కష్టమేమి కాదు. బౌలింగ్‌లో కూడా పాక్ బలంగానే ఉంది. సీనియర్ బౌలర్ మహ్మద్ అమేర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. రెండు మ్యాచుల్లో కూడా సత్తా చాటాడు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో అమేర్ ఉన్నాడు. వహాబ్ రియాజ్, హసన్ అలీ, షాదాబ్ ఖాన్‌లతో బౌలింగ్ చాలా బలంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆస్ట్రేలియాకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
ఫేవరెట్‌గా

World Cup 2019: AUS vs WI Match today
ఇదిలావుండగా భారత్ చేతిలో ఓడినా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. కీలక ఆటగాళ్లందరూ ఫామ్‌లో ఉండడం ఆస్ట్రేలియాకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. వార్నర్ ఫామ్‌లోకి రావడంతో ఆస్ట్రేలియా మరింత బలోపేతంగా మారింది. ఈ మ్యాచ్‌లో కూడా వార్నర్ జట్టుకు కీలకంగా మారాడు. కిందటి మ్యాచ్‌లో వార్నర్ అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచిన విషయం తెలిసిందే. కెప్టెన్ అరోన్ ఫించ్ కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈసారి భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. ఇక, స్మిత్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఆడిన అన్ని మ్యాచుల్లోనూ నిలకడగా రాణించాడు. ఈ మ్యాచ్‌లో కూడా మెరుగ్గా ఆడాలనే లక్షంతో కనిపిస్తున్నాడు. మాక్స్‌వెల్ కూడా సత్తా చాటాలనే లక్షంతో పోరుకు సిద్ధమయ్యాడు. వికెట్ కీపర్ అలెక్స్ కారె కూడా దూకుడు మీద ఉన్నాడు. భారత్‌పై మెరుపు ఇన్నింగ్స్ ఆడి సత్తా చాటాడు. స్టొయినిస్, ఉస్మాన్ ఖ్వాజాలతో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ఇక, కౌల్టర్ నైల్ రూపంలో మరో ఆల్‌రౌండర్ ఉండనే ఉన్నాడు. విండీస్‌పై నైల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే జోరును కొనసాగించేందుకు తహతహలాడుతున్నాడు. కమిన్స్, స్టార్క్, జంపాలతో బౌలింగ్ కూడా బలంగా ఉంది. దీంతో ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

World Cup 2019: AUS vs PAK match today