Friday, December 2, 2022

సమరోత్సాహంతో భారత్

- Advertisement -

ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియా, నేడు దిగ్గజాల సమరం
లండన్: వరుస విజయాలతో జోరుమీదున్న ప్రస్తుత ఛాంపియన్ ఆస్ట్రేలియా ఆదివారం భారత్‌తో జరిగే మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. మరోవైపు ఇప్పటి వరకు ఆడిన ఏకైక మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియా కూడా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ప్రపంచకప్‌లోనే అత్యంత బలమైన జట్లుగా పేరున్న భారత్‌ఆస్ట్రేలియాల మధ్య జరిగే సమరంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రెండు విజయాలు సాధించిన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో కూడా హ్యాట్రిక్ నమోదు చేయాలని తహతహలాడుతోంది. విరాట్ కోహ్లి సేన కూడా గెలుపే లక్షంగా పోరుకు సిద్ధమైంది. ఇరు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. ఒత్తిడిని సయితం తట్టుకుని ముందుకు సాగే ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన కిందటి మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత శతకంతో అలరించాడు. ఇక, విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్, యువ ఆటగాడు కౌల్టర్ నైల్ మెరుపులు మెరిపించడం ఆస్ట్రేలియాకు కలిసి వచ్చే అంశం. విండీస్‌తో నువ్వానేనా అన్నట్టు సాగిన మ్యాచ్‌లో ఓటమి అంచుల వరకు వెళ్లిన కంగారూలు చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఒత్తిడిలోనూ పట్టువదలకుండా ఆడడంతో విజయం దక్కింది. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఆస్ట్రేలియా ఉంది. రెండు జట్లు కూడా గెలుపే లక్షంగా పెట్టుకోవడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.
రోహితే కీలకం
సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అజేయ శతకంతో చెలరేగిన స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మపై ఈసారి కూడా జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన రోహిత్ విజృంభిస్తే భారత్‌కు ఎదురుండదు. ఎటువంటి బౌలింగ్ లైనప్‌నైనా చిన్నాభిన్నం చేసే సత్తా అతని సొంతం. సఫారీలపై కీలక ఇన్నింగ్స్ ఆడడంతో రోహిత్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. అదే జోరును కంగారూలపై కూడా కొనసాగించాలని తహతహలాడుతున్నాడు. అయితే మరో ఓపెనర్ శిఖర్ ధావన్ వరుస వైఫల్యాలు చవిచూస్తుండడం భారత్‌ను కలవరానికి గురి చేస్తోంది. ఈ మ్యాచ్‌లోనైనా ధావన్ మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాల్సిన అవసరం ఉంది. ధావన్ వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఓపెనర్లలో ఒకడిగా పేరున్న ధావన్ కొంతకాలంగా ఆశించిన స్థాయిలో ఆడలేక పోతున్నాడు. ప్రపంచకప్‌లో ధావన్‌పై జట్టు భారీ ఆశలే పెట్టుకుంది. ఇంగ్లండ్ పిచ్‌లపై మంచి రికార్డు ఉన్న ధావన్ గాడిలో పడితే జట్టు బ్యాటింగ్ సమస్యలు చాలా వరకు తీరిపోతాయి.
కోహ్లి ఈసారైనా..
మరోవైపు తొలి మ్యాచ్‌లో ఆశించిన స్థాయిలో ఆడని కెప్టెన్ విరాట్ కోహ్లి ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. కోహ్లి చెలరేగితే ప్రత్యర్థి బౌలర్లకు కష్టాలు ఖాయం. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర బ్యాట్స్‌మన్‌గా కోహ్లి పేరు తెచ్చుకున్నాడు. అతను రాణిస్తే జట్టుకు తిరుగుండదు. సఫారీతో జరిగిన మొదటి మ్యాచ్‌లో కోహ్లి తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఈసారైనా అతను భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. ఇక, లోకేశ్ రాహుల్ కూడా తన బ్యాట్‌కు మరింత పదును పెట్టాలి. కంగారూ బౌలర్లపై ఎదురుదాడికి దిగి పరుగుల వర్షం కురిపించాలి. రాహుల్ ధాటిగా ఆడితే భారత్‌కు భారీ స్కోరు నల్లేరుపై నడకే. సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడక తప్పదు. సఫారీపై సమన్వయంతో ఆడిన ధోని జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో కూడా అలాంటి ఇన్నింగ్స్‌నే ఆడాలని తహతహలాడుతున్నాడు. ధోని చెలరేగితే భారత్ మరింత సురక్షిత స్థితికి చేరుకుంటుంది.అంతేగాక కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యలు కూడా బ్యాట్‌ను ఝులిపించాలి. ఇటు బంతితో అటు బ్యాట్‌తో మెరుపులు మెరిపించే సత్తా వీరికుంది. జట్టుకు వీరిద్దరూ చాలా కీలకంగా మారారు. సఫారీపై హార్దిక్ బాగానే ఆడాడు. కేదార్ కూడా పొదుపుగా బౌలింగ్ చేశాడు. అతనికి బ్యాట్ చేసే అవకాశం దక్కలేదు. ఈసారి అవకాశం లభిస్తే సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నాడు.
బౌలింగే బలం
బ్యాటింగ్‌తో పోల్చితే భారత్ బౌలింగ్ విభాగంలో మరింత బలంగా కనిపిస్తోంది. జస్‌ప్రిత్ బుమ్రా సఫారీతో జరిగిన మ్యాచ్‌లో అసాధారణ రీతిలో చెలరేగి పోయాడు. అతని బౌలింగ్‌ను ఎదుర్కొవడంలో సౌతాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్‌లు సయితం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ మ్యాచ్‌లో కూడా అదే జోరును కొనసాగించాలని బుమ్రా భావిస్తున్నాడు. హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, చాహల్, కేదార్‌లతో భారత బౌలింగ్ చాలా బలంగా ఉంది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌కు సమస్యలు సృష్టించే సత్తా ఈ బృందానికి ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉన్న టీమిండియా భారీ ఆశలతో మ్యాచ్‌కు సిద్ధమైంది.
హ్యాట్రిక్‌పై కన్ను

