Home తాజా వార్తలు ఈ ప్రపంచకప్‌ చాలెంజింగ్‌తో కూడినది: కోహ్లీ

ఈ ప్రపంచకప్‌ చాలెంజింగ్‌తో కూడినది: కోహ్లీ

 

ముంబయి:ఇంగ్లండ్ వేదికగా జరిగే ప్రపంచకప్ సవాలు వంటిదేనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. ప్రపంచకప్ నేపథ్యంలో విరాట్ కోహ్లి టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రితో కలిసి మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడాడు. గతంతో పోల్చితే ఈసారి ప్రపంచకప్‌లో పోటీ తీవ్రంగా ఉంటుందన్నాడు. ఒత్తిడిని జయించి ముందుకు సాగే జట్టుకే ట్రోఫీ దక్కుతుందన్నాడు. ప్రపంచకప్‌కు సమరోత్సాహంతో సిద్ధమయ్యామన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగా ఉందన్నాడు. ప్రపంచకప్ గెలిచే సత్తా టీమిండియాకు ఉందన్నాడు. సమష్టిగా పోరాడితే ఇంగ్లండ్ గడ్డపై మరోసారి చారిత్రక విజయం ఖాయమన్నాడు. వరల్డ్‌కప్ కోసం ఆటగాళ్లందరూ ఎంతో అతృతతో ఎదురు చూస్తున్నారన్నాడు. ఇక, మెగా టోర్నమెంట్‌లో ఒత్తిడిని అధిగమించడమే చాలా ముఖ్యమన్నాడు. ప్రపంచకప్‌లో పాల్గొంటున్న ప్రతి జట్టు బలమైనదేనని, ఏమాత్రం ఒత్తిడికి గురైనా ఫలితం తారుమారు కావడం తథ్యమన్నాడు. ప్రతి మ్యాచ్ కీలకమేనని, దేన్ని కూడా తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదన్నాడు. ప్రస్తుత జట్టు సమతూకంగా ఉందన్నాడు. రానున్న ప్రపంచకప్‌లో మెరుగైన ప్రదర్శన కనబరచడమే లక్షంగా పెట్టుకున్నట్టు కోహ్లి స్పష్టం చేశాడు. ఇప్పటివరకు తాను ఎన్నో ప్రపంచకప్‌లు ఆడానని, అన్నింటికంటే ఇదే అత్యంత ఛాలెంజింగ్ ప్రపంచకప్ అనడంలో సందేహం లేదన్నాడు. ఇందులో పాల్గొంటున్న ప్రతి జట్టు కూడా ట్రోఫీని సాధించడం లక్షంగా పెట్టుకున్నాయన్నాడు. అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌లను కూడా తక్కువ అంచన వేసే పరిస్థితి లేదన్నాడు. 1983లో భారత్ కూడా ఎలాంటి అంచనాలు లేకుండానే ప్రపంచకప్ గెలిచిన విషయాన్ని మరువకూడదన్నాడు. ఇలాంటి నేపథ్యంలో ప్రతి మ్యాచ్ గెలవడం అన్ని జట్లకు ప్రధాన లక్షంగా మారిందన్నాడు.
ప్రత్యేక ప్రణాళికతో
ఇక, ఈ ప్రపంచకప్‌కు ప్రత్యేక ప్రణాళికతో సిద్ధమవుతున్నట్టు కోహ్లి వివరించాడు. ప్రతి మ్యాచ్ కోసం ప్రత్యేక వ్యూహ రచనలు ఉంటాయన్నాడు. ప్రతి ఆటగాడు సామర్థం మేరకు ఆడేలా చూస్తామన్నాడు. ఒత్తిడిని దరిచేరకుండా సహాజ సిద్ధ ఆటతో ముందుకు సాగాలని సహచరులకు సూచించాడు. గతంతో పోల్చితే భారత్ ప్రస్తుతం అన్ని విభాగాల్లో చాలా బలంగా మారిందన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమంగా ఉందన్నాడు. ఈ ప్రపంచకప్‌లో ఫాస్ట్ బౌలర్లు కీలకపాత్ర పోషించడం ఖాయమన్నాడు. భువనేశ్వర్, బుమ్రా, షమి, హార్దిక్‌లతో బౌలింగ్ చాలా బలంగా మారిందన్నాడు. ఇటీవల ముగిసిన ఐపిఎల్‌లో బుమ్రా, హార్దిక్, ధోని, రోహిత్‌లు నిలకడగా రాణించడం జట్టుకు శుభపరిణామంగా చెప్పాడు. కుల్దీప్, చాహల్‌ల బౌలింగ్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు. ప్రపంచకప్‌లో వీరు మెరుపులు మెరిపించడం తథ్యమన్నాడు. ఇక, కేదార్ జాదవ్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని, ప్రపంచకప్‌కు సమరోత్సాహంతో సిద్ధమవుతున్నాడని వివరించాడు. మరోవైపు జట్టులో చిన్నచిన్న సమస్యలు ఉన్నా టోర్నీ ప్రారంభం నాటికి అన్ని సర్దుకుంటాయని కోహ్లి పేర్కొన్నాడు.
ధోనిదే కీలక పాత్ర
ఇక, ప్రధాన కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ ప్రపంచకప్‌లో టీమిండియా మెరుగైన ప్రదర్శన కనబరచడం ఖాయమన్నాడు. జట్టు సమతూకంగా ఉందన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో మెరికల్లాంటి ఆటగాళ్లు జట్టులో ఉన్నారన్నాడు. ఇక, సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని ప్రపంచకప్‌లో కీలకపాత్ర పోషిస్తాడనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. భారత క్రికెట్‌కు లభించిన ఆణిముత్యాల్లో ధోని ఒకడన్నాడు. అతనికి సాటివచ్చే క్రికెటర్ ఎవరూ లేరన్నాడు. అతనిలా అంకితభావంతో ఆడడం అందరికి సాధ్యం కాదన్నాడు. ఈ ప్రపంచకప్‌లో ధోని ఆడడం భారత్‌కు కలిసివచ్చే అంశంగా చెప్పాడు. మరోవైపు ఇంగ్లండ్ పిచ్‌లపై కూడా ధోనికి మంచి అవగాహన ఉందన్నాడు. ఈసారి భారత్ మెరుగైన ఆటను కనబరుస్తుందనే నమ్మకం తనకుందన్నాడు. జాదవ్ గాయం నుంచి కోలుకున్నాడని, అతను పూర్తి ఫిట్‌నెస్‌ను సంతరించుకున్నాడని వివరించాడు. ఇక, ప్రపంచకప్‌లో పోటీ తీవ్రంగా ఉంటుందన్నాడు. మెరుగ్గా ఆడే జట్టుకే విజయవకాశాలు అధికంగా ఉంటాయన్నాడు. ప్రతి జట్టు బలమైనదేనని, ఎవరిని తక్కువ అంచన వేయలేమన్నాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ వంటి జట్లతో భారత్‌కు గట్టి పోటీ నెలకొందన్నాడు. కాగా, ఈసారి ట్రోఫీని గెలవడమే లక్షంగా పెట్టుకున్నామని, ఇందులో సఫలమవుతామనే నమ్మకం ఉందని శాస్త్రి స్పష్టం చేశాడు.

World Cup 2019 will be most challenging World Cup: kohli