Tuesday, April 16, 2024

సరిహద్దు పేచీకి సరైన పరిష్కారం

- Advertisement -
- Advertisement -

World has become Lockdown

 

కరోనా వైరస్ ఇరుగు పొరుగులను సైతం ఎడమొగం పెడమొగంగా చేస్తున్నది. ఎవరికి వారు తలుపులు మూసుకొని ఏకాంత తపస్సు చేసుకోవలసిన పరిస్థితిని సృష్టించింది. ఆత్మరక్షణే ప్రధానమై భౌతిక దూరాన్ని పాటించడం తప్పనిసరి అవుతున్నది. రాష్ట్రాల మధ్య కూడా ఇదే నడుస్తున్నది. దేశాల మధ్య సరేసరి, విమానాశ్రయాల మూసివేతతో ప్రపంచమే లాక్‌డౌన్‌ల మయమైపోయింది. సరిహద్దులన్నింటికీ తాళాలు బిగించారు. కర్నాటక తనకు 6 రాష్ట్రాలతో గల సరిహద్దుల మూసివేతకు గత నెల 23న తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. చివరికి సుప్రీంకోర్టు జోక్యంతో వివాదం సద్దుమణిగింది. కర్నాటకకు కేరళ, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గోవాలతో సరిహద్దులున్నాయి. కర్నాటక మూసివేత చర్యపై కేరళ ముందు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. అంతర్రాష్ట్ర రోడ్ల మూసివేతను ఎత్తివేయవలసిందిగా కర్నాటకను ఆదేశించే అధికారం జాతీయ రహదారులపై అదుపాజ్ఞలున్న కేంద్రానికి కూడా ఉన్నదని ఇలా రోడ్లను బంద్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని కేరళ వాదించింది.

దానితో సరిహద్దుల మూసివేతను తొలగించేలా చూడాలని ఈ నెల 1వ తేదీన కేరళ హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కేరళ రాష్ట్రం ఉత్తరాన గల కాసర్ గోడ్ జిల్లాకు ఆనుకొని ఉన్న దక్షిణ కర్నాటక జిల్లాలోని మంగళూరు పట్టణం కేరళకు చాలా ముఖ్యమైనది. కాసర్ గోడ్ జిల్లాలోని మంజేశ్వర్ తాలూకా కేంద్రం నుంచి మంగళూరు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేరళ నుంచి రోగులు వైద్యానికి తరచూ మంగళూరుకు వెళుతుంటారు. అంబులెన్సు వాహనాలు నిత్యం తిరుగుతుంటాయి. కేరళ టూరిస్టు రాష్ట్రమేగాని నిత్యావసర సరకులను చాలినంతగా పండించదు. వాటి కోసం పొరుగు రాష్ట్రాలపై ఆధారపడి ఉంది. సరిహద్దులు తెరవాలని కేరళ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత కూడా కర్నాటక తీరులో మార్పు రాలేదని తమ రాష్ట్రం నుంచి వెళ్లే రోగులను చేర్చుకోవద్దని మంగళూరు ఆసుపత్రులకు దక్షిణ కన్నడ జిల్లా వైద్యాధికారి ఆదేశించారని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేరళ పేర్కొన్నది.

కేరళ హైకోర్టు ఆదేశాల మీద కర్నాటక, సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకున్నది. అంతకు ముందే కాసర్‌గోడ్ పార్లమెంటు సభ్యుడు సరిహద్దులను తెరిపించవలసిందని కోరుతూ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కర్నాటక సరిహద్దులను మూసివేసినందువల్ల తమ 8 మంది రోగులు సకాల చికిత్స అందక అకాల మరణం చెందారని కూడా కేరళ సుప్రీంకోర్టుకు విన్నవించుకున్నది. కేరళ దేశంలోనే ముందుగా కరోనా వ్యాధి ప్రబలిన రాష్ట్రం కాబట్టి అక్కడి నుంచి వచ్చే వారెవరినుంచైనా తమ సరిహద్దు జిల్లాల ప్రజలకు వైరస్ సోకే ప్రమాదముందని వారి ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత తనకున్నదని కర్నాటక ప్రభుత్వం వాదించింది. గల్ఫ్ నుంచి చాలా మంది కేరళలోని కాసర్‌గోడ్, కన్నూర్, పతనం తిట్ట, కోజికోడ్ జిల్లాలకు తరచూ వస్తుంటారని అలా వచ్చిన ఒక మాజీ ఆటో రిక్షా డ్రైవర్ ఈ జిల్లాల్లో తిరిగాడని అతడు కలిసిన ఇద్దరు కేరళ ఎంఎల్‌ఎలు సహా పలువురు క్వారంటైన్‌లో ఉన్నారని కర్నాటక అధికార్లు చెబుతున్నారు.

సుప్రీంకోర్టు తన వద్ద గల పిటిషన్లపై విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేస్తూ ఆలోగా రెండు రాష్ట్రాలతో మాట్లాడవలసిందని కేంద్రాన్ని ఆదేశించింది. తలపాడి వద్ద గల అంతర్రాష్ట్ర సరిహద్దును కేరళ రోగుల కోసం తెరిచేలా ఒక ఒప్పందానికి వచ్చేటట్టు చూడాలని సూచించింది. దానితో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి రెండు రాష్ట్రాలను సమావేశపరిచింది. కరోనా సోకిన వారు మినహా ఇతర రోగులు కేరళ నుంచి మంగళూరుకు చికిత్స నిమిత్తం రావడానికి కర్నాటక అనుమతించేలా ఒప్పందం కుదిరింది. దీనితో కథ సుఖాంతమయింది. ఈ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేయడంతో అక్కడ కేసును కొట్టి వేశారు. రాష్ట్రాల మధ్యగాని, ఇరుగుపొరుగుల మధ్యగాని రహదారి సంబంధమైన వివాదాలు తలెత్తిప్పుడు వారు పరస్పరం చర్చించుకొని తగిన పరిష్కారాన్ని సాధించుకోడం ఆదర్శమైన విధానం.

రాజ్యాంగం దేశంలో ఒక చోటి నుంచి ఇంకొక చోటికి వెళ్లడానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నది. కాని కరోనా వంటి పెను విపత్తులు వచ్చినప్పుడు అన్నింటికంటే ప్రాణాలు కాపాడడమనేది ముఖ్యమవుతుంది. అటువంటప్పుడు సరిహద్దుల మూసివేతను అభ్యంతర పెట్టలేము. కాని వైద్య అవసరాల కోసమో ప్రాణావసరాలయిన మందులు ఇతర సరుకులు తెచ్చుకోడం కోసమో దారిని తెరిపించాల్సిందిగా న్యాయ స్థానాన్ని ఆశ్రయించడం దాని ఆదేశాలతో ఉభయ వర్గాలు ఒక పరిష్కారాన్ని కనుగొనడం మంచి పద్ధతి. వివాదాన్ని వాయిదాలతో పొడిగించకుండా వివాదాంశం అత్యవసర లక్షణాన్ని గ్రహించి ఈ విషయంలో సుప్రీంకోర్టు అనుసరించిన పద్ధతి అత్యంత ప్రశంసనీయమైనది.

 

World has become Lockdown
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News