World Cup 2019: AUS vs WI Match today

కాగా, ఇప్పటికే రెండు విజయాలతో జోరుమీదున్న ఆస్ట్రేలియా ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని తహతహలాడుతోంది. విండీస్‌పై సాధించిన విజయం ఆస్ట్రేలియా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందనే చెప్పాలి. ఏమాత్రం ఆశలు లేని స్థితి నుంచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. స్మిత్ ఫామ్‌లోకి రావడం జట్టుకు శుభపరిణామంగా చెప్పాలి. ఇప్పటి వరకు పెద్దగా ప్రభావం చూపని డేవిడ్ వార్నర్, అరోన్ ఫించ్‌లు విజృంభిస్తే ఆస్ట్రేలియాకు ఎదురే ఉండదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాట్స్‌మెన్, బౌలర్లు ఆస్ట్రేలియాకు అందుబాటులో ఉన్నారు. ఫించ్, వార్నర్, స్మిత్, ఖ్వాజా, మాక్స్‌వెల్, స్టోయినిస్, కౌల్టర్ నైల్, కారే తదితరులతో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. కమిన్స్, స్టార్క్, నైల్, జంపా తదితరులతో బౌలింగ్ కూడా బాగానే కనిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
జట్ల వివరాలు:
భారత్ (అంచనా): విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్, మహేంద్ర సింగ్ ధోని, కేదార్ జాదవ్/మహ్మద్ షమి, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, చాహల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా.
ఆస్ట్రేలియా (అంచనా): అరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖ్వాజా, స్మిత్, మాక్స్‌వెల్, స్టోయినిస్, కారే, కౌల్టర్ నైల్, కమిన్స్, జంపా, మిఛెల్ స్టార్క్.

World Cup 2019: IND vs AUS Match today

Related Articles

- Advertisement -

Latest Articles